సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానికి జీవనాడిగా భాసిల్లుతున్న చారిత్రక మూసీ నదిపై ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు వీలుగా సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలో మూసీ ప్రవహిస్తున్న బాపూఘాట్–నల్లచెరువు(ఉప్పల్) మార్గంలో 40 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని, నదికి ఇరువైపులా తీరైన రహదారులను అభివృద్ధి చేయాలని సూచించారు. గురువారం సైఫాబాద్‌లోని మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో నది సుందరీకరణ, నగరంలో ఇతర చెరువుల పరిరక్షణపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
డ్రోన్ కెమెరాలతో సర్వే..
మూసీ నది మొత్తాన్ని డ్రోన్ కెమెరాలు, ఇతర అత్యాధునిక టెక్నాలజీతో సర్వే చేయాలని, ఇందుకయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. మూసీ నది వెంట ప్రస్తుతం ఉన్న రోడ్లకు అనుబంధంగా రూపకల్పన చేస్తున్న బ్రిడ్జీల డిజైన్లు, నిర్మాణం నగర చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలున్న చెరువులను దీర్ఘకాల ప్రణాళికలు సిద్ధం చేసి దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ఈ వర్షాకాలం నాటికి 50 చెరువుల అభివృద్ధికి లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 20 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. దుర్గంచెరువు సుందరీకరణ శరవేగంగా సాగుతోందన్నారు. చెరువులు కబ్జా కాకుండా చూసేందుకు కలెక్టర్లతో మాట్లాడాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
మూసీ దుస్థితి ఇదీ..
వికారాబాద్ జిల్లా అనంతగిరి మూసీ జన్మస్థానం. అక్కడి నుంచి సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి బాపూఘాట్ వద్ద హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కిలోమీటర్ల మార్గంలో ప్రవహిస్తోంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి 1,400 మిలియన్ లీటర్ల మురుగునీరు నిత్యం నదిలోకి ప్రవేశిస్తోంది. దీంతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతోంది.
కాగా మూసీలోకి చేరుతున్న వ్యర్థజలాలను నాగోల్, నల్లచెరువు, అత్తాపూర్, అంబర్‌పేట్‌లోని జలమండలి మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో 700 మిలియన్ లీటర్లను శుద్ధిచేసి మళ్లీ నదిలోకి వదిలిపెడుతోంది. ఇందుకు ఏటా రూ.10 కోట్లు వెచ్చిస్తోంది. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు పది చోట్ల నూతనంగా మురుగునీటిశుద్ధి కేంద్రాలు, రెండుచోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాలని జలమండలి రూ.1,200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రక్షాళన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో జాతీయ స్థాయిలో కాలుష్యకారక నదుల్లో మూసీ నాలుగో స్థానంలో నిలవడం నది దుస్థితికి అద్దం పడుతోంది.
మూసీ ప్రక్షాళన కాగితాలకే పరిమితం..
మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ఏళ్లుగా కాగితాలకే పరిమితమవడంతో ఘన, ద్రవ, రసాయన వ్యర్థాల చేరికతో నది కాలుష్య కాసారమవుతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రక్షాళనకు బాలారిష్టాలు తప్పడంలేదు. గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలన్న రాష్ట్ర సర్కారు సంకల్పం బాగానే ఉన్నా.. ఆచరణలో అడుగు ముందుకు పడటంలేదు.
మూసీ తీరప్రాంత అభివృద్ధికి రూ.3 వేల కోట్ల అంచనా వ్యయం, సుందరీకరణకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రక్షాళన పనులు చేపట్టాల్సి ఉన్నా ఆచరణ మాత్రం శూన్యం. ఏడాది క్రితం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యకార్యదర్శిని నియమించినా ఫలితం కనిపించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment