సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా తెలుగుదేశం నాయకులను ఓటమి భయం వెంటాడుతోంది. పార్టీ గెలుపు కోసం ఎలాంటి చర్యలకై నా సిద్ధపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు, రాత్రి సమయాల్లో గ్రామాలకు వెళ్లి బేరాలు కుదుర్చుకుంటున్నారు. విచ్చల విడిగా డబ్బు వెదజల్లుతున్నారు. పార్టీ అధిష్టానం చెప్పినట్టు ఆస్తులు అమ్ముకొనైనా, డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అయితే ప్రజలకు గత టీడీపీ పాలనలో జరిగిన అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి.
దీంతో కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలు సైతం ప్రచారానికి వెనుకంజ వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతో ప్రచారం అయిందనిపిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి అంశాన్ని పక్కన పెడితే, తెలుగుదేశం హయాంలో జరిగిన హత్యలు, లూటీలను నెమరువేసుకుని, ‘అమ్మో మళ్లీ ఈ నాయకులేనా’ అని ఆందోళన చెందుతున్నారు.
కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పాలనలో రెండు, మూడు హత్యలు వరుసగా జరిగాయి. నిరసనగా దుకాణాలు మూయించారు. మూయని దుకాణాల్లో లూటీలు చేయించారు. పలు ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేయించారు. ఆ సమయంలో కూడా ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివి శివరాం ఎమ్మెల్యేగా వున్నారు.
మళ్లీ అదే అభ్యర్థి ఈ ఎన్నికల్లో పోటీకి దిగడంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఏఎంసీ చైర్మన్ పోకల కొండయ్య ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీలో కొనసాగాలా వద్దా అని పునరాలోచనలో పడ్డారు. మొదట ఒకటి రెండు సార్లు ప్రచారంలో పాల్గొన్నా, దివి శివరాం మాట్లాడే విధానాన్ని భరించలేక వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇటీవల ఆయన ఒక పత్రికా విలేకరిపై కూడా నానా దుర్భాషలాడిన విషయం విదితమే. అడ్డూ అదుపు లేకుండా మాట్లాడటం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య అంటూ అనేక మంది ఆయనకు దూరమైన విషయం ఒకటైతే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోలూటీల పర్వం మళ్లీ కొనసాగుతుందనే ఆందోళనలో ఉన్నారు.
తొలుత ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ భావించారు. అయితే ఆయనకు సీటు దక్కనీయకుండా చేయడంలో దివి శివరాం విజయం సాధించారు. దీంతో దామచర్ల వర్గం శివరాంకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఎన్నికల ఖర్చును పక్కవారిపై రుద్దే ప్రయత్నం చేయడంతో కొంత మంది నాయకులు కూడా ఆయనకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ప్రచారం కూడా అంతంత మాత్రంగానే చేస్తున్న ఆయన ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాల్సి ఉంది.
ఓటమి భయం
Published Thu, May 1 2014 2:32 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM
Advertisement