పల్నాట వర్గపోరు
Published Thu, Feb 27 2014 2:16 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు: బెల్లంకొండ మండలంలో రెండురోజుల్లో రెండుచోట్ల నాటు బాంబులు పేలిన సంఘటనలు పోలీసు యంత్రాంగానికి పెద్దషాక్‌నిచ్చాయి. దీంతో పోలీసులు ఆయా గ్రామాల్లో ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు. పల్నాడులో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. గ్రామాలను దత్తత తీసుకుని శాంతిభద్రతలను సునిశితంగా పరిశీలించేందుకు ‘విలేజ్ పోలీసు’ కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇంతలో బాంబుపేలుళ్లు సంభవించడం పోలీసులకు పెద్దసవాల్‌గా మారింది.
కారంపూడి మండలం నరమాలపాడు గ్రామంలో కిందటి ఏడాది నవంబర్ 22న ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో రామడుగు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. అదేఏడాది ఆగస్టు 21న దుర్గిమండలం కంచరగుంట గ్రామంలో శ్రీపతి చెన్నయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చారు. తాజాగా మూడు రోజుల కిందట బెల్లంకొండ మండలం మన్నెసుల్తాన్‌పాలెం, గంగిరెడ్డిపాలెంలో వర్గపోరు మొదలై రాళ్లు రువ్వుకున్నారు. కర్రలు, బరిశెలతో దాడులు చేసుకున్న రెండువర్గాలు రాత్రిళ్లు నాటుబాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గురజాల, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, నరసరావుపేట, రాజుపాలెం మండలాల్లోని పలు ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీసు పహరా ముమ్మరం చేశారు.
నాకాబందీతో తనిఖీలు ముమ్మరం..
పల్నాడు ఫ్యాక్షన్ దాడులపై రూరల్ జిల్లా ఎస్పీ జె. సత్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడారు. బెల్లంకొండ మండలంలో జరిగిన దాడుల్లో బాంబులు ఉపయోగించలేదన్నా రు. పొలాల్లో పందులు రాకుండా వాడే సీమటపాకాయలను రైతులు అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అటువంటి పేలు డు సామగ్రి కూడా గ్రామాల్లో ఉండకూడద ని, సమస్యాత్మక గ్రామాల్లో నాకాబందీ కార్యక్రమం ద్వారా ఇంటింటా తనిఖీలు చేయిస్తున్నామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు.
Advertisement