పలమనేరు (చిత్తూరు జిల్లా): చెన్నై నుంచి బెంగళూరుకు మూడు గంటల్లో వెళ్లొచ్చు. బెంగళూరు నుంచి చెన్నైకి అంతే సమయంలో తిరిగి రావచ్చు. ప్రస్తుతం ఈ రెండు మహా నగరాల మధ్య ప్రయాణ సమయం 6 గంటలు ఉంటోంది. ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం మూడు గంటలకు తగ్గనుంది. కర్ణాటకలోని హోస్‌కోట నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వరకు 262 కిలోమీటర్ల మేర 8 లేన్ల గ్రీన్ ఫీల్ట్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రూ.17,900 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను నాలుగు దశల్లో చేపట్టనున్నారు. ఫేజ్–1లో హోస్‌కోట నుంచి కర్ణాటక బోర్డర్ వరకు, ఫేజ్–2లో వి.కోట నుంచి గుడిపాల వరకు, ఫేజ్–3లో గుడిపాల నుంచి కాంచీపురం వరకు, ఫేజ్–4లో కాంచీపురం నుంచి శ్రీపెరంబదూర్ వరకు రహదారి విస్తరణ పనులు చేపడతారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట నుంచి గుడిపాల మండలం వరకు చేపట్టే ఫేజ్–2 పనులకు కేంద్రం తాజాగా రూ.4,129 కోట్లను కేటాయించింది.
ప్రస్తుత ప్రయాణమిలా..
బెంగళూరు నుంచి చెన్నై మధ్య ప్రయాణించాలంటే రెండు మార్గాలున్నాయి. ఓ మార్గం బెంగళూరు నుంచి హసూరు, క్రిష్ణగిరి, వేలూరు మీదుగా (ఎన్‌హెచ్ 75) 350 కిలోమీటర్ల మేర ఉంది. రెండో మార్గం కోలారు, చిత్తూరు, వేలూరు మీదుగా 330 కిలోమీటర్లు (పాత ఎన్‌హెచ్–4). ఈ రెండు మార్గాల్లో వాహనాలు సగటున గంటకు 60 కి.మీ. వేగంతో వెళ్లినా ప్రయాణ సమయం 6 గంటలు పడుతుంది.
ప్రమాద రహితంగా నిర్మాణం
దీనిని 8 ట్రాక్‌ల రహదారిగా ఐదు మీటర్ల ఎత్తున నిర్మిస్తారు. రోడ్డుకు ఇరువైపులా ఏడు మీటర్ల ఫెన్సింగ్ ఉంటుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఉన్న రెండు హైవేల్లోని క్రిష్ణగిరి, హోసూర్, వేలూరు, కోలార్, నంగిళి, మొగిలిఘాట్, బంగారుపాళెం రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా ఉన్నాయి. గ్రామీణ రహదారులకు దీన్ని అనుసంధానం చేస్తారు కాబట్టి బహుళ ప్రయోజనకారిగా ఈ రహదారిని ఉపయోగించుకోవచ్చు. మామూలు రోడ్ల మాదిరి కాకుండా పాయింట్ టు పాయింట్ కర్వ్‌లెస్ రోడ్డుగా దీని నిర్మాణం ఉంటుంది. ఫలితంగా భారీ వాహనాలు వెళ్లినా రోడ్డు ప్రమాదాలకు పెద్దగా ఆస్కారం ఉండదు.
8 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే ఇలా..
బెంగళూరు సమీపంలోని హోస్‌కోట నుంచి వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, మెల్‌పాడి, రాణిపేట్, శ్రీపెరంబదూర్ వరకు 262 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఇది 8 లేన్లుగా ఉండే గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ ప్రాజెక్టు. ఈ రహదారి కర్ణాటకలో 75.64 కి.మీ., ఏపీలో 88.30 కి.మీ., తమిళనాడులో 98.32 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందుకు సంబంధించి 2016లో ప్రాథమిక సర్వే, రూట్‌మ్యాప్ నిర్వహించారు. ఇప్పటికే 2,650 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. ప్రీ కన్‌స్ట్రక్షన్ పనుల కోసం రూ.1,370 కోట్లను ప్రభుత్వం గతంలో కేటాయించింది. ఫేజ్–1 పనులు కర్ణాటకలో ఇప్పటికే మొదలయ్యాయి. ఫేజ్–2 రాష్ట్రంలో చేపట్టే పనులకు కేంద్రం రూ.4,129 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
మొత్తం దూరం: 262 కి.మీ.
8 లేన్ల రహదారి: 240 కి.మీ.
6 లేన్ల రహదారి: 22 కి.మీ. (ఎలివేటెడ్ రోడ్లు)
మొత్తం ఇంటర్ ఎక్స్‌చేంజ్‌లు: 25
భారీ జంక్షన్: బైరెడ్డిపల్లి వద్ద 300 ఎకరాల్లో
రోడ్డు మధ్యన నాటే మొక్కలు: 20 వేలు
చెన్నయ్–బెంగళూరు మధ్య నిత్యం వెళ్లే గూడ్స్ వాహనాలు: 22 వేలు
పాసింజర్ వాహనాలు (రోజుకు): 9,500
Comments
Please login to add a commentAdd a comment