మూసీ నదీ గర్భంలోని ఇళ్లపై సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
చట్టప్రకారం చర్యలు తీసుకున్నాకే కూల్చివేత చేపడుతున్నామన్న ఏఏజీ
ముందుగా నోటీసులు కూడా జారీ చేస్తున్నామని వివరణ
ఈ వివరాలను నమోదు చేసుకున్న ధర్మాసనం
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, హైడ్రాకు ఆదేశం
విచారణ 3 వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ నదీ గర్భం (రివర్ బెడ్)లో నిర్మాణం చేపట్టారంటూ మార్కింగ్ చేసిన ఇళ్లను పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా? నోటీ సులు జారీ సహా చట్టప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను పాటిస్తున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ సమాధానమిచ్చారు.
పరిహారంపై నిర్వాసితులతో మాట్లాడి, వారు సమ్మతించిన తర్వాతే ఇళ్ల కూల్చివేత చేపడుతున్నామని కోర్టుకు వివరించారు. ఏఏజీ చెప్పిన అంశాలను నమోదు చేసుకుంటున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు హైడ్రాను ఆదేశించింది.
కేఏ పాల్ పిటిషన్ మేరకు..
‘‘మూసీకి సంబంధించి సరైన సర్వే నిర్వహించి, ఆక్రమణలను గుర్తించే వరకు భవనాలను కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలని.. బాధితులకు నోటీసులు ఇచ్చి, ఇళ్లు ఖాళీ చేయడానికి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుల ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
పారదర్శకంగా చర్యలు: ఏఏజీ
విచారణ సందర్భంగా ఏఏజీ ఎక్కడ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయ వాదులు హాజరుకాకుంటే ఎలాగని, పిటిషనర్ల వాదనలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొంది. దీనితో ఏఏజీ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. ‘‘చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే ప్రభుత్వం ముందుకెళ్తోంది.
నోటీసు లిచ్చి సమయం ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు చేప డుతున్నాం. ప్రజలందరి విషయంలో ఒకేలా వ్యవ హరిస్తున్నాం. తారతమ్యాలు లేవు. పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా చర్యలు చేపడుతున్నాం’’ అని వివరించారు. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఏర్పాటైందని.. రివర్ బెడ్‌లోని ఇళ్లకు మార్కింగ్ మాత్రమే చేసిందని, ఇంకా కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు.
హైడ్రాకు చట్టబద్ధత ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏఏజీ వాదనలను రికార్డు చేశామని, ఈ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.
బాధితుల్లో ఎక్కువ మంది పేదలే..: పాల్
విచారణ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ తానే వాదనలు వినిపించారు. ‘‘ఆక్రమణదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిజిస్ట్రేషన్, విద్యుత్, నిర్మాణ, నల్లా అనుమతులు ఇచ్చిన అధికారులు అందరూ ఆనందంగానే ఉన్నారు. అనుమతులు ఉన్నాయి కదా అని కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారే రోడ్డున పడుతున్నారు. ‘హైడ్రా’ బాధితుల్లో ఎక్కువ మంది వారే. 462 నిర్మాణాలను, భవనాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు.
ఎన్ కన్వెన్షన్‌ను ఒక్కరోజులో కూల్చిన అధికారులు.. దాదాపు 250 మంది పెద్దలకు మాత్రం నోటీసులు జారీ చేసి వదిలేశారు. పేద, మధ్యతరగతికి సమయం ఇవ్వకుండా ప్రతాపం చూపిస్తున్నారు. కూల్చడానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ, చట్టాన్ని పాటించాలి. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. లక్షల మంది హైడ్రా తమ ఇంటి మీదకు ఎప్పుడో వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. అలాంటి వారి కోసమే పిల్ వేశాను.
ఇళ్లు కూల్చే వారికి ముందే పరిహారం ఇవ్వాలి. నోటీసులిచ్చి ఖాళీ చేసే సమయం ఇవ్వాలి. తెలంగాణ మరో ఉత్తరప్రదేశ్‌లా మారకముందే చర్యలు తీసుకోవాలి. ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి’’ అని పాల్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment