
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ఎంత బడ్జెట్ ఇస్తున్నారు..? గ్రామీణ, తాలూకా, జిల్లాస్థాయి ఆస్పత్రుల్లో వసతులు ఎలా ఉన్నాయి..? ఎంతమంది వైద్యులు అవసరం.. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు..? ఇతర సిబ్బంది పరిస్థితి ఏంటి..? తదితర అంశాలపై పూర్తినివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య, కుటుంబసంక్షేమ డైరెక్టర్‌తో పాటు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.
నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన స్వర్ణకు గత డిసెంబర్ 26వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. ప్రైవేటు వాహనంలో ఆమెను పదర పీహెచ్‌సీకి, అక్కడి నుంచి అమ్రాబాద్ పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి అచ్చంపేట ఆస్పత్రికి.. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి రాత్రి 2:30 గంటలైంది. వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. కాసేపటికే ఊపిరి తీసుకోలేక శిశువు, అరగంట తర్వాత ఆ బాలింత మరణించా రు.
ఈ ఘటన వివరాలు పత్రికల్లో చూసిన హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి మహిళను తీసుకొచ్చిన సమయంలో వెంటిలేటర్ అవసరమైందని, అక్కడ ఆ సౌకర్యం లేకపోవడంతో మరో చోటకు తరలించాల్సి వచ్చిందని మెడికల్ సూపరింటెండెంట్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. వాదనల అనంతరం కోర్టు నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.