మెరుపు రోడ్లు
కొత్త రహదారుల నిర్మాణం సిద్ధమవుతున్న జీహెచ్‌ఎంసీ
200 కి.మీ.ల వైట్‌టాపింగ్, 200 కి.మీ.లు
బీటీ రోడ్ల ఎంపికకు కసరత్తు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో 400 కి.మీ.ల మేర కొత్త రోడ్లు రానున్నాయి. వీటిల్లో 200 కి.మీ.లు బీటీ రోడ్లు... మరో 200 కి.మీ.లు వైట్ టాపింగ్ రోడ్లు వేయాలని యోచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో అన్ని రకాల రోడ్లు దాదాపు 8 వేల కి.మీ.ల మేర ఉన్నాయి. వీటికి మరమ్మతుల పేరిట ఏటా దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా... నాలుగు చినుకులు పడగానే పరిస్థితి షరా మామూలుగా మారుతోంది. ఇటీవల బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో నిర్మించిన వైట్‌టాపింగ్ రోడ్డు బాగుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. దీంతో గ్రేటర్‌లోని ఐదు జోన్లకుగాను ఒక్కో దానిలో 40 కి.మీ.ల వంతున వైట్‌టాపింగ్ రోడ్లు వేయాలని భావిస్తున్నారు. మరో 40 కి.మీ.ల మేర బీటీ రోడ్లు వేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మార్గాలు ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే పనులు మొదలు పెడతారు.
వైట్‌టాపింగ్‌తో మేలని...
బీటీ రోడ్లు వేసిన మూణ్నాళ్లకే కొట్టుకుపోతుండటంతో ఖర్చు ఎక్కువైనా వైట్‌టాపింగ్ రోడ్లే మేలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ భావిస్తున్నారు. నగరానికి ఇవి అనువైనవే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి కాబట్టి వీటిని నిర్మించాక రోడ్ల నిర్వహణ, మరమ్మతుల వ్యయాలు చాలా వరకు తగ్గుతాయి. వైట్‌టాపింగ్ రోడ్ల నిర్మాణానికి రెండు పద్ధతులను కమిషనర్ ఆలోచిస్తున్నారు. యధావిధిగా టెండర్లు పిలిచి కొన్ని మార్గాల్లో వైట్‌టాపింగ్ పనులు చేయాలని భావిస్తుండగా... మరికొన్ని మార్గాలకు సిమెంటు కంపెనీల యాజమాన్యాల సమాఖ్య సహకారంతో తక్కువ ఖర్చుతో నామినేషన్‌పై ఇవ్వాలని భావిస్తున్నారు. ఈమేరకు వారితో సంప్రదించిన కమిషనర్ వీలైనంత తక్కువ ఖర్చుతో వైట్‌టాపింగ్ రోడ్లు వేయాల్సిందిగా కోరినట్లు తెలిసింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రయోగాత్మకంగా నిర్మించిన రోడ్డును సమాఖ్య ఉచితంగానే నిర్మించింది. సిమెంటు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నందున, రాష్ట్ర రాజధాని నగరంలో వైట్‌టాపింగ్ రహదారులు వేయడం ద్వారా నగర ప్రతిష్ట పెరుగుతుందని... అందుకుగాను తగిన సహకారం అందించాల్సిందిగా కమిషనర్ వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.