సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక న్యాయవాది నల్లచొక్కా వేసుకుని వచ్చి వాదనలు వినిపించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం సమీపంలో మద్యనిషేధం అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై వాదనలు వినిపించడానికి వచ్చిన న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ నల్లచొక్కా, బ్లేజర్, దానిపై రోబ్స్ మెడలో బ్యాండ్‌తో వచ్చారు.
ఆయన వస్త్రధారణను గమనించిన ప్రధాన న్యాయమూర్తి.. తెల్లచొక్కా ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు. అయ్యప్ప దీక్షలో ఉన్నానని ఆయన చెప్పగా, ఎన్ని రోజులు ఇలా నల్లచొక్కాతో వస్తారని మరో ప్రశ్న వేశారు. దీంతో పక్కనే ఉన్న మరో న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ దీక్ష గురించి ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. అనంతరం నిబంధనల కన్నా దీక్ష ఎక్కువ కాదని జస్టిస్ సేన్‌గుప్తా తేల్చి చెప్పారు. దీక్ష ముగిసిన తర్వాతే వాదనలు వినిపించాలని పేర్కొంటూ ఈ పిటిషన్‌పై విచారణను రెండు నెలలు వాయిదా వేశారు.