షాజహాన్‌పూర్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
షాజహాన్‌పూర్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని 12 జిల్లాల మీదుగా సాగే ప్రతిష్టాత్మక ఆరు వరసల గంగా ఎక్స్‌ప్రెస్‌వే రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.36,230 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఉత్తరప్రదేశ్ వాయవ్య ప్రాంత జిల్లాల భవిష్యత్ రూపురేఖలు మారిపోతాయన్నారు. షాజహాన్‌పూర్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.
రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడయ్యారని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. యూపీలో మాఫియా భరతం పట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, యోగి ఎంతో ఉపయోగపడే ముఖ్యమంత్రిగా అవతరించారన్నారు. యూపీకి యోగి తోడైతే రాష్ట్ర ప్రజలకు మరెంతో ఉపయోగకరమంటూ, యూపీ+యోగి= ఉపయోగి (UP+ YOGI = U.P.Y.O.G.I) అనే కొత్త నిర్వచనాన్ని చెప్పి ఆదిత్యనాథ్‌పై మోదీ పొగడ్తల వర్షం కురిపించారు.
మీరట్, హర్‌పూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదాయూ, షాజహాన్‌పూర్, హర్‌దోయీ, ఉన్నవ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్.. మొత్తంగా 12 జిల్లాల గుండా 594 కి.మీ.ల పొడవైన ఆరు వరసల రహదారిని నిర్మించనున్నారు. ‘ఈ గంగా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే ఈ జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటక రంగాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. తద్వారా రైతులు, యువత సహా ప్రతి ఒక్కరికి వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పశ్చిమప్రాంతంలో దేశీ తుపాకులతో మాఫియా రాజ్యమేలింది.
కానీ, యోగి ప్రభుత్వమొచ్చాక గత నాలుగున్నరేళ్ల కాలంలో మాఫియా అక్రమ సామ్రాజ్యాలను బుల్డోజర్‌తో తొక్కించేశారు. గత ప్రభుత్వాలకు అభివృద్ధి, దేశ వారసత్వం అంటే అస్సలు పట్టదు. వారి ధ్యాస అంతా ఓటు బ్యాంక్‌పైనే. కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్, నూతన విమానాశ్రయం, కొత్త రైలు మార్గాలతో నవీకరించిన మౌలికసదుపాయాలతో ఆధునిక యూపీ అవతరించబోతోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ చేసిన యోగ ఉపయోగి వ్యాఖ్యలను ఎస్‌పీ, బీఎస్‌పీలు తిప్పికొట్టాయి. ఆయన ‘ఉత్తరప్రదేశ్‌కు పనికిరాడు, నిరుపయోగి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment