భవిష్యత్తులో బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని భవిష్యత్తులో ఏదో ఓ రోజు వెనకబడిన కులస్థులు(బీసీ)లకు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) జోస్యం చెప్పారు. గురువారం గాంధీభవన్లో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తున్న దశలో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు పదేపదే డిమాండ్ చేయడం సరికాదని ఆయన వాఖ్యానించారు.
తమకు హైదరాబాద్, భద్రచలంతో కూడిన తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాని రాయల్ తెలంగాణను తాము ఎప్పటికి ఒప్పుకోనే ప్రసక్తి లేదని వీహెచ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది... ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజన అడ్డుకుంటామని ఆ క్రమంలో అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను వీహెచ్ ఈ సందర్బంగా ఖండించారు. అశోక్ బాబు చేసిన వ్యాఖ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలను ఈ సందర్బంగా వీహెచ్ ప్రశ్నించారు.