సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఏ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదని పర్యావరణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేష్ శర్మ సోమవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) అనే అంతర్జాతీయ సంస్థ ఈ సర్టిఫికేషన్‌ను ప్రదానం చేస్తుందని మంత్రి చెప్పారు.
33 అంశాల ప్రాతిపదికన ఆ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడే బీచ్‌కు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ లభిస్తుంది. అందులో నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, రక్షణ, భద్రతా చర్యలు, పర్యావరణంపై చైతన్యం వంటివి ప్రధాన ప్రాతిపదకలుగా ఉంటాయని తెలిపారు. సమగ్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ కింద దేశంలోని బీచ్‌లను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసే ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం 13 కోస్తా తీర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల సమ్మతి, సంప్రదింపులతో రాష్ట్రానికి ఒక బీచ్‌ను పైలట్ ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు.
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే పనులకు అనుమతులు రావాలి
‘అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పనులకు పర్యావరణ, అటవీ, వన్యప్రాణులు ఇతర అనుమతులు రావలసి ఉంది. అవసరమైన అనుమతులన్నింటినీ పొందిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభమవుతాయి’ అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.చట్టబద్దమైన అనుమతులన్నింటినీ సంపాదించుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన చెప్పారు. రావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధికి సంబంధించి గత ఏడాది ఆగస్టు 13, అక్టోబర్ 23 తేదీలలో తమ మంత్రిత్వ శాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు.
‘ఎక్స్‌ప్రెస్‌వే మొదట 100 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా 384 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా దీనిని 8 లేన్ల రహదారిగా విస్తరించే సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఖర్చులో 50 శాతం భరించడానికి, ఇందులో ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది’ అని మంత్రి చెప్పారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో చేపడతున్న ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డీపీఆర్ సిద్ధం అయ్యేనాటికి రాష్ట్ర ప్రభఉత్వం 50 శాతం భూమిని సేకరించి ఉంటే ప్రాజెక్ట్‌ను సత్వరమే చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే నాటికి కనీసం 90 శాతం భూసేకరణ జరిగి ఉండాలని కూడా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment