నెల్లూరు (టౌన్): పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించిన వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు జిల్లాలో డ్రౌపౌట్స్ సంఖ్య తగ్గించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అయితే ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మన ఊరు – మనబడి కార్యక్రమాన్ని మొక్కబడిగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడి మానేసిన వారిని రప్పించడం లేదా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా బడి బయట పిల్లల సంఖ్య ఏటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
సంఖ్యను పెంచేందుకు పలు పథకాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఏడాదికి రెండు జతల యూనిఫారం, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు కిలోమీటర్ల దూరం, ఆపై నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ ఖర్చులను చెల్లిస్తున్నారు. తొమ్మిదో తరగతి బాలికలకు ఉచితంగా సైకిళ్లు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తున్నారు. ప్రభుత్వానికి తోడు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారాన్ని అందిస్తున్నాయి. అయితే ఇన్ని అమలు చేస్తున్నా ఏటా బడి మానేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
జిల్లాలో ఇదీ సంఖ్య
చదువుకు దూరంగా ఉన్న పిల్లలు నెల్లూ రు నగరంలోనే 4505 మంది ఉన్నట్లు సర్వశిక్ష అభియాన్ అధికారులు గుర్తిం చారు. తడలో 1499, కావలిలో 886, గూడూరులో 799, వెంకటాచలంలో 517, వెంకటగిరిలో 528, ఉదయగిరిలో 472, కోవూరులో 517, సూళ్లూరుపేటలో 489, వింజమూరులో 448, రాపూరులో 496 మందితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు.
మన ఊరు మన బడిజూన్‌కు వాయిదా
వాస్తవానికి ఏప్రిల్లో నిర్వహించాల్సిన మన ఊరు మన బడి కార్యక్రమాన్ని జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. వారం రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా అంగన్‌వాడీల్లో చదువుతున్న పిల్లలను ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ స్కూళ్లలో చేర్పించడం, ప్రాథమిక స్కూళ్లలో చదువు పూర్తయిన వారిని హైస్కూళ్లలో చేర్పించడం, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
బడి బయట పిల్లలను గుర్తిస్తాం
మన ఊరు – మనబడి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం డ్రాపౌట్ పిల్లలను తగ్గించడం. కార్యక్రమాన్ని వారం పాటు నిర్వహిస్తాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి వారిని తప్పకుండా బడిలో చేర్పిస్తాం. పేదరికం కారణంగానే పేద పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.– విశ్వనాథ్, ప్రాజెక్ట్ అధికారి,సర్వశిక్ష అభియాన్
జిల్లాలో 8915 మంది చదువుకు దూరం
గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది లేదా పదో తరగతి చేరకముందే విద్యార్థులు మధ్యలో బడి మానేస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, లేదా కుటుంబభారాన్ని మోసేందుకు గానూ పనులకెళ్తున్నారు. వీరిలో బాలికల శాతం అధికంగా ఆరు శాతం మేర పెరుగుతోంది. తొమ్మిది శాతం మంది బాలురు చదువు మానేసి పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు నుంచి 14 ఏళ్లలోçపు 8915 మంది విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రీ సర్వే పూర్తి కాకపోవడంతో సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2017 – 18 విద్యా సంవత్సరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాసాధికార సర్వేలో 22912 మంది పిల్లలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అయితే సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో సీఆర్పీలు, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్టీలు రీ సర్వే నిర్వహించారు. రెవెన్యూ అధికారుల డేటా అధారంగా ఇప్పటి వరకు 16108 మంది పిల్లలపై సర్వే నిర్వహించారు. వీరిలో 8915 మంది పిల్లలు చదువుకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా 6804 మంది పిల్లలపై సర్వే నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడున్న సంఖ్య కంటే బడి బయట పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment