తాడేపల్లి: ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి అనంతరం రాజీనామా చేశారు వైఎస్ జగన్. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రాజీనామా లేఖను పంపారు వైఎస్ జగన్.
అంతకుముందు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమిపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. యాభై మూడు లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం.
మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే ఫించన్ పంపిచే వ్యవస్థను తీసుకొచ్చాం. చాలీచాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఫలితాల్ని ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు’’ అని వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment