బాట మాటున కాసుల వేట
-
అధికార పార్టీ నాయకద్వయం అవినీతి బాగోతం
-
వంతాడ మైనింగ్ నిర్వాహకుల లబ్ధికి ఆరాటం
-
ఎన్‌హెచ్ నుంచి లంపకలోవ మీదుగా బీటీ రోడ్డు నిర్మాణం
-
ఆర్ అండ్ బీ శాఖ నుంచి రూ.10 కోట్లు విడుదల
ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెక్కు గ్రామాల వారికి ప్రయాణమంటే.. ఒళ్లు హూనమయ్యే ప్రయాస. ఏ అవసరానికి ఊరు కదలాల్సి వచ్చినా.. అదో వ్యధ. ఏళ్ల తరబడి దుస్థితిలో ఉన్న రహదారులే అందుకు కారణం. ఆ దుస్థితికి మూలం ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులే. అదే నియోజకవర్గంలో ప్రస్తుతం 16 కిలోమీటర్ల మేర ఓ రోడ్డు నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అంత అత్యవసరంగా రూ.10 కోట్లతో ఆ రహదారి పనులను చేపట్టడం వెనుక ప్రజాప్రయోజనాకాంక్ష అణుమాత్రం లేదు. ఉన్నదల్లా.. కేవలం వంతాడ మైనింగ్ యాజమాన్యానికి మేలు చేకూర్చాలన్న అధికారపార్టీ ముఖ్యనేతల ఆరాటం మాత్రమే. ఆ ఆరాటం వెనుక వారికి కొన్ని కోట్లు దక్కాయన్న ఆరోపణ వినిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
‘బాబూ! బురదలో నడవలేకపోతున్నాం. కాస్తంత దారి చూపండి’ అంటూ చాలా గ్రామాల్లో ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకోని పాలకులు.. ‘పర్సంటేజీలు’ వస్తాయంటే మాత్రం ఎగిరి గంతేసి ఒకే రోడ్డుకు ఎన్ని కోట్లు విడుదల చేయించడానికైనా ఉత్సాహపడుతున్నారు. జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందినlఇద్దరు ముఖ్యనేతలు ఇప్పుడదే చేస్తున్నారు. ఓ మైనింగ్ నిర్వాహకులకు లబ్ధి చేకూర్చేందుకు రూ.10 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారు.
ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో లంపకలోవ గ్రామం ఉంది. జనాభా సుమారు ఐదువేలు. గ్రామం నుంచి జాతీయరహదారికి 3.7 మీటర్ల వెడల్పున ఉన్న ఆర్‌అండ్‌బి రహదారి ప్రస్తుతం అదే నియోజకవర్గంలోని అనేక రహదారుల కన్నా మంచి స్థితిలోనే ఉంది. అయితే ఆ ఒక్క రోడ్డును 3.7 మీటర్ల నుంచి ఏడు మీటర్లకు విస్తరించి బీటీ రోడ్డుగా నిర్మిస్తున్నారు. అంతేకాదు.. లంపకలోవ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతున్న వంతాడ వరకూ రోడ్డును అదేస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల మెుదలైన ఆ రోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అదంతా ఆ గ్రామంపై నేతలకున్న ప్రేమ కాదని, కేవలం వంతాడ మైనింగ్‌కు చెందిన భారీవాహనాలు ప్రయాణించేందుకేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లంపకలోవకు 8 కిలోమీటర్ల దూరంలో వంతాడ వద్ద కోట్ల కోట్ల విలువైన లాటరైట్ మైనింగ్ జరుగుతోంది. అక్కడ నుంచి జాతీయరహదారికి 16 కిలోమీటర్లు. మైనింగ్ జరిగే ప్రదేశం నుంచి లంపకలోవ శివారు వరకు నిర్వాహకులే గ్రావెల్‌రోడ్డు నిర్మించుకున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారపార్టీకి చెందిన ఇద్దరు నేతలు మైనింగ్ నిర్వాహకుల మేలు కోసం నడుం బిగించారు. ఆర్ అండ్ బీ నుంచి రూ.10 కోట్లు విడుదల చేయించారు. ఆ సొమ్ముతోనే జాతీయ రహదారి నుంచి లంపకలోవ వరకూ, అక్కడి నుంచి మైనింగ్ జరిగే ప్రాంతం వరకూ బీటీ రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరు నేతలకు ఎవరి వాటా వారికి దక్కిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం మైనింగ్ వాహనాల కోసమే రోడ్డు వేయిస్తున్నారు తమపై అభిమానంతో కాదని గ్రామస్తులే అంటున్నారు.
ఈ బాటల దుస్థితి కానరాదా?
ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే అనేక రహదారులు పెద్దపెద్ద గోతులతో ప్రయాణం ప్రమాదభరితమనిపించేలా ఉన్నాయి. వాటిలో ఆర్‌అండ్‌బీ రహదారులు చాలానే ఉన్నాయి. రౌతులపూడి మండలం మెరకచామవరం నుంచి పారుపాక (5 కిలోమీటర్లు), శంఖవరం మండలం కత్తిపూడి నుంచి శంఖవరం (9 కిలోమీటర్లు), ఏలేశ్వరం మండలం భద్రవరం నుంచి ప్రత్తిపాడు మండలం శాంతిఆశ్రమం (30 కిలోమీటర్లు), ప్రత్తిపాడు మండలం రాచపల్లి నుంచి పెద్దిపాలెం (10 కిలోమీటర్లు) రోడ్లు అధ్వానస్థితికి చేరాయి. వీటిలో అనేక రోడ్లు పదుల కొద్దీ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధానికి ఆధారమైనవి. కొన్ని రోడ్లు ఆటోలు సైతం తిరగలేనంత దుస్థితిలో ఉన్నాయి. ఏలేశ్వరం నుంచి ఏజెన్సీ మండలాలైన అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, విశాఖ జిల్లా నర్సీపట్నం తదితర ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణించే రహదారి అధ్వానంగా తయారై మూడేళ్లు గడుస్తున్నా ముఖ్య ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇదే నియోజకవర్గంలో మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి నyì చి వెళ్లేందుకు రహదారులు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అనీఇన్నీ కావు. అటువంటిది లంపకలోవ పేరుచెప్పి ఒకే రోడ్డుకు రూ.10 కోట్లు ఎలా వెచ్చిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకో గ్రామానికి కోటి కేటాయించినా పది రోడ్లు బాగుపడేవంటున్నారు. ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి కేవలం మైనింగ్ నిర్వాహకుల కోసం ఆగమేఘాలపై రోడ్డు వేస్తున్న పాలకుల తీరును ప్రజలు గర్హిస్తున్నారు.
మైనింగ్ మాఫియా కోసమే ఆ రహదారి
మైనింగ్ మాఫియా కోసం ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు. లంపకలోవ నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోంది. ముమ్మాటికీ మైనింగ్ కోసమే ఆ రహదారి.
–కొశిరెడ్డి గణేష్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యుడు
ప్రజాధనం వృథాపై విచారణ జరిపించాలి..
కోట్లాది రూపాయలతో రహదారి నిర్మిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి ఆ రోడ్డుకు వెచ్చించే నిధులతో పలు రహదారులు బాగుపడేవి.
–కందా నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు