దీపావళి సంబరాలు ముగిశాయి. ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలైంది. శివ కేశవుల భక్తులంతా ఏంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయమిది. ఈ పుణ్య మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1న సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున ఆ మరుసటి రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలనేది పండితుల మాట. శివనామస్మారణలతో ఆలయాలన్నీ మార్మోగుతాయి. వేకువ ఝామునే చన్నీటి స్నానాలు, దీపారాధన, శివరాధనలో భక్తులు పరవశిస్తారు.
కార్తీకమాసం అంతా ధూప దీపాలు, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శివాలయంలోనో మరేదైనా దీపం వెలగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. కనీసం ఇంట్లో తులసికోటముందు దీపాలు వెలిగించినా పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు.
ప్రత్యేకంగా మహిళలు నిష్టగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీకపురాణ పఠనం చేస్తూ శివకేశవులిద్దరనీ ఆరాధిస్తారు. ఈ పురాణంలో శివారాధన, దీపారాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. అలాగే శక్తి కొలదీ దానం చేయం, సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు, ఆరిపోతున్న దీపపు ఒత్తిని సరిచేసి, దీపాన్ని వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతుంది. నిష్టగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, ఉసిరి దీపాలు, దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెడతారని చెబుతుంది. అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది.
ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు నాగుల చవితి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశితోపాటు, కార్తీకపూర్ణిమ ( నవంబర్ 15వతేదీ శుక్రవారం) రోజులు అతిపవిత్రమైనవి భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి సమీపంలోని నదులు,చెరువులలో వదిలే దృశ్యాలు కన్నుల పండువలా ఉంటాయి. అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
అయ్యప్ప దీక్షలు, పడిపూజలు
కార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం. అయ్యప్పదీక్షలు కార్తీక మాసం నుంచి,మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల ధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తారు. స్వామి చింతనలో, సాత్విక జీవనాన్ని పాటిస్తారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానం భజనలు, పూజలతో గడుపుతారు. దిండ్లు పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు. బ్రాహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తారు. సంక్రాంతిలో రోజు మకర జ్యోతి దర్శనంతో దీక్షలను విరమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment