సాక్షి, ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పలు పథకాల కొనసాగింపునకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు కేటాయించింది. అయితే ప్రజా సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తుండగా.. నీటిపారుదల, వ్యవసాయ, సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఆయా రంగాలు ముందుకు సాగడానికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ఆసరా పెన్షన్లు, పేదల సంక్షేమానికి సంబంధించి వసతి గృహాల నిర్వహణ, వికలాంగుల పెన్షన్ వంటి కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించడంతో జిల్లాలో ఆయా రంగాల వారికి ప్రయోజనం కలగనున్నది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు రూ.1,324కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతుండగా.. బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో పనులు వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి సైతం ఈ దఫా బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. వైరా ప్రాజెక్టు పరిధిలో మరమ్మతు, పనుల నిర్వహణ కోసం రూ.23.50కోట్లు కేటాయించగా.. తాలిపేరు ప్రాజెక్టుకు రూ.3కోట్లు, అశ్వారావుపేట పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు రూ.3.20కోట్లు, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు రూ.10కోట్ల ను బడ్జెట్‌లో కేటాయించారు.
దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతుండగా.. కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో సరిపోవని, ïసీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, ఈ మాత్రం నిధులతో పనులు వేగవంతం ఎలా అవుతాయని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అయితే ప్రాధాన్యతా క్రమంలో జిల్లాకు సంబంధించి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేస్తే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని పనులు వేగవంతమయ్యే అవకాశం ఉందని రైతు వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధుల్లో రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో జిల్లాలోని అనేక మంది రైతులు ఈ పథకాల వల్ల ప్రయోజనం పొందనున్నారు.
భద్రాద్రి ఆలయ మాస్టర్‌ప్లాన్ నిధుల ఊసే లేదు..
ఇక వరుసగా గత నాలుగు బడ్జెట్లలో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి ప్రకటిస్తూ వస్తున్న మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన రూ.100 కోట్లు ఈసారి ప్రకటించలేదు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి పైసా కూడా విదల్చకపోవడంతో జిల్లా ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
ఇది వాస్తవిక బడ్జెట్..
శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్. ఒకవైపు దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తరుముకొస్తున్నా.. సంక్షేమ రంగాలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాధాన్యం యథావిథిగా కొనసాగిస్తూ.. ఆయా రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ప్రజలకు వాస్తవాలను తెలిపే వాస్తవిక బడ్జెట్ ఇది. రైతులు, వివిధ వర్గాల ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆయా రంగాలకు సమృద్ధిగా నిధులు కేటాయించడం కేసీఆర్ ప్రభుత్వానికే చెల్లింది. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించింది.
– పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment