‘ఐ’ననూ ఎంపిక!
‘ఐ’ననూ ఎంపిక!
Published Fri, Jan 17 2014 4:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు :రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని అభిప్రాయ సేకరణ చేస్తే, ఈసారి పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని, ఒక ముస్లిం, ఒక బీసీ అభ్యర్థికి సీటు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీని ప్రకారం జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని 17 అసెంబ్లీ సెగ్మంట్లలో ముగ్గురు బీసీలు, మరో ముగ్గురు ముస్లింలకు సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం, బీసీల వివరాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీ పరిస్థితి మూడో స్థానానికి దిగజా రిందని తెలిసినప్పటికీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ (రాగా) సూచనల మేరకు పరిశీలకులు జిల్లాలో అభిప్రాయ సేకరణ చేశారు.
సిట్టింగ్‌లు, ఇన్‌చార్జీల్లో కలవరం ...
నరసరావుపేట లోక్‌సభ పరిశీలకునిగా నియమితులైన కర్ణాటక మాజీ మంత్రి శివమూర్తి తొలి విడత అభిప్రాయ సేకరణను పూర్తిచేశారు. ‘రాగా’ సూచన మేరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే, జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మంట్లలో ముగ్గురు బీసీలు, ముగ్గురు ముస్లింలకు సీట్లు కేటాయించాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో ముగ్గురు బీసీలకు, ఇద్దరు మైనార్టీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించింది. రేపల్లె నుంచి మోపిదేవి వెంకట రమణ, మంగళగిరి నుంచి కాండ్రు కమల, గురజాల నుంచి డాక్టర్ వెంకటేశ్వర్లుకు బీసీ వర్గాల నుంచి సీట్లు లభించాయి. మైనార్టీల నుంచి గుంటూరు ఒన్‌లో మస్తాన్ వలీ, పెదకూరపాడులో నూర్జహాన్‌లకు సీట్లు లభించాయి. అభ్యర్థుల ఎంపికలో పరిశీలకులు అనుసరిస్తున్న విధానాలు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. అభిప్రాయ సేకరణను నియోజకవర్గ కేంద్రాలతో సరిపెట్టకుండా మండల కేంద్రాల్లోనూ నిర్వహించనున్నట్టు పార్టీ బాధ్యులు చెబుతున్నారు.
నాలుగు అసెంబ్లీ సెగ్మంట్లలో
ఒక్కొక్క పేరు ... నియోజకవర్గ కేంద్రాల్లో ముగిసిన అభిప్రాయ సేకరణ ప్రకారం సత్తెనపల్లి, పెదకూరపాడు,నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్క పేరు చెప్పినట్టు తెలిసింది. సత్తెనపల్లి- ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పెదకూరపాడు- జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పక్కాల సూరిబాబు, నరసరావుపేట- ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి, వినుకొండ- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావులకు వ్యతిరేకంగా మరో పేరును నాయకులు, కార్యకర్తలు ప్రస్తావించలేదని తెలిసింది. అయినప్పటికీ ఈ నియోజకవర్గాల్లో బీసీలు, మైనార్టీల నుంచి అర్హులైన అభ్యర్థుల వివరాలను పరిశీలకులు నమోదు చేసుకున్నట్టు తెలిసింది.
ఏఐసీసీ సమావేశాల తరువాతనే
మిగిలిన రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లలోని మండల కేం ద్రాల్లో అభిప్రాయ సేకరణను ఏఐసీసీ సమావేశాల తరువాత నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆ పర్యటన వివరాలను కూడా గోప్యంగా ఉంచే యత్నంలో జిల్లా నాయకులున్నారు.
Advertisement