
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరో తెలుగు బిడ్డ జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి శనివారం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1963, ఆగస్టు 14న సంజయ్‌కుమార్ జన్మించారు. తల్లిదండ్రులు పద్మావతమ్మ, రామచంద్రారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969 నుంచి 1982 వరకు అడ్వొకేట్ జనరల్‌గా రామచంద్రారెడ్డి విధులు నిర్వహించారు. వీరిది కడప జిల్లా అయినా సంజయ్‌కుమార్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే.
నిజాం కాలేజీలో డిగ్రీ చదివిన తర్వాత.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. 1988లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2000 నుంచి 2003 వరకు ప్రభుత్వ న్యాయవాదిగానూ సేవలందించారు. 2008, ఆగస్టు 8న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2010, జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. 2019, అక్టోబర్ 14న పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. ఆపై మణిపూర్ హైకోర్టు సీజేగా పదోన్నతిపై వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment