Ayyappa Deeksha
-
పరమ పవిత్రం.. కార్తీక మాస విశేషాలివిగో
దీపావళి సంబరాలు ముగిశాయి. ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలైంది. శివ కేశవుల భక్తులంతా ఏంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయమిది. ఈ పుణ్య మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1న సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున ఆ మరుసటి రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలనేది పండితుల మాట. శివనామస్మారణలతో ఆలయాలన్నీ మార్మోగుతాయి. వేకువ ఝామునే చన్నీటి స్నానాలు, దీపారాధన, శివరాధనలో భక్తులు పరవశిస్తారు.కార్తీకమాసం అంతా ధూప దీపాలు, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శివాలయంలోనో మరేదైనా దీపం వెలగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. కనీసం ఇంట్లో తులసికోటముందు దీపాలు వెలిగించినా పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు.ప్రత్యేకంగా మహిళలు నిష్టగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీకపురాణ పఠనం చేస్తూ శివకేశవులిద్దరనీ ఆరాధిస్తారు. ఈ పురాణంలో శివారాధన, దీపారాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. అలాగే శక్తి కొలదీ దానం చేయం, సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు, ఆరిపోతున్న దీపపు ఒత్తిని సరిచేసి, దీపాన్ని వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతుంది. నిష్టగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, ఉసిరి దీపాలు, దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెడతారని చెబుతుంది. అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు నాగుల చవితి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశితోపాటు, కార్తీకపూర్ణిమ ( నవంబర్ 15వతేదీ శుక్రవారం) రోజులు అతిపవిత్రమైనవి భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి సమీపంలోని నదులు,చెరువులలో వదిలే దృశ్యాలు కన్నుల పండువలా ఉంటాయి. అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.అయ్యప్ప దీక్షలు, పడిపూజలుకార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం. అయ్యప్పదీక్షలు కార్తీక మాసం నుంచి,మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల ధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తారు. స్వామి చింతనలో, సాత్విక జీవనాన్ని పాటిస్తారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానం భజనలు, పూజలతో గడుపుతారు. దిండ్లు పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు. బ్రాహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తారు. సంక్రాంతిలో రోజు మకర జ్యోతి దర్శనంతో దీక్షలను విరమిస్తారు. -
అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాలు ఇవే
-
అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఈ వస్తువులు ఉండాల్సిందే
-
మాల ధారణ సమయంలో నల్ల వస్త్రాలు ధరించడానికి కారణం అదే
-
అయ్యప్ప మాల వేసుకున్నాక ఏదైనా సమస్య వస్తే..?
-
అయ్యప్ప దీక్షలో చేయవలసినవి మరియు చేయకూడనివి..!
-
కన్య స్వాములకు కట్టిన బాణాలు ఏం చేస్తారంటే
-
అయ్యప్పా.. వచ్చేదెట్లా?
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులకు రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరో రెండు నెలల వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ జాబితానే దర్శనమిస్తోంది. గత రెండేళ్లుగా దర్శనాలు నిలిచిపోయిన దృష్ట్యా ఈసారి నగరం నుంచి లక్షలాది మంది తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. మాలధారులతో పాటు సాధారణ భక్తులు సైతం రైళ్ల కోసం బారులు తీరుతున్నారు. కానీ.. భక్తుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు. దక్షిణమధ్య రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ అన్నింటిలోనూ ఇప్పటికే బెర్తులు భర్తీ కావడంతో పాటు వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరింది. కొన్నింటిలో బుకింగ్ కూడా అవకాశం లేకుండా ‘రిగ్రేట్’ కనిపిస్తోంది. ఈ ఏడాది కనీసం10 లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లే అవకాశం ఉంది. దక్షిణమధ్యరైల్వే ప్రకటించిన అరకొర రైళ్లు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆలస్యంతో ఇక్కట్లు.. గతంలో ఇలాగే మకరజ్యోతి దర్శనం ముంచుకొస్తున్న తరుణంలో హడావుడిగా కొద్దిపాటి రైళ్లను ప్రకటించారు. అవి సైతం విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరాయి. నగరం నుంచి వెళ్లిన రైళ్లు పరిమితమే. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పైగా చాలా వరకు ఉదయం వెళ్లాల్సినవి సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైళ్లు అర్ధరాత్రి బయలుదేరాయి. గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. సకాలంలో దర్శనానికి చేరుకోలేక భక్తులు నిరాశ చెందారు. పైగా ప్రత్యేక రైళ్లలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో భక్తులు స్నానాలు, పూజలు చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. విమాన చార్జీల మోత... రైళ్లలో భారీ డిమాండ్ ఉండడంతో చాలా మంది భక్తులు విమానాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వెళ్లే విమానాల్లో సైతం చార్జీలు మోత మోగుతున్నాయి. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు. ఈ చార్జీలు కూడా తరచూ మారిపోతున్నాయి. సంక్రాంతికి కష్టాలే... నగరం నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 25 లక్షల మందిప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. వీరిలో కనీసం 15 లక్షల మంది రైళ్లపైనే ఆధారపడి ఉంటారు. రైళ్లలో అవకాశం లభించకపోవడంతో చాలా మంది సొంత వాహనాలు, ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. ఎందుకిలా? అయ్యప్ప దర్శనం కోసం నగరానికి చెందిన భక్తులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లే ఒకే ఒక్క రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్రవరికి కూడా అప్పుడే బుక్ అయ్యాయి. భక్తుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు వేయాల్సిన అధికారులు ఆ దిశగా పెద్దగా దృష్టి సారించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్ నుంచి వెళ్లేవి తక్కువగానే ఉన్నాయి. చివరి క్షణాల్లో హడావుడిగా ప్రత్యేక రైళ్లను వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్నింటిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. డిసెంబర్ నుంచి జనవరి వరకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరికి వెళ్లనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే భక్తులు తమకు అనుకూలమైన రోజుల్లో శబరికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. -
అయ్యప్ప మాలధారణ .. నియమాల ఆచరణ.. మండల పూజ ఎప్పటినుంచంటే?
రాజంపేట రూరల్ (వైఎస్సార్ కడప): శివకేశవుల తనయుడైన శ్రీమణికంఠుని మాలధారణ నియమాలతో కూడుకున్న ఆచరణ. హరిహరపుత్రుడైన అయ్యప్ప కొలువై ఉన్న కేరళ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది అయ్యప్ప దీక్ష తీసుకుని మాల ధరిస్తున్నారు. శరీరాన్ని, మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. మోక్షమార్గాన్ని అన్వేశించే వారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పని సరిగా జీవితంలో ఒక సారి అయినా శబరిమల యాత్ర చేయాలని ఉవ్విళ్లూరు తుంటారు. నియమాలు ఇలా.. అయ్యప్ప మాలను పవిత్రమైన ఆలయంలో గురుస్వామి వద్ద కానీ లేదా ఇంట్లో మాతృమూర్తి వద్ద వేయించుకోవచ్చును. ప్రతి రోజు సూర్యోదయంకు ముందే పూజలు, సూర్యాస్తమయం తరువాత పూజలు నిర్వహించాలి. కఠిన నియమాలను పాటిస్తూ నలుపు దుస్తులనే వాడాలి. రాత్రివేళల్లో ఆలయాలలోని నిద్రే శ్రేయస్కరం. ప్రతి రోజు ఏదో ఒక గుడిని దర్శించడం ఆనవాయితీగా చేపట్టాలి. భక్తుడే భగవంతుడు అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌక్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు అంతర్థానమై స్వామి గానే పిలువబడుతుంటారు. దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికి, భగవంతునికి తేడా కనిపించదు. ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది. కులమత భేదాలు, తారతమ్యాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమల. ఇరుముడి ప్రాముఖ్యత అయ్యప్పను నవవిధ సేవలతో ప్రార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మ నివేదనలతో అయ్యప్పను కొలుస్తుంటారు. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో రెండు ముడులు ఉంటాయి. ముందున్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామి వారికి సమర్పించే వస్తువులను ఉంచుతారు. కొబ్బరికాయను నేతితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. కొబ్బరికాయకు బిగించే కార్క్‌ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూతపెడతారు. ఆ పైన కాయకు ఆత్మ అనే లక్కతో సీలు వేస్తారు. ఈ జ్ఞానం అనే నెయ్యితోనే స్వామి అయ్యప్పకు అభిషేకం చేస్తారు. మనలోని జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వామి అయ్యప్పకు నిండు మనస్సుతో అర్పించుకున్నట్లుగా భావించడమే అర్థం. దీన్నే ఆత్మ నివేదన అంటారు. స్వామి అయ్యప్ప దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అనే అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరు చేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఓ దివ్య జ్యోతి దర్శనమవుతుంది. దానినే మకరజ్యోతిగా భావించాలి. ఆద్యంతం భక్తిపారవశ్యమే.. శబరిమలై యాత్ర ఆధ్యంతం భక్తి పారవశ్యమే. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం నుంచి ఇరుముడి కట్టుకుని బృందంతో బయలుదేరుతారు. మొదటగా వావర్‌స్వామి కొలువై ఉన్న ఎరిమేలికి చేరుకుంటారు. అక్కడ పేటతుళ్లి ఆడి వావర్‌స్వామిని, పేటశాస్త్రిలను దర్శించుకుని పంబకు బయలుదేరుతారు. పంబానదిలో పుణ్యస్నానాన్ని ఆచరించి సన్నిధానంకు ఇరుముడిని మోసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ బయలుదేరుతారు. కొండ అంచున ఉన్న అప్పాచిమేడు చేరుకుంటారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బహిరంగ ప్రదేశంలో శబరిపీఠం కనిపిస్తుంది. పంబానదికి సన్నిధానానికి మధ్య ఉన్న శరంగుత్తిఆల్కు చేరుకుంటారు. అక్కడ కన్నెస్వాములు శరంపుల్లలను ఉంచుతారు. అనంతరం స్వామి వారిని సన్నిధానానికి చేరుకుంటారు. పవిత్రమైన పదునెట్టాంబడి.. స్వామి సన్నిధానంలో ఉండే 18 పడిమెట్లను అవతార పురుషుడైన పరుశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, రెండు యోగములైన కర్మయోగం, జ్ఞానయోగంతో పాటు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పరిచారు. సన్నిధానం చేరిన భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి ఎక్కవలెను. స్వామి వారి దర్శనార్థం ఇరుముడిని గురుస్వామి సాయంతో విప్పవలెను. అందులో ఉన్న నెయ్యిని అయ్యప్పకు అభిషేకాన్ని చేస్తారు. అనంతరం మాలిగైపుత్రమ్మ వారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరికాయలను దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కుగా చెల్లించుకుంటారు. అద్వైత మలై.. అయ్యప్ప అవతారంలోనే ఒక విశిష్టత ఉంది. హరిహరసుతుడు, శ్రీమన్నారాయణుడు మోహినీ అవతారంలో ఉండగా శివకేశవులకు జన్మించినవాడే అయ్యప్ప. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో హరిహర భేదం లేదు. అద్వైతానికి నిలువెత్తు నిదర్శనం శబరిమలై కొండ. కలియుగంలో ప్రత్యక్షదైవం తిరుమలవెంకటేశ్వరస్వామి తరువాత అంతటి ప్రాచుర్యం పొందిన దైవం అయ్యప్పస్వామి. అయ్యప్ప దీక్షలోని కఠోర నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మనివేదన ఈ దీక్షలోని ప్రత్యేకతలు. మండల కాలం (41రోజులు) ఈ దీక్ష కొనసాగుతుంది. 18 మెట్లను ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడంతో దీక్ష ముగుస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్లీ ఎప్పుడు దీక్ష చేపడదామా, మళ్లీ అయ్యప్పను కనులారా చూస్తామా అంటూ పరితపిస్తుంటారు భక్తులు. ఈ యేడాది నవంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 3వ తేది వరకు మండల దర్శనం, జనవరి 10 నుంచి మకర సంక్రాంతి వరకు మకరజ్యోతి దర్శనంగా పరిగణిస్తారు. -
అయ్యప్ప మాలవేశారని.. వారి కడుపుకొట్టారు!
తనకల్లు: అయ్యప్ప మాల వేశారని నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగించడంపై బాధితులు గురువారం అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని ఈతోడు రోడ్డులో ఉన్న ఆర్కా సోలార్ పవర్ ప్లాంట్ ఎదుట ఆందోళన చేశారు. బాధిత ఉద్యోగులు చరణ్‌రెడ్డి, బాలాజీ, సురేష్‌నాయక్, సిద్ధారెడ్డి మాట్లాడుతూ..మూడేళ్లుగా ప్లాంట్‌లో పని చేస్తున్నామని, ఈనెల 12న కంపెనీ యాజమాన్యం తమను ఉన్నఫళంగా ఉద్యోగాల నుంచి తొలగించిందని చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే కంపెనీ ప్రతినిధులు మీరు అయ్యప్ప స్వామి మాల వేయడమే కాకుండా ప్లాంట్ ప్రాంగణంలో పూజలు కూడా చేశారని సమాధానమిచ్చారన్నారు. ఇలాంటి కారణాలతో తమ కడుపుకొట్టడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు వాపోయారు. తాము విధుల పట్ల ఏనాడు నిర్లక్ష్యం చూపలేదని, 106 ఎకరాల్లోని సోలార్ పవర్ ప్లాంట్‌లో విపరీతంగా పెరిగిపోయిన గడ్డిని సైతం తామే రోజూ తొలగిస్తున్నట్లు చెప్పారు. వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ ప్లాంట్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఏఎస్ఐ బాలరాజు, హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్లాంట్ అధికారులతో చర్చించారు. ప్లాంట్ ముఖ్య అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో బాధితులు శాంతించారు. -
శబరిమల స్పెషల్ యాత్రలు
సనత్‌నగర్: అయ్యప్ప దీక్షలు షురూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల కోసం శబరిమల ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు ట్రావెల్ ఏజెన్సీలు. కొందరు గురుస్వాములు కూడా భక్తులను యాత్రలకు తీసుకెళ్తున్నారు. పల్లె మదనగోపాల్రెడ్డి గురుస్వామి (17వ పడి) ఆధ్వర్యంలో శబరిమల స్పెషల్ యాత్రలు జరగనున్నాయి. ఐదు రోజుల యాత్రలో భాగంగా 19 ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. ఫుష్‌బ్యాక్ వీడియో కోచ్ (2 ప్లస్ 2) వాహనంలో ఈ నెల 28, డిసెంబర్ 6, 14, 28, జనవరి 9 తేదీల్లో ఈ యాత్రలు ప్రారంభమవుతాయి. బీచుపల్లి, అలంపూర్, కాణిపాకం, అరకొండ, శ్రీపురం, అరుణాచలం, చిదంబరం, శ్రీరంగం, ఫలణి, పంబ, శబరిమల ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఐదు రోజుల యాత్రకు రూ.7200 చార్జిగా నిర్ణయించారు. వివరాలకు 98663 34040 నెంబర్లో సంప్రదించవచ్చు. ఆరు రోజుల యాత్ర ... భాస్కర్‌గురుస్వామి (23వ పడి) ఆధ్వర్యంలో శబరిమలై ప్రత్యేక యాత్రలు నిర్వహిస్తున్నారు. ఫుష్‌బ్యాక్ కలర్ వీడియో కోచ్ వాహన సౌకర్యం ఉంటుంది. నవంబర్ 24, డిసెంబర్ 1, 11, 20, 29, జనవరి 5, 9 తేదీల్లో ఈ యాత్రలు ఉంటాయి. ఈ యాత్రలో మహానంది, కాణిపాకం, భవానీ లేక ఫలణి, గురువాయూర్, ఏరిమేలి, పంపా, శబరిమల, కన్యాకుమారి, తిరుచందూర్, రామేశ్వరం, మధురై, తిరుపరన్ కుండ్రం, అరుణాచలం లేక కంచి, గోల్డెన్ టెంపుల్ ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆరు రోజుల ప్యాకేజీకి గాను సిట్టింగ్ రూ.7,500, స్లీపర్ రూ.9,000 చార్జి చేస్తున్నారు. వివరాలకు 88850 99225 నెంబర్లో సంప్రదించవచ్చు. -
సత్యజ్యోతి
చెడు చీకటి నుంచి సత్యం వైపు నడిపించే జ్యోతి మార్గమే అయ్యప్ప దీక్ష అరిషడ్వర్గాలను అరికట్టే అమోఘమైన దీక్ష అయ్యప్ప దీక్ష. ఏటా కార్తీక మాసం నుంచి అయ్యప్ప దీక్షల సందడి మొదలవుతుంది. మార్గశిర, పుష్య మాసాల వరకు ఈ సందడి కొనసాగుతుంది. అయ్యప్ప వెలసిన శబరిమలలో మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో దీక్షను ముగించే వారు కొందరైతే, మండల దీక్షలు చేపట్టే భక్తులు కొందరు జ్యోతి దర్శనంతో నిమిత్తం లేకుండా, దీక్ష గడువు పూర్తవడంతోనే స్వామిని దర్శించుకుని దీక్ష విరమించుకుంటారు. కనీసం మండలకాలం... అంటే నలభైఒక్క రోజులు అత్యంత కఠినమైన నియమ నిబంధనలతో త్రికరణ శుద్ధిగా సాగించే అయ్యప్ప దీక్షలు భక్తుల మనశ్శరీరాలను ప్రక్షాళన చేస్తాయి. వారిలో ఆధ్యాత్మికతను ఇనుమడింపజేస్తాయి. భక్తులకు కొంగుబంగారంగా శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామి గురించి, ఆయన భక్తుల దీక్షల గురించిన విశేషాలు మకర సంక్రాంతి సందర్భంగా... ఆరోగ్య దీప్తి... సామూహిక స్ఫూర్తి అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే భక్తులు పాటించే నియమాలు సామాన్యులకు కఠినతరంగా అనిపిస్తాయి. అయితే, ఈ నియమాలు ఇంద్రియ నిగ్రహానికి, ఆత్మ సంయమనానికి, దుర్వ్యసనాల నుంచి విముక్తికి దోహదపడతాయని చెబుతారు. దీక్షలో ఉండే భక్తులు సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చన్నీటితో స్నానం చేస్తారు. ఉదయం, రాత్రివేళల్లో కేవలం అల్పాహారం తీసుకుంటారు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారు. అల్పాహారమైనా, భోజనమైనా పూర్తిగా సాత్వికాహారమే తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలకు, మాంసాహారానికి దూరంగా ఉంటారు. మద్యపానం, ధూమపానం, తాంబూలం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. దీక్ష పూర్తయ్యేంత వరకు క్షురకర్మ సహా అన్ని బాహ్యాలంకారాలకు దూరంగా, కేవలం దీక్షా వస్త్రాలతోనే ఉంటారు. కటిక నేల మీదనే శయనిస్తారు. అయ్యప్ప దీక్షలో కొనసాగే భక్తులకు విధి నిషేధాలు చాలానే ఉన్నాయి. అనవసర ప్రసంగాలకు, అసత్యానికి వారు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. పాదరక్షలను ధరించకూడదు. ఇతరులను మాటలతో గాని, చేతలతో గాని హింసించే పనులేవీ చేయరాదు. గురుస్వామి ద్వారా దీక్ష మాల ధరించినది మొదలు, శబరిమల యాత్ర పూర్తి చేసుకుని, మాలను తీసివేసేంత వరకు అయ్యప్ప భక్తులు ఈ కఠోర నియమాలను తు.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. దీక్షలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం భజనల్లోను ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ అనే శరణు ఘోషలో గడపాల్సి ఉంటుంది. ఇంత నియమబద్ధంగా నలభై ఒక్క రోజులు గడిపే వారిలో శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి. దీక్షకు ముందు క్రమశిక్షణ లేకుండా గడిపేవారిలో సైతం దీక్ష పూర్తయ్యాక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సంయమనం, సహనం, ఆత్మ నిగ్రహం, ఏకాగ్రత పెరుగుతాయని చెబుతారు. ఒకసారి దీక్ష తీసుకున్న వారు ఏటేటా మళ్లీ మళ్లీ దీక్ష తీసుకుని అయ్యప్పను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతారు. ఏటేటా దీక్షలు చేపట్టే భక్తులు ఆధ్యాత్మిక చింతనతో తామసిక ప్రవృత్తికి దూరంగా ఉంటారు. అయ్యప్ప స్వాములందరూ బృందాలుగా ఉంటూనే సామూహికంగా దీక్షలు సాగిస్తారు. ఈ దీక్షలు వారిలో సామూహిక స్ఫూర్తి పెంపొందించేందుకు దోహదపడతాయి. సన్మార్గానికి సోపానాలు శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయానికి పద్దెనిమిది మెట్లు ఉంటాయి. నియమ నిష్ఠలతో దీక్ష సాగించి, ఇరుముడితో ఇక్కడకు చేరుకునే వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కగలరని అంటారు. అయ్యప్ప ఆలయానికి గల ఈ పద్దెనిమిది మెట్లు సన్మార్గానికి సోపానాలని ప్రతీతి. వీటిలోని తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలకు (కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మం); తర్వాతి ఎనిమిది మెట్లు అష్టరాగాలకు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, తత్వ అహంకారాలు); ఆ తర్వాతి మూడు మెట్లు త్రిగుణాలకు (సత్వ రజస్తమో గుణాలు); మిగిలిన రెండు మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీకలుగా భావిస్తారు. వీటన్నింటినీ అధిగమించిన తర్వాతే భక్తులు అహాన్ని వీడి భగవంతుని చేరుకోగలుగుతారని చెబుతారు. అంతేకాదు, ఈ పద్దెనిమిది మెట్లు అష్టాదశ పురాణాలకు ప్రతీక అని కూడా అంటారు. స్వామి భక్తులు దీక్ష చేపట్టినప్పుడు కట్టిన ఇరుముడిని తలపై పెట్టుకుని ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి, స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడిని సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరిస్తారు. హరిహర సుతుడి గాథలు అయ్యప్పస్వామి హరిహర సుతుడిగా ప్రసిద్ధుడు. మోహినీ అవతారంలోని విష్ణువును శివుడు మోహించిన ఫలితంగా అయ్యప్ప జననం సంభవించిందనే కథనం బాగా ప్రచారంలో ఉంది. మోహినీ అవతారం గురించిన ప్రస్తావన ఉన్న భాగవతంలో అయ్యప్ప జననం ప్రస్తావన కనిపించదు. అయితే, హరిహర నందనుడిగా అయ్యప్ప జననానికి సంబంధించిన గాథ శ్రీ భూతనాథ పురాణంలో విపులంగా ఉంది. ఈ గాథ మేరకు భక్తులు అయ్యప్పస్వామిని హరిహర నందనుడిగానే భావిస్తారు. శివకేశవులకు పుట్టిన వాడైనందున శైవులు, వైష్ణవులు కూడా అయ్యప్పను ఆరాధిస్తారు. అయ్యప్పస్వామి జనన కారణానికి సంబంధించి ఒక గాథ ఉంది. దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేశాక, అతడి సోదరి మహిషి దేవతలపై పగబట్టింది. దేవతలపై పగతీర్చుకోనే శక్తుల కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించింది. శివకేశవులకు పుట్టిన సంతానం తప్ప తనను ఎవరూ జయించరాదని, అది కూడా ఆ హరిహర నందనుడు భూలోకంలో ఒక రాజు వద్ద పన్నెండేళ్లు సేవాధర్మం నిర్వర్తించిన తర్వాత మాత్రమే తనను జయించగలగాలని, లేకుంటే తన చేత ఓటమి చెందాలని వరం కోరింది మహిషి. ‘తథాస్తు’ అంటూ వరాన్ని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. ఇక అప్పటి నుంచి మహిషి దేవతలను పీడించసాగింది. ఇదిలా ఉంటే, హరిహర నందనుడిగా మెడలో మణిమాలతో మణికంఠుడిగా జన్మించిన అయ్యప్ప తన తండ్రి శివుడి ఆదేశంపై పంపా సరోవర తీరాన ఉన్న అరణ్యంలో బాలకుడిగా అవతరించాడు. సంతానం లేని పందళ దేశాధీశుడు రాజశేఖరుడు వేట కోసం అడవికి వచ్చినప్పుడు దివ్యతేజస్సుతో ఉన్న బాలకుడు కనిపించాడు. భగవంతుడే తనకు కుమారుడిని ప్రసాదించాడనే సంతోషంతో రాజశేఖరుడు ఆ బాలకుడిని అంతఃపురానికి తీసుకుపోతాడు. ముద్దులొలికే శిశువును చూసి మహారాణి సంతోషిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషానికి మహారాణికి కడుపు పండి, కొద్దికాలానికి మగశిశువును ప్రసవిస్తుంది. అయ్యప్పను కూడా రాజ దంపతులు కన్నకొడుకుతో సమానంగా అల్లారు ముద్దుగా పెంచసాగారు. బాలకుడిగా ఉన్నప్పుడే అయ్యప్ప జనులకు ధర్మవర్తనపై మార్గదర్శక సూత్రాలను బోధించాడు. బాల్యంలోనే ఆయన ధర్మనిష్ఠకు ముగ్ధులైన జనులు ఆయనను ‘ధర్మశస్త’ పేరుతో పిలవసాగారు. మెడలో మణిహారంతో దొరికిన కారణంగా మణికంఠుడిగా కూడా పిలవసాగారు. మణికంఠుడి సాత్విక గుణాల వల్ల కొందరు ఆయనను ‘అయ్య’ అని, ఇంకొందరు ‘అప్ప’ అని పిలవసాగారు. మరికొందరు రెండింటినీ కలిపి ‘అయ్యప్ప’ అని పిలవసాగారు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తిస్తాడు. విద్యాభ్యాసానికి తగిన వయసు రాగానే రాజశేఖరుడు అయ్యప్పను, తన కొడుకును గురుకులానికి పంపుతాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకు వచ్చిన తర్వాత అయ్యప్పకు రాజ్యభారాన్ని అప్పగించాలని భావిస్తాడు రాజశేఖరుడు. మహారాణికి అది నచ్చక తలనొప్పి అంటూ నాటకమాడుతుంది. తన వ్యాధి తగ్గడానికి పులిపాలు కావాలంటుంది. పులిపాలు తెస్తానంటూ అయ్యప్ప అడవికి బయలు దేరుతాడు. మహిషి వధ అయ్యప్ప అడవికి బయలుదేరే సమయంలో నారదుడు కూడా అడవికి వెళ్లాడు. అడవిలో సంచరిస్తూ మునులను, దేవతలను పీడించే మహిషిని కలుసుకున్నాడు. కలహప్రియుడైన నారదుడు ‘నిన్ను చంపేందుకు రాజకుమారుడు ఈ అడవికి వస్తున్నాడు’ అంటూ మహిషిని రెచ్చగొట్టాడు. పులిపాల కోసం అడవికి వచ్చిన అయ్యప్పను చంపడానికి మహిషి గేదె రూపంలో రంకెలు వేస్తూ బయలుదేరింది. ఎదురుపడిన అయ్యప్ప మీదకు లంఘించింది. అయ్యప్ప అమాంతం అక్కడే ఉన్న కొండపైకి ఎక్కి తాండవమాడుతూ మహిషిని ఎదిరించాడు. మహిషితో అయ్యప్ప యుద్ధాన్ని తిలకించడానికి దేవతలంతా అదృశ్యరూపంలో అక్కడకు చేరుకున్నారు. భీకర యుద్ధంలో అయ్యప్ప మహిషిని ఒడిసి పట్టుకుని నేలకేసి విసిరికొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. మహిషి పీడ విరగడ కావడంతో ఇంద్రాది దేవతలు హర్షాతిరేకాలతో ముందుకు వచ్చి అయ్యప్పను వేనోళ్ల ప్రస్తుతించారు. ‘స్వామీ! నిన్నెలా సేవించుకోగలం’ అని దేవతలు ప్రశ్నించగా, ‘నేను పులి పాల కోసం ఈ అడవికి వచ్చాను. మీరంతా పులులుగా మారి నాకు తోడ్పడండి’ అని కోరాడు. దేవతలంతా పులులుగా మారిపోయారు. ఇంద్రుడు పులి రూపంలో తానే అయ్యప్పకు వాహనంగా మారాడు. పులుల దండుతో అయ్యప్ప రాజ్యానికి చేరుకుంటాడు. శబరిమల నివాసం అడవి నుంచి రాజ్యానికి చేరుకున్న అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలని భావిస్తాడు రాజశేఖరుడు. అయ్యప్ప తనకు రాజ్యం వద్దని, తనకు ఒక ఆలయాన్ని నిర్మించి ఇస్తే చాలని కోరుతాడు. తాను ఇక్కడి నుంచి సంధించి విడిచి పెట్టిన బాణం ఎక్కడ పడుతుందో అక్కడ తనకు ఆలయం నిర్మించాలని సూచిస్తాడు. అయ్యప్ప విడిచిన బాణం శబరిమల కొండ మీద పడుతుంది. అక్కడ కట్టించిన ఆలయంలోనే అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకుని జనుల మంచిచెడ్డలు చూసుకునేవాడు. ఈ ఆలయంలో కొలువైన అయ్యప్ప ఇప్పటికీ తమ కోర్కెలు తీరుస్తుంటాడని భక్తుల నమ్మకం. అయ్యప్ప వెలసిన ఈ శబరిమల లోగడ రామభక్తురాలైన శబరికి ఆవాసంగా ఉండేది. శబరి శ్రీరాముడికి తాను రుచి చూసిన పండ్లు తినిపించినది ఇక్కడేనని ప్రతీతి. శబరిమల యాత్ర దీక్ష స్వీకరించి, నియమబద్ధంగా మండలం రోజులు గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. స్వామి సన్నిధానాన్ని సందర్శించుకుని, ఇరుముడిని స్వామికి సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరించడంతో యాత్ర ముగుస్తుంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పడమటి కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది శబరిమల. దట్టమైన అడవులు ఉన్న ప్రాంతంలో పద్దెనిమిది కొండల నడుమ ఉన్న శబరిమల అయ్యప్ప సన్నిధానానికి యాత్రలు ఏటా నవంబరు నెలలో ప్రారంభమవుతాయి. జనవరి నెలలో మకర సంక్రాంతి నాటితో ముగుస్తాయి. కార్తీకమాసంలో మండల దీక్షలు చేపట్టే వారు సాధారణంగా నవంబర్ నెలలో స్వామిని దర్శించుకుని, యాత్రను ముగిస్తారు. ‘మకర విళక్కు’ యాత్రకు వెళ్లే వారు మకర సంక్రాంతి రోజున స్వామిని దర్శించుకుంటారు. ఇదేరోజు ఆలయం నుంచి చూసే వారికి ‘మకరజ్యోతి’ కనిపిస్తుంది. మకరవిళక్కు యాత్రకు వెళ్లే భక్తులు ‘మకరజ్యోతి’ దర్శనంతో యాత్రను ముగించుకుంటారు. ఎరుమేలితో యాత్ర మొదలు... శబరిమల యాత్ర ఎరుమేలి నుంచి మొదలవుతుంది. ఎరుమేలిలో భక్తులు తొలుత ‘వావరు స్వామి’ని దర్శించుకుంటారు. వావరు స్వామి తొలుత గజదొంగగా ఉండేవాడు. అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి వెళ్లినప్పుడు ఆయనను అడ్డగించాడు. స్వామి మహిమను తెలుసుకున్న తర్వాత స్వామికి భక్తుడిగా మారిపోయాడు. ఒకరకంగా వావరుస్వామి అయ్యప్పస్వామికి తొలి భక్తుడు. ‘నా దర్శనానికి వచ్చే భక్తులందరూ తొలుత నిన్ను దర్శించుకుంటారు’ అని అయ్యప్పస్వామి వావరుస్వామికి వరం ఇచ్చినట్లు ప్రతీతి. ముస్లిం అయిన వావరుస్వామి ఎరుమేలిలోని మసీదులో వెలిశారు. స్వామి భక్తులందరూ తొలుత ఇక్కడి మసీదులోని వావరు స్వామిని దర్శించుకుంటారు. దర్శనం తర్వాత రకరకాల వేషధారణలతో ‘పేటై తుళ్ల’ అనే నాట్యం చేస్తారు. ఎరుమేలిలో ఉన్న ‘ధర్మశాస్త’ ఆలయంలో అయ్యప్పస్వామి ధనుర్బాణాలతో దర్శనమిస్తాడు. ఇదే ఆలయంలో వినాయకుడు కూడా కొలువై ఉన్నాడు. అరణ్యమార్గంలో పాదయాత్ర వావరు స్వామి దర్శనం తర్వాత ఎరుమేలి నుంచి అయ్యప్పస్వామి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. శబరిమల వెళ్లడానికి ఇక్కడి నుంచి రెండు మార్గాలు ఉన్నాయి. ‘పెద్దపాదం’ మార్గం అత్యంత దుర్గమమైన అరణ్యమార్గం. దాదాపు ఎనభై కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలో పెరుర్తోడు, కాలైకుట్టి అనే స్థలాలు ఉన్నాయి. మహిషితో అయ్యప్ప యుద్ధం చేస్తుండగా కాలైకుట్టి నుంచి శివకేశవులు ఆ యుద్ధాన్ని తిలకించారట. ఇక్కడకు చేరువలోనే అళుదా నది ఉంది. మహిషి కన్నీరు కార్చగా ఆ కన్నీరే ఇక్కడ అళుదా నదిగా ఏర్పడిందట. ఈ నదిలో భక్తులు స్నానాలు ఆచరించి, నది నుంచి రెండు రాళ్లను తీసుకువెళతారు. ఆ రాళ్లను మహిషిని పూడ్చిపెట్టిన చోటు ‘కళిద ముకుంద’ వద్ద పడవేస్తారు. అక్కడి నుంచి ముందుకు సాగి కరిమల కొండకు చేరుకుంటారు. ఏటవాలుగా ఉండే ఈ కొండ మీదకెక్కడం చాలా కఠినమైన పని అని చెబుతారు. అయితే భక్తులు ఎలాంటి భయం లేకుండా శరణుఘోషతో బృందాలు బృందాలుగా ముందుకు సాగుతారు. కరిమల కొండను దాటిన తర్వాత పంపా నది వద్దకు చేరుకుంటారు. పంపానదిలో స్నానం భక్తుల అలసటను పోగొడుతుంది. పంపా స్నానం తర్వాత భక్తులు ఇక్కడి నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామి సన్నిధానానికి చేరుకుంటారు. కఠినమైన ‘పెద్దపాదం’ మార్గంలో వెళ్లలేని భక్తులు ‘చిన్నపాదం’ మార్గాన్ని ఎంచుకుంటారు. ‘చిన్నపాదం’ మార్గంలో బస్సులు తిరుగుతాయి. ఈ మార్గంలో భక్తులు నేరుగా పంపానది వరకు బస్సుల్లో చేరుకోవచ్చు. అయితే, అక్కడి నుంచి సన్నిధానం వరకు పాదయాత్ర సాగించాల్సి ఉంటుంది. ఇరుముడి అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమల వెళ్లే భక్తులు నెత్తిమీద ‘ఇరుముడి’ని మోసుకుపోతుంటారు. ‘ఇరుముడి’ అంటే రెండు అరలు ఉండే మూట. ఈ ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ ఒకటి, రెండు మామూలు కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, నాణేలు, పసుపు, గంధపు పొడి, విభూతి, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, అరటిపండ్లు, కలకండ, అగరువత్తులు, కర్పూరం, మిరియాలు (వావరు స్వామి కోసం), తేనె, ఎండుద్రాక్ష, తువ్వాలు తదితరమైనవి పెట్టుకుంటారు. దీక్ష స్వీకరించే భక్తులు ఈ వస్తువులను ‘ఇరుముడి’గా కట్టుకొనే ఉత్సవాన్ని ‘కెట్టునిరా’ లేదా ‘పల్లికట్టు’ అంటారు. నలుపు దుస్తులు ఎందుకంటే.? అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు దీక్షా వస్త్రాలుగా నలుపురంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారంటే... ఒకసారి శనీశ్వరుడు అయ్యప్పస్వామితో తలపడి ఓటమి చెందాడు. శనీశ్వరుడు శరణు వేడటంతో క్షమించిన అయ్యప్పస్వామి ఆయనకు ‘నా దీక్ష చేపట్టే భక్తులు నీకు ఇష్టమైన నలుపు రంగు దుస్తులే ధరిస్తారు’ అంటూ వరమిచ్చాడు. అందుకే అయ్యప్ప భక్తులు నలుపురంగు దుస్తులను ధరిస్తారు. అలాగే, అయ్యప్ప భక్తులకు శనీశ్వరుడు ఎలాంటి ఇక్కట్లూ కలిగించడని ప్రతీతి. పడిపూజ అయ్యప్పస్వామి దీక్షలో కొనసాగే భక్తులు శక్తిమేరకు తోటి స్వాములను ఆహ్వానించి భిక్ష (భోజనం) పెడతారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి సన్నిధానాన్ని తలపించే రీతిలో పద్దెనిమిది మెట్లతో పీఠాన్ని ఏర్పాటు చేసి, దానిపై అయ్యప్పను నిలిపి పూజలు చేస్తారు. భజనలు, పూజలు, శరణుఘోషతో భక్తి పారవశ్యాలతో గడుపుతారు. ఈ కార్యక్రమాన్నే పడిపూజ అంటారు. గురుస్వామి ప్రశస్తి అయ్యప్ప దీక్షలు చేపట్టే భక్తులు గురుస్వామిని సాక్షాత్తు అయ్యప్పస్వామికి ప్రతిరూపంగా భావిస్తారు. గురుస్వాములే మిగిలిన స్వాములకు మాలధారణం చేయిస్తారు. తొలిసారి అయ్యప్ప మాల ధరించే వారిని కన్నెస్వాములంటారు. రెండోసారి మాల ధారణ చేసేవారిని కత్తి స్వాములని, మూడోసారి మాలధారణ చేసేవారిని ఘంట స్వాములని, నాలుగోసారి మాలధారణ చేసేవారిని గద స్వాములని, ఐదోసారి మాల ధారణ చేసేవారిని పెరుస్వాములని, ఆరోసారి మాలధారణ చేసేవారిని గురుస్వాములని అంటారు. హరివరాసనం అయ్యప్పస్వామి పూజ చివరిలో ‘హరివరాసనం’ లేదా ‘శ్రీ హరిహరాత్మజాష్టకం’ గానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. శబరిమలతో పాటు ఇతర ప్రాంతాల్లోని అయ్యప్పస్వామి ఆలయాల్లోనూ ‘హరివరాసనం’ గానంతో అయ్యప్పస్వామి పూజలను ముగిస్తారు. ఇది స్వామివారికి జోల వంటిది. ఇందులో ఎనిమిది శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతున్నప్పుడు ఆలయంలోని ఒక్కొక్క దీపాన్ని కొండెక్కిస్తారు. చివరిగా గర్భగుడిలో ఒక్క దీపాన్ని మాత్రమే ఉంచుతారు. ‘హరివరాసనం’ స్తోత్రాన్ని కుంబకుడి కులతూర్ అయ్యర్ రచించారు. స్వామి విమోచానంద ఈ స్తోత్రాన్ని 1955లో శబరిమలలో గానం చేశారు. అప్పట్లో ఈ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగా ఉండేది. ఆ కాలంలో వీఆర్ గోపాల మీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆయన అయ్యప్ప సన్నిధానంలో నిత్యం ‘హరివరాసనం’ స్తోత్రాన్ని గానంచేస్తూ వచ్చేవాడు. కొన్నాళ్లకు గోపాల మీనన్ శబరిమల నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆయన కాలం చేశాడు. ఆయన మరణవార్త తెలుసుకున్న అయ్యప్పస్వామి అర్చకుడు ఈశ్వరన్ నంబూద్రి ఆలయాన్ని మూసివేసే సమయంలో ‘హరివరాసనం’ స్తోత్రాన్ని గానం చేశాడు. అప్పటి నుంచి ఆలయం మూసివేసే సమయంలో ఈ స్తోత్రాన్ని గానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. -
అయ్యప్ప దీక్షకు అన్ని నియమాలెందుకంటే..?
అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి. ఆ స్వామి దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్షమాలలను ధరిస్తారు. నుదుట చందనం, విభూది ధరిస్తారు. ఈ నియమాలన్నిటి వెనకా ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయి. రెండుపూటలా చన్నీళ్ళస్నానం ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవద్ధ్యానానికి తోడ్పడుతుంది. తులసి పూసల నుంచి వెలువడే వాయువు ఆరోగ్యాన్నిస్తుంది. రోగనిరోధక గుణం కల తులసి, రద్రాక్షలు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి. విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్ఛస్సు, ధైర్యం, బలం కలగడమేగాక వాత, పిత్త, కఫ రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఆహార నియమం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి, కోరికలను అదుపులో ఉంచుతుంది. పాదరక్షలు ధరించరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. నలభై ఒక్క రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచేందుకు వీలవుతుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ. అంతేకాదు, నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయ కారక తత్వం నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి కాబట్టే ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మ చర్యం కూడా దీక్షలో భాగమైంది. -
నియమాల తోరణం
అలౌకికం మాసాలన్నింటిలోకి కార్తికం అత్యంత పవిత్రమైనది, ఆహ్లాదకరమైనదీ, హరిహరులకు, వారి తనయుడైన అయ్యప్పకు ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, దీక్షలు అనంతమైన ఫలాన్నిస్తాయి. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకునేవారు సాధారణంగా కార్తికమాసంలోనే మాల ధారణ చేస్తుంటారు. ఈ మాసంలో మరో పన్నెండురోజులు మిగిలాయి. ఈ మిగిలున్న రోజుల్లోనైనా నియమనిష్ఠలతో గడుపుతూ, మనస్సునూ, శరీరాన్నీ పవిత్రంగా ఉంచుకోవడం ఆవశ్యకం. ఇష్టదైవాలను బట్టి, జీవనశైలిని బట్టి ఈ మాసంలో మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా అయ్యప్పమాల, భవానీమాల, శ్రీవెంకటేశ్వరమాల, సాయిమాల, గణపతి మాల, గోవిందమాల, శివమాల, హనుమద్దీక్ష... బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ అన్ని రకాల మాలధారణలు సక్రమమైన దినచర్య, నియమనిష్ఠలనే ప్రధానంగా సూచిస్తున్నాయి. దైవకృపకు పాత్రులవాలంటే పవిత్రత తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. రోజువారీ జీవితంలో పాటించడానికి అనువుగా ఉండని జీవనశైలిని ఈ దీక్షా కాలంలో అనుసరించ వలసి వుంటుంది. మానసిక బలహీనతలను దూరంచేసుకోవడానికి, మనసుపై నియంత్రణ సాధించడానికి ఈ దీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయన్నది సత్యం. అదేవిధంగా ఇంచుమించు అన్ని రకాల దీక్షలూ కూడా మండల దీక్షలే కావడం గమనార్హం. ఎందుకంటే ఏదైనా కొత్త పనిని కనీసం 40 రోజుల పాటు దినచర్యలో భాగం చేసినప్పుడే అది అలవాటుగా మారుతుంది. అందుకే మండల దీక్షల పేరిట సంప్రదాయాన్ని విధించారు పెద్దలు. అదే ఈ నియ‘మాల’ రహస్యం. దీక్షల ద్వారా భక్తి, ఆధ్యాతిక భావనలతోబాటు ఆరోగ్యకర జీవనశైలి అలవడుతుండటం ప్రత్యక్ష ప్రయోజనాలు. అందుకోవడం, ఆచరించడం ఆధ్యాత్మికానందాలలో ఓలలాడటం ఆవశ్యకం. - కృష్ణ కార్తీక -
అయ్యప్ప దీక్ష మాదిరి జలదీక్ష: చంద్రబాబు
ఒంగోలు: భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లుగానే తాను జలదీక్ష తీసుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన ముగిసింది. ఆయన ఈరోజు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. మునగనూరు మండలం పోలవరం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు, తాగు నీరు అందించేవరకు జలదీక్ష విరమించను అని చెప్పారు. డ్వాక్రా రుణాలను దశలవారీగా మాఫీ చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను పూర్తి చేసి, తానే ప్రారంభిస్తానన్నారు. నదుల అనుసంధానంలో భాగమే పట్టిసీమ ప్రాజెక్టు అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిందని చంద్రబాబు అన్నారు. -
నల్లచొక్కాతో వాదనలు వినిపించొద్దు
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక న్యాయవాది నల్లచొక్కా వేసుకుని వచ్చి వాదనలు వినిపించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం సమీపంలో మద్యనిషేధం అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై వాదనలు వినిపించడానికి వచ్చిన న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ నల్లచొక్కా, బ్లేజర్, దానిపై రోబ్స్ మెడలో బ్యాండ్‌తో వచ్చారు. ఆయన వస్త్రధారణను గమనించిన ప్రధాన న్యాయమూర్తి.. తెల్లచొక్కా ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు. అయ్యప్ప దీక్షలో ఉన్నానని ఆయన చెప్పగా, ఎన్ని రోజులు ఇలా నల్లచొక్కాతో వస్తారని మరో ప్రశ్న వేశారు. దీంతో పక్కనే ఉన్న మరో న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ దీక్ష గురించి ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. అనంతరం నిబంధనల కన్నా దీక్ష ఎక్కువ కాదని జస్టిస్ సేన్‌గుప్తా తేల్చి చెప్పారు. దీక్ష ముగిసిన తర్వాతే వాదనలు వినిపించాలని పేర్కొంటూ ఈ పిటిషన్‌పై విచారణను రెండు నెలలు వాయిదా వేశారు. -
అయ్యప్పదీక్ష నియమాలలోని అంతరార్థాలు...
రెండుపూటలా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవద్ధ్యానానికి తోడ్పడుతుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. రోగనిరోధక గుణం గల తులసి, రుద్రాక్షలు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి. ఆహారనియమం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి, కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి. ఇంద్రియ నిగ్రహానికి ప్రధానకారకమైన కామం పైన అదుపు ఉండటం కోసమే అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు. పాదరక్షలు ధరించకపోవడం వల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. అంతేకాదు... పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు ఉంటుంది. మండలం రోజులపాటు ఈ నియమాలన్నీ సరిగ్గా పాటిస్తే మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుంది. అందుకే ఇన్ని నియమాలు.