
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కొందరు దీన్ని జీర్ణించుకోలేక పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని, ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు ప్రచారం చేయడంపై సోమవారం ఆయన ఒక ప్రకటనలో స్పందించారు.
రాష్ట్రంలో పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు గాను అమ్మ ఒడి కింద ఇచ్చే నగదు నుంచి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చిన రూ. 444.89 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తం 45,716 పాఠశాలల్లో ఇప్పటికే ఆయాలను నియమించామని తెలిపారు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒకరు, 600 మంది ఉన్న పాఠశాలల్లో ఇద్దరు, 900 మంది ఉన్న పాఠశాలల్లో ముగ్గురు, 900 పైబడి విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో నలుగురు చొప్పున ఆయాలను నియమించామని చెప్పారు. ఆయాలకు నెలకు రూ.6,000 చొప్పున జీతం చెల్లిస్తున్నామని వివరించారు. మరుగుదొడ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కెమికల్ కిట్లను కూడా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment