‘ఎక్స్‌ప్రెస్ వే’కు గ్రీన్ సిగ్నల్! | green signal to express way | Sakshi
Sakshi News home page

‘ఎక్స్‌ప్రెస్ వే’కు గ్రీన్ సిగ్నల్!

Published Thu, Feb 20 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

‘ఎక్స్‌ప్రెస్ వే’కు గ్రీన్ సిగ్నల్!

‘ఎక్స్‌ప్రెస్ వే’కు గ్రీన్ సిగ్నల్!

 మహానగరంలో చేపట్టిన భారీ రోడ్డు ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు మోక్షం లభించింది. ఆ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. జాతీయ రహదారుల శాఖకు అండగా నిలబడే విధంగా తీర్పు వెలువడడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైనట్టు అయింది.


 సాక్షి, చెన్నై: ఉత్తర చెన్నైలోని రోడ్ల మీద వాహనాల్లో వెళ్లాలంటే పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిందే. అక్కడి రోడ్లు ఆ మేరకు ఇరుకుగా ఉంటాయి. జాతీయ రహదారి నుంచి తిరువొత్తియూర్ -తండయార్ పేట -రాయపురం మీదుగానే  హార్బర్‌కు కంటైనర్ లారీలు వెళ్లాల్సి ఉంది. దీంతో ఈ మార్గంలో ఎప్పుడూ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పాటుగా రోజుకో ప్రమాదం చోటుచేసుకుంటోంది.
 
 ఎక్స్‌ప్రెస్ వే: ఉత్తర చెన్నై పరిధిలోని ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర నౌకాయూన శాఖ చెన్నై హార్బర్ నుంచి భారీ కంటైనర్ల కోసం ప్రత్యేకంగా ఓ మార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జాతీయ రహదారుల శాఖ నేతృత్వంలో రూ.1,816 కోట్ల వ్యయంతో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి నిర్ణయించారు.  చెన్నై హార్బర్ నుంచి కూవం నదీ తీరం వెంబడి కోయంబేడు మీదుగా మదుర వాయిల్ వరకు 19 కిలోమీటర్లు ఈ మార్గం నిర్మాణానికి సర్వం సిద్ధం చేశారు. వంతెనల మీదే ఈ మార్గం నిర్మితం అవుతుండడంతో కూవం తీరంలో 700 చోట్ల భారీ స్తంభాలను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. 2013 నాటికి ఈ పనులు ముగించాలన్న లక్ష్యంతో జాతీయ రహదారుల శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనులకు  2010 సెప్టెంబర్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. పనులు తొలి నాళ్లలో శరవేగంగా దూసుకెళ్లడంతో నిర్ణీత సమయానికి పూర్తి కావడం తథ్యమన్న ధీమా వ్యక్తమైంది. ఇది పూర్తరుుతే దేశంలోనే అతి పెద్ద హైవేగా ఈ మార్గం నిలుస్తుంది.  
 
 మోకాలడ్డు: పనులు శర వేగంగా సాగుతున్న సమయం లో రాష్ట్ర ప్రభుత్వం మోకాలొడ్డింది. కూవం నదీ తీరంలో  స్తంభాల నిర్మాణం పనులు 25 చోట్ల ముగింపుదశకు చేరు కున్నాయి. మిగిలిన చోట్ల పనులు రాష్ట్ర ప్రజా పనుల శాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది. కూవం నదీలోని మురుగు నీరు సముద్రంలోకి వెళ్లేందుకు వీలు లేని రీతిలో నిర్మాణాలు జరుగుతున్నాయని, తద్వారా అంటువ్యాధులు ప్రబలడం తథ్యమని పేర్కొంటూ, ఆ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ పనులను తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్న ఆరోపణలు మొదలయ్యూరుు.
 
 కోర్టుకు : చెన్నై హార్బర్ అభివృద్ధి  కోసం మాత్రమే కాకుండా, ఉత్తర చెన్నైలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి ఈ ఎక్స్‌ప్రెస్ వే ఎంతో దోహదకారి కాబోతోందంటూ కేంద్రం ప్రకటించింది.  అర్ధాంతరంగా పనులను నిలుపుదల చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ రహదారుల శాఖ ముఖ్య అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపినా ఫలితం శూన్యం. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయించేందుకు కేంద్రం కోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలై నెలలు గడిచినా, విచారణకు మాత్రం ముందుకు సాగలేదు. ఎట్టకేలకు న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, దేవదాసు నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. ఏడాదికి పైగా విచారణ సాగుతూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలను విన్పించారు. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనల్ని బెంచ్ వినింది.
 
 
 తీర్పు: విచారణ ముగింపు దశకు చేరుతున్న సమయంలో మరో బెంచ్‌కు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు యత్నించారు. అయితే, పాల్ వసంతకుమార్, దేవదాసుల నేతృత్వంలోని బెంచ్ విచారణను ముగించి గురువారం తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వ  ఉత్తర్వులు రద్దు చేసింది. విచారణ ముగిసిన సమయంలో ఐదో డివిజన్ బెంచ్‌కు పిటిషను మార్చాలని కోరడంలో ఆంతర్యమేమిటంటూ ప్రభుత్వ తరపు న్యాయవాదుల్ని బెంచ్ ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న వాదనల్లో వాస్తవాలు లేవని, పని గట్టుకుని మరీ ఆ పనులు నిలుపుదల చేయించినట్టు స్పష్టం అవుతోందని పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్ వే పనుల కారణంగా కూవంకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ మార్గం వల్ల మహానగరం మరింత అభివృద్ధి చెందడం ఖాయం అని బెంచ్ అభిప్రాయ పడింది. దేశ ప్రగతికి దోహద పడే పనులు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని, ఇక పనుల్ని జాతీయ రహదారుల శాఖ చేపట్టవచ్చంటూ తీర్పు వెలువరించారు. దీంతో ఆ పనులకు మోక్షం లభించగా, రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement