
సాక్షి, అమరావతి: గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవున కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. పీఎంజీఎస్‌వైలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 40:60 నిష్పత్తిన మొత్తం రూ.1,110.1 కోట్లు వెచ్చించనున్నాయి. దీన్లో రూ.607.87 కోట్లతో 976 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనుండగా, రూ.502.23 కోట్లతో 76 బ్రిడ్జిలు నిర్మిస్తారు.
జిల్లాల వారీగా కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలతో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. దీనికి తుది ఆమోదం కోసం ఉగాది పండుగ రోజు (ఈ నెల 22న) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల సమావేశం జరగనుంది.
ఈ సమావేశం లాంఛనమేనని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నింటికీ కేంద్రం ఇప్పటికే సూత్రపాత్రయంగా అంగీకారం తెలిపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలో 1,291 కిలోమీటర్ల పొడవున 268 కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిచేసినట్టు తెలిపారు. వాటికి సంబందించి జనవరి నెలాఖరు వరకు బిల్లులను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment