సాక్షి, విజయవాడ: బెజవాడ శివారులో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలసి మద్యం సేవిస్తున్న ఓ యువకుడిని కొందరు ఆగంతకులు కిరాతంగా కాల్చిచంపారు. మృతుడు నగర పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ గజకంటి మహేష్(33)గా గుర్తించారు. ఈ కాల్పుల ఘటన శనివారం అర్ధరాత్రి నున్న బైపాస్‌రోడ్డు ప్రాంతంలోని ఓ బార్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు..
- మహేష్ తన నలుగురు స్నేహితులు కుర్ర హరి కృష్ణ(24), ఉయ్యూరు దినేష్(29), యండ్రపతి గీతక్ సుమంత్ అలియాస్ టోనీ, కంచర్ల అనుదీప్ అలియాస్ దీపులతో కలిసి శనివారం రాత్రి నున్న బైపాస్ రోడ్డులోని ఓ బార్‌లో మద్యం కొనుగోలు చేసి.. నున్న మ్యాంగో మార్కెట్ వైపు ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లి రోడ్డుపైనే కూర్చొని మద్యం సేవిస్తున్నారు.
- అదే సమయంలో సిగరెట్లు, బీరు సీసాలు ఖాళీ అవడంతో మహేష్ స్నేహితులు టోనీ, అనుదీప్ తీసుకొచ్చేందుకు బార్ వద్దకు వెళ్లారు.
- ఇంతలో ఓ ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి 7.65 ఎంఎం తుపాకీ చూపించి డబ్బులు కావాలంటూ అకారణంగా మహేష్‌తో గొడవ పెట్టుకున్నారు.
- పక్కనున్న స్నేహితులు గొడవ ఎందుకని సర్ది చెబుతుండగానే వెనుక ఉన్న వ్యక్తి తుపాకీతో మహేష్‌ను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
- మహేష్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
- ఘటన అనంతరం పారిపోదామనుకున్న నిందితులు ఒకరు స్కూటీపై మరొకరు బాధితుల కారులో పారిపోయారు. కొంత దూరం వెళ్లాక ముస్తాబాద్ రోడ్డులో వదిలేశారు.
- రక్తపు మడుగుల్లో ఉన్న మహేష్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ హాస్పిటల్‌కు స్నేహితులు తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అసలు ఎవరీ మహేష్..
- విజయవాడ క్రీస్తురాజుపురం ప్రాంతానికి చెందిన గజకంటి మహేష్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
- మహేష్ తండ్రి వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కొంతకాలం క్రితం చనిపోవడంతో మహేష్‌కు ఆ ఉద్యోగం లభించింది.
- ఉద్యోగం చేస్తున్న సమయంలోనే పోలీసు కంట్రోల్ రూమ్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే కారణంతో ఈ ఏడాది మే నెలలో సీపీ ద్వారకా తిరుమలరావు మహేష్‌ను సస్పెండ్ చేశారు.
- సెప్టెంబరు చివరాఖరున సస్పెన్షన్ ఎత్తివేశాక గత 15 రోజుల కిందట విధుల్లో చేరాడు.
- మహేష్‌కు 2015లో వివాహమైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు.
కారణం ఏంటి? - భార్యతో విడాకులు తీసుకున్న మహేష్ నగరంలోని ఓ మహిళా డాక్టర్‌తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని తెలిసింది.
- అలానే మహేష్ సోదరి వరసయ్యే ఓ మహిళ గుంటూరుకు చెందిన ఓ వివాహితుడితో ప్రేమయాణం సాగిస్తున్నట్లు.. దీనికి మహేష్ సాయం చేస్తున్నట్లు తెలిసింది.
- ఈ విషయం గ్రహించిన ఆ వివాహితుడి భార్య తరపు వ్యక్తులు కానీ, మహేష్ ప్రేమిస్తున్న డాక్టర్ తరపు వ్యక్తులు కానీ.. లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలెత్తిన వివాదాలు కానీ మహేష్ హత్యకు దారి తీశాయా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మూడు ప్రత్యేక బృందాలు..
ఈ కేసును ఛేదించేందుకు నగర పోలీసు కమిషనర్ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప‍్పటికీ హత్య మిస్టరీగానే ఉంది. పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment