టీడీపీలో వర్గపోరు షురూ! | Tidipilo suru factionalism! | Sakshi
Sakshi News home page

టీడీపీలో వర్గపోరు షురూ!

Published Tue, Jan 6 2015 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

టీడీపీలో వర్గపోరు షురూ!

టీడీపీలో వర్గపోరు షురూ!

సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో టీడీపీ వర్గపోరు రోజురోజుకీ శ్రుతిమించుతోంది. వర్గపోరు వీధికెక్కుతోంది. ఒకరిపై ఒకరు తిట్ల పురాణం అందుకుంటున్నారు. ఇందుకు బెరైడ్డి రాజశేఖరరెడ్డి రాక వేదిక కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలోకి బెరైడ్డి రాజశేఖరరెడ్డి రీ-ఎంట్రీకి అధిష్టానం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆయన రాక జిల్లా పార్టీలోని మెజార్టీ వర్గానికి ఇష్టం లేదు.

ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలోకి వస్తే సర్వనాశనం అవుతుందని ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. రౌడీషీటు, హత్య కేసులో నిందితుడిని పార్టీలో ఎలా చేర్చుకుంటామని ప్రశ్నించారు. అయితే, ప్రస్తుతం టీడీపీలో ఉన్నది 90 శాతం క్రిమినల్సేనని... బెరైడ్డి ప్రజాబలం ఉన్న నేత అని ఆ పార్టీ సీనియర్ నేత రాంభూపాల్ చౌదరి వ్యాఖ్యానించారు. మొత్తం మీద జిల్లాలో టీడీపీ రాజకీయం కాస్తా బజారుకెక్కింది.
 
పట్టు పెంచుకునేందుకే..
రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. జిల్లాలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా నడిచింది. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగానూ కేవలం మూడు స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త నాయకత్వం అవసరమనేది అధిష్టానం ఆలోచనగా ఉంది. ఇందుకోసం వైఎస్సార్ సీపీ నాయకత్వంపై దృష్టి సారించిన టీడీపీ.. ఇందుకు అనుకూలంగా అక్కడి నుంచి సంకేతాలు లేకపోవడంతో మరో ప్రత్యామ్నాయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.

ఇందుకోసం గతంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి, బయటకు వెళ్లిన బెరైడ్డి రాజశేఖరరెడ్డిని తీసుకోవాలని భావించింది. మరోవైపు ఆయన కూడా టీడీపీలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ అధిష్టానానికి సంకేతాలు కూడా పంపారు. అయితే, ఆయన మీద ఉన్న రౌడీషీటుతో పాటు హత్యాయత్నం కేసులు అడ్డంకిగా మారుతున్నాయి. అయినప్పటికీ ఆయనను చేర్చుకునేందుకే పార్టీ అధిష్టానం మొగ్గుచూపడం ఇప్పుడు జిల్లా పార్టీలోని నేతలకు మింగుడు పడటం లేదు. ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఆలోచన మరోలా ఉందనే చర్చ సాగుతోంది.
 
కేఈ వర్గానికి చెక్ పెట్టేందుకేనా?             
రౌడీషీటుతో పాటు హత్యాయత్నం కేసులో ఆరోపణలున్న వ్యక్తిని పార్టీలోకి తిరిగి చేర్చుకోవడంలో ప్రస్తుతం ఉన్న నేతల ఏకపక్ష ధోరణికి చెక్ పెట్టేందుకేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందులోనూ జిల్లా నుంచి గెలిచి ఉపముఖ్యమంత్రి పదవి దక్కించుకుని పెద్దన్నగా ఉన్న కేఈ వర్గం ఆధిపత్యాన్ని కట్టడి చేసేందుకే అధిష్టానం బెరైడ్డిని తెరమీదకు తెస్తుందన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో కేవలం ఒక వర్గానిదే ఆధిపత్యం ఉంటే ఇబ్బందులు వస్తాయని.. మరో వర్గాన్ని ప్రోత్సహించడం ద్వారా ఒక వర్గాన్ని కట్టడి చేయాలనేది అధిష్టానం ఆలోచనగా ఉంది.

అందుకే బెరైడ్డి రాకను కేఈ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే తాను టీడీపీలోకి వస్తానన్న విషయాన్ని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి స్వయంగా బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేసి చెప్పినా.. సరే చూద్దాంలే అన్నట్టు సమాచారం. కేఈ నుంచి సానుకూలత ఏ మాత్రం వ్యక్తం కాలేదని తన సన్నిహితుల వద్ద బెరైడ్డి కూడా వాపోయినట్టు తెలిసింది. బెరైడ్డిని చేర్చుకోవడం ద్వారా.. జిల్లాలో ఉన్న ఫ్రధాన సామాజిక వర్గానికి చేరువయ్యేందుకూ ఇది దోహదపడుతుందనేది అధిష్టానం వ్యూహాంగా ఉందని సమాచారం.

అయితే, ఈ పరిణామాలను మాత్రం మెజార్టీ తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోవడం లేదు. గతంలో ఎన్నడూ లేని గ్రూపు రాజకీయాలకు అధిష్టానమే తెరలేపుతోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసి పార్టీ అధినేతను కలిసి బెరైడ్డి రాకను తామంతా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేయాలని భావిస్తున్నారు.

అయినప్పటికీ బెరైడ్డిని చేర్చుకునేందుకే అధిష్టానం మొగ్గుచూపితే.. సహాయ నిరాకరణ చేయడం ద్వారా తమ పట్టును చాటి చెప్పాలనేది కూడా కూడా బెరైడ్డి రాకను వ్యతిరేకిస్తున్న వర్గం భావిస్తోంది. మొత్తం మీద బెరైడ్డి రాక కాస్తా జిల్లా టీడీపీని కుదిపేస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లా టీడీపీలో వర్గపోరు మరింత ప్రస్ఫుటంగా బహిర్గతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement