బులంద్‌షెహర్/రేవారీ: ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ లేదు లేదంటూనే ఎన్నికల ఊసెత్తి పరోక్షంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్ జిల్లాలో రూ.19,100 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం యావత్తూ ప్రచారధోరణిలోనే కొనసాగింది. ‘‘ నేను ప్రత్యేకంగా ఎన్నికల సమర నినాదం ఇవ్వాల్సిన పని లేదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు.
మోదీ గ్యారెంటీల బండి ప్రతి ఒక్క లబి్ధదారుని చెంతకొస్తుంది. ప్రభుత్వ పథకాలు చిట్టచివరి లబ్ధిదారునికి చేరిన నాడు సమాజంలో వివక్ష, అవినీతి అనేవే ఉండవు. అదే అసలైన లౌకికవాదం. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాకారమైనట్లు లెక్క. మీరే నా కుటుంబం. మీ కలలే నాకు సంకల్పాలు. మీలాంటి సాధారణ కుటుంబాలు ఆర్థికాభివృద్దితో సాధికారత సాధించినప్పుడే నా ‘ఆస్తి’ మరింత పెరిగినట్లు సంతోషిస్తా. మా ప్రభుత్వం ఏం చెబుతోందో దానిని చేసి చూపిస్తుంది. మీరు సంతృప్తి చెందే గ్యారెంటీ నాది. 100 శాతం లబి్ధదారులకు పథకాలు చేరేలా నేను కృషిచేస్తా’’ అని మోదీ ప్రకటించారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
‘‘ చాన్నాళ్ల క్రితం ఒకరు గరీభీ హఠావో అని గట్టిగానే నినదించారు. కానీ సామాజిక న్యాయం కలగానే మిగిలిపోయింది. కొందరు మాత్రమే సంపన్నులై, వారి రాజకీయాలు మాత్రమే నడవడం పేదలు కళ్లారా చూశారు’’ అని కాంగ్రెస్‌ను విమర్శించారు. ‘‘ ఈ రోజు కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రచారానికి నేను శ్రీకారం చుడుతున్నానని మీడియాలో ప్రచారం జరిగింది. నేను ఆ పని అస్సలు చేయను. నాకు అవసరం లేదు కూడా.
బీజేపీకి భవిష్యత్తులో కూడా ఆ అవసరం పడదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. ప్రజలే నా కోసం ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నపుడు నేను ప్రత్యేకంగా ప్రచారానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. నా సమయమంతా ప్రజాసేవకే కేటాయిస్తాను. అభివృద్ది నినాదం మాత్రమే నేను ఇస్తా. దానినిప్రజలే ఎన్నికల సమర నినాదంగా దేశవ్యాప్తంగా మార్మోగిస్తారు’ అని సభికుల హర్షధ్వానాల మధ్య మోదీ అన్నారు.
కుటుంబ పారీ్టలను ఓడించండి
మరోవైపు, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా యువ ఓటర్లతో మాట్లాడారు. ‘‘ లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ పారీ్టలను ఓడించండి. భారత దేశ దశ, దిశలను నిర్ణయించే సత్తా యువ ఓటర్లకు ఉంది. పది, పన్నెండేళ్ల క్రితం నాటి ప్రభుత్వాల పాలనలో నాటి యువత అంధకారంలో మగ్గిపోయింది. మేమొచ్చాక దేశాన్ని అంధకారం నుంచి బయటికి తెచ్చాం. ఇప్పుడు యువతరానికి అవకాశాలు మెరుగయ్యాయి. బీజేపీ మేనిఫెస్టోకు మీరూ సలహాలు, సూచనలను నమో యాప్ ద్వారా పంపండి. మీ చక్కని ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు బీజేపీ ప్రయతి్నస్తుంది’’ అని యువ ఓటర్లకు మోదీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment