అసలు ఈ విషయాన్ని కనీసం పరిశీలించారా?
శైలజానాథ్ చికిత్సకు రూ.43.66 లక్షలు కేటాయింపుపై సర్కారును నిలదీసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు రూ.43.66 లక్షలు కేటాయిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. శైలజానాథ్‌కు అవసరమైన చికిత్స మనదేశంలో అందుబాటులో లేదా? అని ప్రశ్నించింది. అసలు ఈ విషయాన్ని కనీసం పరిశీలించారా? అని అధికారులను నిలదీసింది. ఈ కేటాయింపులను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శైలజానాథ్‌కు వైద్యం కోసం రూ.43.66 లక్షలు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్, శాంతినగర్‌కు చెందిన మంగీలాల్ వంకోదూత్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం సోమవారం విచారించింది.
ఛాతీ ఎడమభాగంలో వచ్చిన ట్యూమర్‌కు అమెరికా న్యూజెర్సీలోని మెమోరియల్ స్లాన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్‌లో చికిత్స చేయించుకునేందుకు రూ.43.66 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం గతనెల 17న జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఇందులో రూ.23.66 లక్షలు వైద్యఖర్చులకు, రూ.5 లక్షలు ప్రయాణ ఖర్చులకు, న్యూజెర్సీలో ఉండేందుకు రూ.15లక్షలు కేటాయించినట్టు తెలిపారు. శైలజానాథ్ పేదవాడు కాదని, ఆర్థికంగా ఉన్నవ్యక్తేనని, అలాంటి ఆయనకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం అన్యాయమన్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్విని యోగం చేయడమేనన్నారు. ఈ వాదనలతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశించారు. విచారణను మూడు వారాలపాటు వాయిదా వేశారు.
ఆ చికిత్స దేశంలో అందుబాటులో లేదా?
Published Tue, Apr 8 2014 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement