సాక్షి, అమరావతి: పాఠశాలలు మ్యాపింగ్ వల్ల పాఠశాలలు రద్దు కావడం, మూతపడటం జరగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమంపై మూడు రోజులపాటు జరిగిన అవగాహన సదస్సులు శనివారం ముగిశాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన చివరి రోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా ఏదో జరిగిపోతోందని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలు రద్దు కావని.. ఇప్పుడున్నవి ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్‌గా రూపాంతరం చెందుతాయన్నారు. దీనిపై అవగాహన కల్పించడానికే మూడురోజులపాటు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులకు సదస్సులు నిర్వహించామని తెలిపారు. త్వరలోనే జిల్లాలవారీగా కూడా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని చెప్పారు.
పాఠశాలల మ్యాపింగ్ తర్వాత ఎక్కడెక్కడ అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు అవసరమో గుర్తిస్తామని వివరించారు. నాడు–నేడు పథకం కింద పనులు పూర్తి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతోపాటు వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ సురేష్ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, మౌలిక వసతుల సలహాదారు మురళి, తదితరులు పాల్గొన్నారు.
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం
ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలకు రాకుండా ఉండటం సరికాదన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదని చెప్పారు. జీవో కాపీలు తగులబెట్టడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం సరికాదన్నారు.
ఎప్పటికైనా సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఒకసారి చర్చలకు వెళ్లి సంప్రదింపులు జరిపాక ఇప్పుడు వెనక్కి తగ్గటమేమిటని ప్రశ్నించారు. ఉన్న ఇబ్బందులను మళ్లీ చర్చల ద్వారా తెలియజేయొచ్చన్నారు.
మ్యాపింగ్ వల్ల పాఠశాలలు మూతపడవు
Published Sun, Jan 30 2022 4:00 AM | Last Updated on Sun, Jan 30 2022 4:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment