
సాక్షి, హైదరాబాద్: లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామని ప్రభుత్వ తరపు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. రాజ్యాంగపరంగా నిబంధనలన్నీ నిర్వర్తిస్తామని తెలిపారు.
కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ తెలంగాణ సర్కార్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్ సిఫార్సులకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో .. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. అయితే.. ఈ నాటకీయ పరిణామల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌కు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ముందుగా లంచ్ మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్, హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్ ముసాయిదా ప్రతులకు ఆమోదం తెలపలేదు అని, గవర్నర్ ఆమోదం తెలపకపోతే కష్టతరమవుతుందని ఏజీ.. బెంచ్ ముందు విజ్ఞప్తి చేశారు. అయితే.. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకోగలుగుతామని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
లంచ్ మోషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న అడ్వకేట్ జనరల్ సమాధానంతో.. అందుకు బెంచ్ అంగీకరించింది. అయితే పిటిషన్ రెడీగా ఉందా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. సిద్ధంగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ఏజీకి స్పష్టం చేసింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment