Kartikamasam
-
పరమ పవిత్రం.. కార్తీక మాస విశేషాలివిగో
దీపావళి సంబరాలు ముగిశాయి. ఆ వెంటనే పవిత్ర కార్తీక మాసం హడావిడి మొదలైంది. శివ కేశవుల భక్తులంతా ఏంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయమిది. ఈ పుణ్య మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1న సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున ఆ మరుసటి రోజు నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలనేది పండితుల మాట. శివనామస్మారణలతో ఆలయాలన్నీ మార్మోగుతాయి. వేకువ ఝామునే చన్నీటి స్నానాలు, దీపారాధన, శివరాధనలో భక్తులు పరవశిస్తారు.కార్తీకమాసం అంతా ధూప దీపాలు, శివనామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. శివాలయంలోనో మరేదైనా దీపం వెలగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగి పోతాయని భక్తులు నమ్ముతారు. కనీసం ఇంట్లో తులసికోటముందు దీపాలు వెలిగించినా పుణ్యం దక్కుతుందని భావిస్తారు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు.ప్రత్యేకంగా మహిళలు నిష్టగా పూజలు చేస్తారు. దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీకపురాణ పఠనం చేస్తూ శివకేశవులిద్దరనీ ఆరాధిస్తారు. ఈ పురాణంలో శివారాధన, దీపారాధన వైశిష్ట్యం, ఫలితాల గురించి విపులంగా ఉంటుంది. అలాగే శక్తి కొలదీ దానం చేయం, సాత్విక జీవనం లాంటి విషయాలతో పాటు, ఆరిపోతున్న దీపపు ఒత్తిని సరిచేసి, దీపాన్ని వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతుంది. నిష్టగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, ఉసిరి దీపాలు, దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెడతారని చెబుతుంది. అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన కార్తీక సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటితో పాటు నాగుల చవితి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశితోపాటు, కార్తీకపూర్ణిమ ( నవంబర్ 15వతేదీ శుక్రవారం) రోజులు అతిపవిత్రమైనవి భక్తులు భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం. అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి సమీపంలోని నదులు,చెరువులలో వదిలే దృశ్యాలు కన్నుల పండువలా ఉంటాయి. అలాగే జ్వాలాతోరణం ఉత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.అయ్యప్ప దీక్షలు, పడిపూజలుకార్తీక మాసం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం. అయ్యప్పదీక్షలు కార్తీక మాసం నుంచి,మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల ధారణ చేస్తారు. 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో దీక్షను కొనసాగిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న నాటి నుంచి నియమాలు, నిబంధనలు తు.చ తప్పకుండా పాటిస్తారు. స్వామి చింతనలో, సాత్విక జీవనాన్ని పాటిస్తారు. తెల్లవారుజామునే చన్నీటి స్నానం భజనలు, పూజలతో గడుపుతారు. దిండ్లు పాదరక్షలు కూడా వాడకుండా నేలపై పడుకుంటారు. బ్రాహ్మచర్యాన్ని పాటిస్తూ మండలం అనగా 41రోజులు పాటు ఈ నియమాలను భక్తి, శ్రద్ధలతో ఆచరిస్తారు. సంక్రాంతిలో రోజు మకర జ్యోతి దర్శనంతో దీక్షలను విరమిస్తారు. -
వచ్చే నెల తిరుమలలో పలు విశేష ఉత్సవాలు
సాక్షి, తిరుమల: వచ్చే నెలలో తిరుమలలో పలు విశేష పూజలు, ఉత్సవాలు జరగనున్నట్లు దేవస్థానం అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తిరుమల అధికారులు మంగళవారం తెలిపారు. అవి: నవంబర్ 14న దీపావళి ఆస్థానం; నవంబర్ 18న నాగుల చవితి; నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ; నవంబర్ 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం; నవంబర్ 25న స్మార్త ఏకాదశి; నవంబర్ 26న మధ్య ఏకాదశి, క్షిరాబ్ది ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి, చక్రతీర్థ ముక్కోటి; నవంబర్ 27న కైశిక ద్వాదశి ఆస్థానం; నవంబర్ 29న కార్తిక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర. -
సామాజిక వనంలో కార్తీక జన భోజనాలు
కార్తీకమాసం మరికొద్దిరోజులు మాత్రమే ఉంది. ఇంతకాలం వివిధ కారణాల వల్ల వనభోజనాలకు వెళ్ల(లే)నివారు ఇప్పుడైనా సరే.. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధుమిత్రులతో కనీసం కుటుంబ సభ్యులతో కలసి ఒక పిక్నిక్లా వనభోజనాలకు వెళ్లి, స్నేహంగా... ప్రేమగా.. సమైక్యతా భావంతో జరుపుకుంటే.. ఆత్మీయానుబంధాలు పెనవేసుకుంటాయి. మానవ సంబంధాలు బలపడతాయి. కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అంతేకాదు.. ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు కార్తీక వనభోజనాలు మంచి ఆటవిడుపు. పూర్వం సూతమహర్షి ఆధ్వర్యంలో నైమిశారణ్యంలో మునులందరూ వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీకపురాణం చెబుతోంది. అలా పూర్వం ఆ మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాల ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ మనందరం ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి మెలిసి సంతోషంగా వేడుకలు జరుపుకొంటూ ఆనందిస్తున్నాం. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యానవనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు. వనభోజనాలు మనలోని కళా ప్రావీణ్య ప్రదర్శనకూ వేదికగా నిలుస్తాయి. భోజనాలకే పరిమితం కాకుండా, అందరూ కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా, ఆనందంగా గడిపేందుకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుంది. ప్రకృతి ఆరాధన మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు. ఫలం, పుష్పం, పత్రం లేకుండా మన పూజలు సంపూర్ణం కావు. సంస్కృతి ముందుకు సాగినా భారతీయులు ఆనాటి మూలాలను మర్చిపోలేదు. మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని వారికి తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట. అలాంటి ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధభరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడానికైనా వనభోజనాలు సరైన సందర్భాలు. ఎక్కడపడితే అక్కడ వనభోజనాలు అంత ఆరోగ్యకరం కాదు కాబట్టి ఉసిరి చెట్టు ఉన్న వనం ముఖ్యం అన్నారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సామాజికం... ఇలా ఏ కోణంలోంచి చూసినా వనభోజనాలకు సాటి మరో సందర్భం కానరాదు! ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడమ’ని అమరకోశం చెబుతుంది. జపానులో కూడా హనామి (హన – పువ్వు, మిమస్ – చూడటం) పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుకను జరుపుకుంటారు. సామాజిక కోణం వనభోజనాలు సంప్రదాయమే కాదు అందులో సామాజిక కోణమూ వుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ కోణం. అంతస్తుల తారతమ్యాలు లేని సమైక్యతా భావం ఈ సహపంక్తి భోజనాల్లో వెల్లివిరుస్తుంది. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించే క్రమంలో వన భోజనాలు జన భోజనాలుగా వర్థిల్లుతాయి. – పూర్ణిమాస్వాతి గోపరాజు కార్తీక మాసంలోనే ఎందుకంటే..? కార్తీక మాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అలాంటి ఆరుబయలు ప్రదేశంలో అందరూ కలిసి అక్కడే వంటలు వండుకుని తినడం మరీ మంచిది. కుదరని పక్షంలో అందరి ఇళ్లనుంచి తెచ్చిన వంటకాలను ఒకరితో ఒకరు పంచుకుని తినడం కూడా స్నేహపరిమళాలు ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది. అందరూ కుటుంబాలతో వెళ్లడం, చెట్లకింద రకరకాలవంటలు వండుకుని తినడం ఒక అనుభవం. అయితే... ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజ నాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు. -
ఆట కదరా భరణీ
కార్తీకం శివుడికి ప్రీతికరమైనది. భరణికి శివుడు ప్రియాతిప్రియమైనవాడు. ‘ఆట కదరా శివా..!’ అనేంత అఫెక్షన్. ‘నావాడు’ అంటాడు. ‘నిను వీడను ఏనాడూ’ అంటాడు. కన్నప్ప శివుడికి కన్నిచ్చి భక్తకన్నప్ప అయ్యాడు. భరణి శివుడికి ఏమీ ఇవ్వలేదు. తనే శివుణ్ని లోపలికి లాగేసుకున్నాడు. శివుణ్ణే.. భక్తశివుణ్ణి చేసేసుకున్నాడు! దేవుడా.. అంటే.. ‘అవును దేవుడే.. ఇంత ఫ్లెక్సిబిలిటీ నా శివయ్య దగ్గర నాకు ఉంది’ అంటాడు. భరణి శివుడి గురించి చెబుతున్నంతసేపూ.. ‘ఆట కదరా భరణీ’ అనిపించింది మాకు!! కార్తీక మాసం అంటే శివుడికి ప్రత్యేకం. పైగా మీరు మాల కూడా ధరిస్తారు కాబట్టి ఆ విశేషాలు చెబుతారా? తనికెళ్ల: మామూలుగా ఈ మాసంలో దీక్ష తీసుకుంటాను. దేవుడు, దైవకార్యాలు ఏమైనా కూడా ఆరోగ్యంతో లింక్ అయ్యుంటాయి. అంటే ఏడాది పొడవునా ముప్పూటలా తింటాం కాబట్టి.. మండలం (40 రోజులు) పాటు ఆహార నియమాలు పాటిస్తాం. మాల ధరించిన ఆ నలభై రోజులు మన జీవన విధానం ఓ క్రమ పద్ధతిలో ఉంటుంది. సైంటిఫిక్‌గా మనలో ఉన్న టాక్సిన్స్ అన్నీ 20 రోజులకు పోతాయి. చెత్త అంతా పోయాక అక్కడ్నుంచి శక్తి ఆరంభమవుతుంది. 40 రోజులు ముగిసేసరికి ఓ కొత్త శక్తి వస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. శివ దీక్ష, బాబా దీక్ష, అయ్యప్ప దీక్ష.. ఏ దీక్ష అయినా 40 రోజులు అని అందుకే నిర్ణయించారు. కానీ కొందరు 20 రోజులు, 3 రోజులు... ఇలా కూడా దీక్ష తీసుకుంటుంటారు కదా? దురదృష్టవశాత్తు వాళ్ల సౌకర్యం కోసం చేసేవాళ్లు ఉన్నారు. అసలు చేయపోతే నష్టం ఏంటి? చేస్తే 40 రోజులు.. లేకపోతే ఓ నమస్కారం పెట్టుకోండి. ఏ దేవుడూ నా దీక్ష తీసుకోకపోతే నేను ‘సర్వైవల్’ కాలేను అనడు కదా. నేనైనా, ఎవరైనా... దీక్ష తీసుకుంటే పాటించాల్సిన నియమం ఏంటంటే.. ఏకభుక్తం (ఒక పూట భోజనం, సాయంత్రం అల్పాహారం) భూశయనం (నేల మీద నిద్రపోవడం), బ్రహ్మచర్యం (కామ, క్రోధ, లోభాలకు దూరంగా ఉండాలి. అలాగే మందు.. పాన్‌పరాగ్ వంటి చెత్తాచెదారానికి దూరంగా ఉండటం). సౌకర్యంలోనే కాదు.. అసౌకర్యంలో కూడా ఉండగలను అనడానికి భూశయనం. నడుము నొప్పి ఉన్నవారిని డాక్టర్ తలగడ లేకుండా కింద పడుకోమంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవి అలవాటు అయితే రేపు ఆస్పత్రికి వెళ్లే ఖర్మ ఉండదు. ఒక దీక్ష వెనకాల ఇంత అర్థం ఉంటుంది. దీన్ని చాలామంది అర్థం చేసుకోవడం లేదు. కొంచెం కఠినంగానే చెబుతున్నాను. రేపు మాల వేసుకుంటున్నాడంటే తెల్లవారు జాము వరకూ మందు తాగుతాడు. మాల తీసేసిన గంటకే పాన్ పరాగ్, సిగరెట్ మొదలుపెట్టేస్తాడు. ఇలా దీక్ష తీసుకోపోతే ఏం? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మూడ భక్తిని మనం ప్రచారం చేయొద్దు. అవకాశం ఉంటే ఖండిద్దాం. ఎందుకంటే ఈ మధ్య భక్తి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే.. సాయిబాబా అంటే ఫ్రెండ్లీగా, శివుడంటే కొంచెం భయంగా ఉంటుందని కొందరు అంటారు.. సాయిని తిరగేస్తే ‘యిసా’. యిసా అంటే శివుడే. వీడితో కూడా ఫ్రెండ్లీగా ఉండండి. దేవుడిని చూసి భయపడకండి. పాపాన్ని చూసి భయపడండి. మనకు ఉండాల్సింది దైవభక్తి, పాపభీతి. పాపం చేస్తే నాశనమవుతాం లేదా నరకానికి పోతాం అనే భయం ఉండాలి. అంతేకానీ దేవుడంటే భయం ఉండకూడదు. దేవుడు కరుణా సముద్రుడు. వాడంటే భయం ఎందుకు? దేవుడికీ దెయ్యానికీ తేడా తెలియకపోతే ఎట్లా? ఖర్మ. దేవుడిని వాడు వీడు అనొచ్చా? మనలోని మైనస్ పాయింట్లను దేవుడికి అంటకట్టాం. దేవుడు తల్లివంటివాడు. మంచి స్నేహితుడు. వాడికి గౌరవం ఇచ్చి దూరం పెట్టకండి. దగ్గర చేసుకోండి. అయ్యప్ప దీక్షకి అయితే ‘పీఠం’ పెడతారు. శివుడి దీక్షకు? శివుడికి పీఠం పెట్టక్కర్లేదు. శివుడికి తక్కువ నియమాలు ఉంటాయి. అయ్యప్ప మాల వేసుకుని, శబరిమలకే వెళ్లాలి. అయితే ‘సర్వం శివమయం’ అంటారు. శివ మాలను ఎక్కడైనా ఏ శివుడి గుడిలో అయినా తీయొచ్చు. అయ్యప్పకు చేసినట్లుగా ఇరుముడి అక్కర్లేదు. ‘ఇరుముడి’ అంటే రెండు ముడులు అని అర్థం. హోటల్స్ లేని కాలంలో ఒక మూటలో తమ వంట కోసం బియ్యం, పప్పు తీసుకెళ్లేవాళ్లు. మరో మూటలో దేవుడికి సమర్పించడానికి కొబ్బరికాయ, దానికి చిన్న చిల్లు పెట్టి, నెయ్యి పోసి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇరుముడి అవసరంలేదు. సంప్రదాయం రాను రాను ఓ స్టాంప్ అయిపోయింది. శివమాల ఎప్పుడు మొదలుపెట్టారు? 1970ల్లో ఓ మలయాళీని చూసి మా గురువు రాళ్లపల్లిగారు అయ్యప్ప మాల వేసుకోవడం ప్రారంభించారు. ఆయన్ను చూసి నేనూ దీక్ష మొదలుపెట్టాను. ఓ పదిసార్లు శబరిమలకు వెళ్లాను. మదరాసు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాక ఓ తమాషా సంఘటన జరిగింది. నేను, నా మిత్రుడు సుబ్బారావు, దేవరకొండ కుమార్ మాల వేసుకున్నాం. వీళ్లలో ఒకరి బంధువులు పోయారు. మరొకరికి సెలవు దొరకలేదు. దాంతో విరమించుకున్నారు. మన దగ్గర అప్పుడు రూపాయిలు లేవు (నవ్వుతూ). వీళ్లతో వెళ్తే ఖర్చులు కలిసొస్తాయనుకుంటే వీళ్లిద్దరూ డ్రాప్. అప్పుడు ఏం చేద్దాం అనుకొని సర్లే.. అయ్యప్ప దగ్గరకి ఏం వెళ్తాం. అయ్యప్ప అబ్బ దగ్గరకు వెళ్దాం అని శ్రీశైలం వెళ్లాను మాల విరమణకి. అక్కడ మూడు రోజులు ఉన్నాను. అప్పుడు నాలోకి శివుడు ప్రవేశించాడు. ఆ తర్వాత ఏడాదికి దాదాపు రెండుసార్లు శివమాల వేసుకుంటున్నాను. ఏదైనా కొత్తగా రాద్దాం అనుకున్నప్పుడు మాల వేసుకుంటాను. శివమాల దాదాపు 25 సార్లు వేసి ఉంటాను. ఈసారి న్యూజిల్యాండ్ తెలుగు మహాసభలకు వెళ్లాను. అక్కడే మాల విరమణ చేశాను. ఓంకారం ప్రత్యేకత గురించి చెబుతారా? ఓంకారం ‘అ ఉ మ’ అనే మూడు శబ్దాల సంకలనం. ఓంకారంకి సైంటిఫిక్‌గా చెప్పినది ఏంటంటే గుడి గంట కొట్టినప్పుడు ఆ ఘంటారావానికి కొన్ని కోట్ల క్రిములు, సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. నేల రాలిపోతాయి. సేమ్ ఎఫెక్ట్ ఓంకారానికి కూడా ఉంటుంది. ఓంకారం గనుక కరెక్ట్‌గా నేర్చుకొని చెబితే నీ చుట్టూ ఓ ‘ఆరా’ ఏర్పడుతుంది. వైబ్రేషన్స్ వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది. రసూల్ çపుకుట్టి సౌండ్ ఇంజినీర్‌గా ఆస్కార్ అందుకున్నప్పుడు ‘ప్రపంచానికి ఓంకారం అందించిన దేశం నుంచి వచ్చాను’ అని చెప్పాడు. మంత్రం ఓంకార సహితమైనప్పుడు ఎనరై్జజ్ అవుతుంది. నమశ్శివాయ కన్నా ‘ఓం నమశ్శివాయ’ ఎక్కువ ఎఫెక్ట్. ఓంకారం దీపంలాంటిది. కార్తీక మాసంలో దీపం పెడతాం. అజ్ఞానం అనే చీకటిని దీపం తొలగిస్తుంది. వన భోజనాల గురించి? వనభోజనాలనేది అద్భుతమైన కాన్సెప్ట్. అందరం ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తలో చేయి వేసి వంట చేసుకుంటాం. అయితే వన భోజనం అంటే వనం ఉండాలి. ఇప్పుడు వనం లేదు. బయట క్యాటరింగ్ వాడికి చెప్పేసి భోజనాలు చేయిస్తున్నారు. అందులో ఉండే మూలాలు పోగేట్టేస్తున్నాం. ఇంకా ఘోరమైన విషయమేంటంటే కార్తీక భోజనాలు కులపరంగా విడిపోవడం. వాళ్ల కార్తీక వనభోజనాలు.. వీళ్ల కార్తీక భోజనాలు... అంటూ విడిపోతున్నాం. అది దౌర్భాగ్యం. ఫైనల్లీ.. శివుడితో మీకు ఉన్న మానసిక సంబంధం గురించి? శివుడిని ఏ రూపంలో చూసినా అనుభూతి చెందుతాను. ఒళ్లు పులకరిస్తుంది. ఇలాంటి అనుభూతికి చాలామంది లోనవుతారనుకుంటున్నాను. దేవుడికి ఇంటెలిజెన్స్ కన్నా ఇన్నోసెన్స్ నచ్చుతుంది. నేను దేవుడిని ఫ్రెండ్‌లా ట్రీట్ చేస్తాను. ఫ్రెండ్‌తో ఉన్న అనుబంధం ఇచ్చే అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం. – డి.జి. భవాని మాలధారణ సమయంలో పాటించే నియమాల వల్ల కలిగే మేలు గురించి కొంచెం వివరంగా చెబుతారా? దీక్షలో ఉన్నప్పుడు తెల్లవారు జాము చన్నీటి స్నానం చేస్తాం. సైన్స్ పరంగా కానీ, ఆయుర్వేదం పరంగా కానీ చన్నీటి స్నానం వల్ల చాలా మేలు జరుగుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మ వ్యాధులు రావు. చెంబుడు చల్లని నీళ్లు శరీరం మీద పడగానే లోపల గిర్రున తిరగడం ప్రారంభిస్తుంది. అందుకే ఫస్ట్ చెంబుడు నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ తర్వాత వెచ్చదనం మొదలవుతుంది. ఇలా మనవాళ్లు ఏం పెట్టినా ఆరోగ్యపరమైన కారణం ఉంటుంది. -
వీధి పొరికి
బొంతాలమ్మ గుడికాడ జయరాముడు, జయచంద్రుడు, జయసింహుడితో కలసి దాయాలాట ఆడతా వుండాడు ధనంజయుడు. కార్తీకమాసం కాబట్టి గుడిలో దీపాలు వెలిగిద్దామని వచ్చినారు మునిలక్ష్మి, వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి.‘‘ఒరేయ్, జయరామా! మొన్న మంగళవారం నాడు నా మనవడు నాగసూరి ప్రసాదానికి వస్తే పొంగలి పెట్టకుండానే పంపినావంట కదరా’’ అని ఎగిరెగిరి అడిగింది మునిలక్ష్మి.‘‘ఆరోజు పొంగలి అరచెంబుకే వండినాములే అక్కా, చాలీ చాలకుండా వచ్చిందిగానీ’’ అని గట్టిగా బదులిచ్చినాడు.‘‘వచ్చినోడే వచ్చి పదిసార్లు పొంగలికి చేయి చాపితే ఎక్కడి నుంచి తెచ్చేదిలే అక్కా’’ అని గుసగుసలాడినాడు.‘‘జయచంద్రా, నా ఏడేండ్ల చిన్న బుడ్డోడు మనోహరుడు జంబాడ బస్సెక్కితే టికెటు తీసుకోమన్నావంట కదరా. ఊరోడిగా ఉండి ఊరోళ్లనే టికెట్ అడగతావరా? అని రాగాలు తీస్తూ అడిగింది వెంకటలక్ష్మి.‘‘ఏమి చేసేది పిన్నమ్మా! అయిదేండ్లు దాటితే ఆర్టీసీబస్సులో టికెటు కొట్టమని రూల్ ఉంది కదా’’ అని వయ్యారంగా బదులిచ్చినాడు ఆర్టీసీ కండక్టర్ జయచంద్రుడు.‘‘భలే రూల్స్గానీ...’’ అని విసురుగా అంటూ ఇంటికి బయలుదేరింది వెంకటలక్ష్మి.‘‘జయసింహా! పప్పన్నం ఎప్పుడు పెడ్తావబ్బీ’’ అని ఊరంతా అడిగింది సుబ్బలక్ష్మి.‘‘నయనతార నంబర్ దొరకలేదత్తా. ముహూర్తాలు పెట్టుకొందామంటే’’ అని నంగిగా బదులిచ్చినాడు మూడుపదుల జయసింహుడు.‘‘మీతో మాట్లాడాలంటే మూడుపూటలు తింటే చాలదురా అబ్బా, అయిదారు సార్లన్నా తినాల్సిందే’’ అంటూ గబగబా వెళ్లిపోయింది. కడుపులో ఎలుకలు పరుగెడ్తావుంటే బొంతాలమ్మ గుడి కాడి నుంచి గబగబా తడుకుపేట ఊర్లోకి బయలుదేరినాడు ధనంజయుడు. ఆకలికి పంచె ఎగ్గట్టుకొని పరుగులు తీస్తూ వీరరాఘవన్న ఇంటి వంటగదిలోకి దూరినాడు. అన్ని ఆల్మారాలు వెదికినాడు. అప్పచ్చులు ఏమీ దొరకలేదు. చిన్నతట్టలో నారదబ్బ ఊరగాయ ముక్క కనబడింది. నోటిలో ఊట మొదలయ్యింది. గబుక్కున దానిని నోట్లో వేసుకొని చప్పరిస్తూ పరుగెత్తుతా ఊర్లోకి పోయినాడు. పరుగులు తీస్తూ ‘నెల్లికాయ తెద్దునా, నిమ్మకాయ తెద్దునా’ అని చిటికెలేసి పాడుకుంటూ వెళ్లినాడు.కొంగు విదిలించి ధనంజయుడిని ఉరిమి ఉరిమి చూడసాగింది రాఘవన్న భార్య నరసమ్మ. ‘‘ఎవరిని ఎక్కడ పెట్టాల్నో మీకు తెలవకపాయె. వాడిని ఇంట్లోకి ఎందుకు రానిస్తారు మీరు? వీధి పొరికివాడు. నెత్తిన ఎక్కించుకొంటిరి. వాడిష్టంగా వాడు నేరుగా ఇంట్లోకి వస్తాడు, పోతాడు. అడగకుండానే దూరి దూరి తింటాడు. నచ్చింది చేస్తాడు. నట్టింట్లో తిష్ట వేస్తాడు. అడ్డదొడ్డం తిరగతాడు. ఎట్లా ఏగేదబ్బా వాడితో’’ అంటూ చేతులు తిప్పుతూ భర్తని నిష్టూ మాడింది నరసమ్మ. వినీవిననట్లు ఇంటి ముందరి మునగచెట్టుకి విరగకాచిన మునగకాయలను వరుసగా ఎంచసాగాడు రాఘవన్న.‘‘ధనంజయుడి గురించి మీకు ఎన్ని చెప్పినా ఉలకరు, పలకరు. బండరాయిలాగ గమ్మున ఉంటారు. నాకేమో వాడు మన ఇంట్లో తిరుగులాడుతుంటే ఒళ్లంతా జెర్రులు పాకినట్లు ఉంటాది, నిప్పుల్లో నడిచినట్లు ఉంటాది. మీకు మేనమామకొడుకో, నాకు మేనత్త కొడుకో అన్నట్లుగా వాడిని చూస్తారు. వాడిని ‘దేముడమ్మ దేముడు’ అన్నట్లుగా ఇల్లంతా, ఊరంతా ఊరేగిస్తారు. ఎట్ల చేసేదబ్బా? ఎవరితో చెప్పుకొనేదబ్బా’’ అంటూ పెరట్లో పాత్రలేసుకొని కడుగుతూ గట్టిగట్టిగా ముక్కుచీదసాగింది నరసమ్మ. తిన్నెపైన కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న తెల్లకొంగల్ని లెక్కలేస్తున్నాడు రాఘవన్న. ఊర్లోని ముత్తబావ శవం పాడిపైన ఊరేగుతోంది. తిమ్మాపురం తిమ్మడి బృందం పలకలు కొడుతోంది. కర్రోడు, పొట్టేలు పరంధాముడు, నడింపల్లి నాగన్న, దొంగకోళ్ల దామోదరం, రామగిరి రామన్న శవం ముందు డ్యాన్సులు చేస్తా వుండారు. తిరుచానూరు తిరుపాలు టపాకాయలు పేలస్తా వుండాడు. బాతుల బాలిరెడ్డి బుట్టలోంచి పూలు, బొరుగులు, పైసలు చల్లతా పోతావుండాడు.మిట్ట మధ్యాహ్నం బొంతాలమ్మ గుడికాడ పొట్టి రెక్కల చొక్కా వేసుకొని నిద్ర పోతావుండాడు ధనంజయుడు. వాడి చెవులకి చావు మేళం వినిపించింది. సరసరాలేచి టకటక నడుస్తూ ‘లకలక’ అంటూ పలకల ముందరకి దూకినాడు. ఒంటికాలిపై నిలబడి భుజాలు ఎగరేస్తూ నోట్లో నాలిక మడిచి కులకతా డ్యాన్సు చేసినాడు. పరుగెత్తతా వచ్చిన గంపలాయన ఈలలు వేస్తూ వయ్యారంగా చేతివేళ్ళు తిప్పుతూ చిందులేసినాడు. రాజబాబు టపాకాయలు పేల్చినాడు.ఇంటి ముందర గుబురుగా ఉన్న తెల్ల ఉమ్మెత్త పూలు అటూ ఇటూ ఊగుతుంటే వాటిని లెక్కేస్తూ నిల బడివున్నాడు రాఘవన్న. ధనంజయుడి డ్యాన్సు చూడలేక నరసమ్మ ఇంటి తలుపులేసుకొని పెరట్లో చిక్కుడు పందిరి దగ్గరికి పోయి నిలబడింది. తిరుత్తణి కొండని చూస్తూ ‘ము రుగా! కొడుకు కుమారస్వామి అమెరికాలో రేయనక పగలనకా కష్టం చేసి పైసలు పంపిస్తా వుండాడు. నా మొగుడేమో వీధి పొరికి ధనంజయుడిని ఏనుగును మేపినట్లు మేపతా ఉండాడు. వాడు అడిగింది కాదనడు. అడిగినప్పుడల్లా డబ్బులిస్తాడు. వాడు మూడు పూటలా మా ఇంటికాడనే పడి మెక్కతాడు. పనీ లేదు పాటా లేదు వాడికి. ముందూ వెనకా ఎవరూ లేరు వాడికి. ఎక్కడి వాడో.... ఎవడువాడో నా బిడ్డ సొత్తంతా తిని పోతావుండాడే. ఊరకనే సాకతావుండాడు వాడిని మా ఇంటాయన. నా మొగుడి బుద్ధి మార్చరాదా. నీకు నెలనెలా ప్రతి కృత్తికకీ పిండి దీపం వెలిగించి దండం పెట్టుకుంటా మురగా’’ అని చేతులెత్తి వేడుకొంది. రాఘవన్న, ధనంజయుడు నాలుగేసి సజ్జెరొట్టెల్ని ఎర్రగడ్డ కారం వేసుకొని తృప్తిగా తినినారు. పౌర్ణమి వెన్నెలకి ఇంటి ముందర నారమంచం వేసి కూర్చొన్నారు. చల్లగా చింత చెట్ల గాలి వీస్తోంది. కొండపైన తిరుత్తణి గుడిదీపాలు మిలమిలా మెరుస్తున్నాయి.ఎదురింటి వెంకటస్వామికి తెల్లారికి మార్కెట్లోకి తోపుడు బండి సిద్ధం చేస్తా ఉండాడు. వెంకటస్వామి భార్య వెంకటలక్ష్మి నైటీ వేసుకొని దానిపైన తువ్వాలు వేసుకొని నాలుగేసి మునక్కాయలు జతచేసి అరటినార చుట్టి బండిలో పెడతావుంది.ఈతగింజలు తింటూ ధనంజయుడు ‘‘కొండ ఎక్కినోడు కొండ దిగడా, శెనక్కాయలు తిన్నోడు సేయి కడగడా, ఏటికి పోయినోడు కాళ్లు కడగడా, పుట్టినోడు చావడా’’ అన్నాడు. ముసిముసిగా నవ్వినాడు రాఘవన్న. పడిపడీ నవ్వినారు వెంకటస్వామి, వెంకటలక్ష్మి.మాణిక్యం తాగి ఊగతా వీధిలోని వేపచెట్టు కింద ధబీమని పడినాడు.‘‘ఏం మావా, పడినావా’’ అని అడిగినాడు ధనంజయుడు.‘‘లేదురా ధనంజయా, తమాషాగా ఉంటుందని పల్టీ కొట్టినానురా’’ అని లేచి ఒళ్లు దులుపుకొని ఊర్లోకి పోయినాడు. ధనంజయుడు నవ్వుతూ ‘‘చూడు రాఘవన్నా! మాణిక్యంగాడు పడినా పల్టీ అంటూ లేచిపోతా వుండాడు’’ అనినాడు. వీధికుక్కలు రెండు మొరుగుతూ మంచినీళ్ల గుంటవైపు పరుగులెత్తినాయి. తలతిప్పి చూసినాడు రాఘవన్న. ‘‘మన ఊరి కుక్కలు దొంగల్ని చూసి మొరిగేది మరచినాయిలే రాఘవన్నా. అట్ల తిరిగి, ఇట్ల తిరిగి మన వాళ్లని, మన ఊరి వాళ్లనే చూసి మొరుగుతున్నాయి. ఇవి దొంగల్ని పట్టిందీ లేదూ, దొంగలు దొరికిందీ లేదూ’’ అని రాగాలు తీస్తూ చెప్పినాడు ధనంజయుడు. ఫస్ట్ షో తెలుగు సినిమాకి సైకిల్లో పోయివస్తావున్న మొగుడూపెళ్లాలు బోడెన్న బోడెక్కలు ధనంజయుడి మాటలకి నవ్వుకుంటూ వెళ్లినారు.‘‘రాఘవన్నా! సెప్పేది మరచినా. మొన్న చచ్చిన ముత్తబావ కొడుకు మునికిష్టడు నాయిన పోయినాడని దొర్లిదొర్లి ఏడ్చినాడన్నా, పోయినోడితోనే పోతాడన్నంతగా పొర్లి పొర్లి ఏడ్చినాడు.సచ్చినోళ్లతోనే పోతామా! సింగినాదం కాకపోతే, ఏడ్చి ఏడ్చి నువ్వు చస్తే నీ బిడ్డలెట్ల బతకతార్రా’’ అని అందరూ సర్ది చెప్పినారన్నా. గుంతలో శవాన్ని వేస్తావుంటే ముత్తబావా చొక్కాజేబులో రెండు రెండువేల నోట్లు వున్నాయన్నా. ఆ నోట్లు శవంతోటే పూడ్చేద్దామంటే వినలేదన్నా మునికిష్టడు. రచ్చరచ్చ చేసినాడు. పోనీ దాన్ని గుంత తవ్వినోడికి ఇనాం ఇద్దామని ఊరిపెద్ద పెరుమాల్రాజు చెబితే గలాటా చేసి రెండు నోట్లూ పెరికి పెట్టుకున్నాడన్నా...అట్లా ఆడిస్తదన్నా జిత్తుల మారి బుద్ధి’’ అని చెప్పినాడు ధనంజయుడు. కావడి పూజ చేసుకొని, కాశెమ్మ కొడుకు కోడలు గుడికి పోయి గుండు గీయించుకొని ఇంటికెళ్తున్నారు. ధనంజయుడి మాటలు విని వాళ్లు ముసిముసిగా నవ్వుకొంటూ పోయినారు.ఇంతలో నరసమ్మ తాగేదానికి చెంబునిండా మజ్జిగ తెచ్చి ఇచ్చింది రాఘవన్నకి. ‘ధనంజయుడికి మజ్జిగ లేదా’ అన్నట్లుగా పెళ్లాం వైపు చూసినాడు. ‘‘సట్టెడు తిన్నాడు, చాల్లే. ఇంట్లో చలివేంద్రం పెట్టలేదు. దారిన పోయే వాళ్లకంతా మజ్జిగ దానం చేయడానికి’’ అన్నట్లుగా ముఖం పెట్టింది నరసమ్మ. మజ్జిగ తాగి మీసాలు తుడుచుకొని చెంబు నరసమ్మ చేతికిస్తూ ఆమె చేతి బంగారు గాజుల్ని చూసినాడు. కొడుకు ఇంజనీరింగ్ చదువులకి గ్రామీణబ్యాంకులో రెండు మూడు సార్లు వాటిని కుదవపెట్టిన విషయం గుర్తొచ్చింది.‘‘ఎంత కష్టపడి చదివించినాం బిడ్డని’ అనుకున్నాడు మనసులో.‘‘వాడు అమెరికా వెళ్లి డాలర్ల వర్షం కురిపించినాక అప్పులన్నీ తీర్చేసుకున్నాములే’’ అని తనలో తాను అనుకున్నాడు.‘అర్ధరాత్రిళ్ల దాకా చదివి ఆకాశంలో ఎగిరి అమెరికా వెళ్లినాడు. మంచికీ చెడ్డకీ ఎట్ల రాబోతాడబ్బా మన ఊరికి’ అంటూ ఆలోచనలో పడ్డాడు. కంట్లో తడి ఎవరికంటా పడకుండా పై గుడ్డతో తుడుచుకున్నాడు.రాఘవన్న, ధనంజయుడు ఊర్లో కథలన్నీ మాట్లాడి మాట్లాడి అలిసిపోయినారు. ఆకాశంలో నక్షత్రాలను లెక్కిస్తూ ఇద్దరూ మంచంపైన గురకలు పెడ్తూ నిద్రపోయినారు.ఆడినెల–ఆదివారం నాడు సన్నసన్నగా చినుకులు రాలుతూ ఉన్నాయి. కోమటోళ్ల బావికాడ వరికయ్యిలో కలుపు తీస్తా వుంది నరసమ్మ. నరసమ్మకి తోడుగా కయ్యిలో అయిదారు కొంగలు వంగి పురుగూపుట్రా తింటున్నాయి. నాటుకోళ్లు నాలుగు నరసమ్మ చుట్టూ తిరిగి తిరిగి కానగచెట్టు కింద చేరినాయి.పరుగులు తీస్తా పేరూరు పద్మ అరస్తా వచ్చి చెప్పింది–‘‘నరసక్కా! నరసక్కా! మన రాఘవన్న బ్రహ్మంగారి మఠంకాడ నిలబడినోడు నిలబడినట్లే గుండె పట్టుకొని పక్కకి వాలిపోయినాడంట. మన ఊరి ఆయుర్వేదం డాక్టరు ఆర్ముగం నాడిపట్టి చూసి పెదాలు విరిచేసినాడంట. ఊరు ఊరంతా మఠం కాడ వుండారక్కా’’విషయం విన్న నరసక్క సెకను నిలబడలా. కత్తి, కొడవలి, పార వరికయ్యిలోనే పారేసి గట్టిగా గుండెలు బాదుకొంటూ గెనాలమ్మిట మఠంకాడికి పరుగులు తీసింది. బావికాడి పచ్చగడ్డి తింటున్న రెండు ఆవులు తలలెత్తి నరసమ్మ వైపు చూసినాయి. నరసమ్మ ఊర్లోకి పోయేంతవరకు ఆ దిక్కే చూసినాయి. బావి కట్టపైన ఉన్న బొప్పాయి చెట్టుకున్న కాయలు యజమాని లేడని తెలిసి బాధపడ్తున్నట్లుగా పాలు కార్చినాయి. శవం చుట్టూ జనాలు గుంపులు గుంపులుగా చేరినారు. ఐ.ఐ.టి, ఖరగ్‌పూర్‌లో చదువుతున్న మేకల గంగయ్య వీడియో కాన్ఫరెన్స్ పెట్టినాడు. నాయన శవాన్ని చూసి భోరుభోరున ఏడుస్తున్నాడు కాలిఫోర్నియాలోని కొడుకు కుమారస్వామి. గ్రామపెద్దలు జడామణి, రోడ్డు మేస్త్రీ, తపాలాయన, బ్యాంకు బాలరాజు, మాడా మునస్వామి విషయాన్ని కుమారస్వామికి వివరించినారు. అమ్మ నరసమ్మకి ధైర్యం మాటలు చెప్పినాడు కుమారస్వామి. తను రావడానికి కుదరడం లేదని భోరుభోరునా ఏడుస్తూ చెప్పినాడు.మరి ‘తలకొరివి ఎవరు పెడ్తారు?’ అని అడిగినాడు సర్పంచ్ సుబ్బరామన్న. తల కొట్టుకుంటూ కూర్చొంది నరసమ్మ. పక్కనున్న ఆడాళ్లంతా ఒకర్నొకరు పట్టుకొని ఏడస్తావుండారు. భారతంమిట్ట, పేటమిట్ట, మేదరమిట్ట, గులకరాళ్లమిట్ట, కొత్తపల్లిమిట్ట బంధువులంతా ‘ఒక్కగానొక్క కొడుకుని అమెరికాకు పంపినారు కదబ్బా’ అని గుసగుసలాడినారు. వెంకటాపురం, వేదాంతపురం, ఈశ్వరాపురం, రామాపురం, వేమాపురం దాయాదులంతా ‘దూరాబారాలెల్లిపోయి, పిలకాయలు చివరి చూపులకి కూడా రాలేకపోతావుండారు కదబ్బా’’ అని చెవులు కొరుక్కున్నారు.ఇంతలో ఎక్కడి నుంచో ‘లక్ లక్’మంటూ ఎగురుతూ చేతుల్తోనే తిక్కమేళం వేసుకొంటూ వచ్చినాడు ధనంజయుడు. మెడ మీది తువ్వాలు ఆకాశంలోకి విసురుతా ‘రాఘవన్నకి తలకొరివి నేను పెడ్తాను’ అని అరిచి చెప్పినాడు. అందరూ వాడివైపు తల తిప్పి చూసినారు.‘‘రాఘవన్న బతికి వున్నప్పుడే నాకు చెప్పినాడు. కొడుకు కుమారస్వామి అమెరికా నుంచి రాలేకపోతే నాకు కొరివి నువ్వే పెట్టాలిరా ధనంజయా...అని ఒక్కసారి కాదు...వందసార్లు చెప్పినాడు పెద్దాయన’’ఊరి కుర్రకారు గంతులేస్తూ ధనంజయుడి వైపు చేతులు విసిరినారు. జయరాముడు, జయచంద్రుడు, జయసింహుడు కులాసాగా చేతి గుడ్డలు ఊపినారు. రాములోరి గుడి అయ్యోరు ధనంజయుడిని గుండెలకి హత్తుకున్నాడు. పోస్ట్‌మాస్టర్ చీటీల చెంగల్రాజు ధనంజయుడి మెడలో ముద్దబంతుల మాల వేసినాడు. చేయి చేయి కలిపినాడు. అక్కడ ఉన్న ఆడోళ్లంతా ధనంజయుడు చేస్తున్న మంచిపనికి ముక్కు మీద వేలేసుకొని సంతోషపడినారు. తూకివాకం తిరుపాలు బృందం పలకలు కొడతా వచ్చింది. బీడీల బీకిరాజు, గూని గురవరాజు, సంగటికూడు శివయ్య, ఆవిరికుడుము ఆనందుడు, లొడిగనోరు లోకనాధంలు డాన్సులు చేస్తా వచ్చినారు. కాటమరెడ్డి నడిపి కొడుకు టపాకాయలు పేలస్తా వుండాడు. బాణపొట్ట బాలరాజు బుట్టలోంచి పూలు, బొరుగులు, పైసలు చల్లతా వుండాడు. పరుగెత్తతా వచ్చిన కొర్రలోడు రెండు చేతులూ నడుముపైన పెట్టుకొని నోటితోనే ఈలలు వేస్తా వుండాడు.ఉడకబెట్టిన అన్నం మట్టికుండలో పెట్టుకొని, తెల్లతడి పంచె కట్టుకొని శవం ముందర నడుస్తున్నాడు ధనంజయుడు. వాడిని కన్నులార్పకుండా చూస్తోంది నరసమ్మ. మొగుడి ముందస్తు ఒప్పందం తెలియక ‘వీధి పొరికి’ అనుకున్న ధనంజయుడిలో తన కొడుకు కుమారస్వామి కనిపించాడు. ఆమెకు తెలియకనే ఆమె కళ్లు మరిన్ని కన్నీళ్లు కార్చాయి. ధనంజయుడికి చేతులెత్తి నమస్కరించింది. ఊరిలోని ఉమ్మెత్తపూలు ధనంజయుడిని చూసి పలకరింపుగా అటూ ఇటూ ఊగుతూ పలకరించినాయి. తిరుత్తణిలో కొండపైని గుడి గుంటలు గణగణ మోగినాయి. ఆర్.సి.కృష్ణస్వామిరాజు -
మూడు ముళ్లకు మూడే ముహుర్తాలు!
సాక్షి, హైదరాబాద్ : మూడు ముళ్ల బంధానికి ఇక మూడే ముహూర్తాలున్నాయి. మూఢం ముంచుకొస్తుండటంతో వివాహాలు చేయించాలనుకునే పెళ్లివారు తొందరపడుతున్నారు. ఏటా కార్తీక మాసంలో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఈ నెల 9వరకూ గురు మౌఢ్యమి (మూఢం) వివాహాలకు అడ్డుపడింది. మళ్లీ 28 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఈ మౌఢ్యమి వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు ఉండటంతో వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. దీంతో ఈ నెల 23,24,25 తేదీల్లో మూడు ముహూర్తాల్లో పెళ్లిళ్లు భారీగా జరుగనున్నాయి. దీంతో పురోహితులకు, ట్రావెల్స్, పూల మండపాలకు, వివాహ సామాగ్రికి భారీ డిమాండ్ ఏర్పడింది. -
నేటి నుంచి శివదీక్ష విరమణ
శిబిరాల వద్దకు ఉత్సవమూర్తులు శ్రీశైలం : కార్తీకమాసం సందర్భంగా శివదీక్ష స్వీకరించిన భక్తులు గురువారం నుంచి దీక్ష విరమణ చేయాల్సి ఉంటుందని ఈఓ నారాయణభరత్ గుప్త బుధవారం తెలిపారు. గురువారం నుంచి 11 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే దీక్ష విరమణకు పాతాళగంగ వద్ద ఉన్న శివదీక్ష శిబిరాల వద్ద మంచినీటి వసతి, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేలా దేవస్థానం అధికారులకు, పర్యవేక్షకులకు, సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించామన్నారు. అలాగే భక్తులు జ్యోతిర్ముడిని కలిగినప్పుడు మాత్రమే స్వామివార్ల çదర్శనాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. శివదీక్ష విరమణను దృష్టిలో పెట్టుకుని భక్తులందరికీ స్వామివార్ల లడ్డూ ప్రసాదాలు అందజేస్తామన్నారు. శివదీక్షా శిబిరాలకు తరలనున్న ఉత్సవమూర్తులు: కార్తీకమాసం సందర్భంగా మండలదీక్ష, అర్ధమండల దీక్ష తీసుకున్న భక్తులు ఇరుముడులను సమర్పించడానికి అధిక సంఖ్యలో శ్రీశైలం వస్తారని, ఇందుకోసం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను శిబిరాల వద్దకు తరలిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని దక్షిణద్వారం వద్ద ఉదయం 8గంటలకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆవహింపజేసి అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పురవీధుల గుండా గ్రామోత్సవంగా శివదీక్ష శిబిరాల వద్దకు తీసుకెళ్తారని చెప్పారు. దీక్ష విరమణ చేసే భక్తులు జ్యోతిర్ముడిలోని ఆవునెయ్యి, కొబ్బరికాయలు, తదితర ద్రవ్యాలను హోమగుండంలో సమర్పిస్తారని అన్నారు. -
ముగిసిన శివచతుస్సప్తాహ భజనలు
శ్రీశైలం: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులో్లఆధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి ఏర్పాటు చేసిన శివచతుస్సప్తాహ భజనలు బుధవారంతో ముగిశాయి. గత నెల 31న కార్తీకమాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని చారిత్రాత్మకమైన వీరశిరోమండపంలో ప్రారంభమైన ఈ శివ సప్తాహభజనలకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తపూజలను నిర్వహించారు. ఈ అఖండ శివభజనలలో ''ఓం నమ శివాయ'' శివపంచాక్షరి భజన 24గంటల పాటు నిర్వహించారు. గురునిమిషాంబా, చెన్నకేశవ, శ్రీ రామాంజనేయస్వామి, సుంకులమ్మ భజనమండళ్లు నెలరోజులపాటు ఈ భజన సంకీర్తనామ పంచాక్షరిలో పాల్గొన్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. శివచతుస్సప్తాహ భజనల ముగింపులో భాగంగా బుధవారం చండీశ్వరుడికి ప్రత్యేకపూజలను నిర్వహించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్ కడప అనిల్‌కుమార్, భక్తబృందం తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో నలుగురు గల్లంతు
-
గోదావరిలో నలుగురు గల్లంతు
మూడు మృతదేహాలు లభ్యం అశ్వారావుపేట: కార్తీక మాసం చివరి సోమవారం గోదావరిలో స్నానాలు చేసేందుకు వెళ్లినవారితోపాటు సరదాగా వెళ్లిన ముగ్గురు, మరొకరు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యారుు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారా వుపేటలోని బీసీ కాలనీకి చెందిన సుమారు 30 మంది ఆటోల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కోరుుదా వద్దకు గోదావరిలో స్నా నాలు చేసేందుకు వెళ్లారు. వీరిలో ఒక యువకుడు నీటిలో మునిగిపోవడంతో అతని చేరుు పట్టుకున్న వారు కూడా మునిగిపోయారు. అక్కడున్న వారు యువకుడి తోపాటు మరికొందరిని కాపాడగా.. నలుగురు గల్లంతయ్యారు. వీరిలో మద్దె కొండ మ్మ(45), షేక్ ఆరిఫా(27), షేక్ మహబూబ్‌బీ(12), హసీనా(11) ఉన్నారు. కాగా వీరిలో ఆరీఫా, మహబూబ్‌బీ, హసీనా మృతదేహాలు లభ్యమయ్యారుు. కొండమ్మ ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుల్లో మహబూబ్‌బీ, హసీనా అక్కాచెల్లెళ్లు. కార్తీక మాసం పూజలకు హిందువులు వెళ్లగా సోమవారం బంద్ కావడంతో ముస్లిం కుటుం బాలకు చెందిన వారు కూడా విహారయాత్రగా గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. ఇంకా దొరకని ముగ్గురి ఆచూకీ.. ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సఖినవీడుకు చెందిన రామాల లక్ష్మణరావు(21), కొండల రమేష్(24), గారపాటి అనిల్(19), మధిర మండలం మడుపల్లికి చెందిన లక్ష్మినారాయణ కృష్ణా జిల్లా నాగాయలంక లైట్‌హౌస్ బీచ్ వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో లక్ష్మినారాయణ మృతదేహం లభ్యం కాగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. -
శ్రీగిరి..భక్తజన ఝరి!
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరో రెండు రోజుల్లో ముగుస్తుండడంతో శనివారం రాత్రి శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ప్రధాన మాడా వీధిలోని గంగాధర మండపం వద్ద వందలాది మంది భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు. ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద కళాకారులు ప్రదర్శించిన.. పార్వతీ కల్యాణం, భక్తకన్నప్ప తదితర నృత్యరూపకాలు అలరించాయి. -
సిరిభోజనం
ఇది కార్తికమాసం. వనభోజన మాసం. ఇంటిల్లపాదీ వనభోజనం చేయాలి. ఆ వనంలో ఉసిరిచెట్టు ఉండాలి. భోజనంలో ఉసిరి వంట ఉండాలి. ఇది సంప్రదాయం. అది ఎందుకంటారా...? ఆగండాగండి... ఉసిరి అంటే... ‘సి’ విటమిన్ రిచ్. ఆరోగ్యం వెరీ మచ్. అందుకే... ఉసిరి ఉన్న భోజనం... సిరిభోజనం. ఆమ్లా షర్బత్ కావలసినవి: ఉసిరికాయలు- 500 గ్రా, చక్కెర- 200 గ్రా, జీలకర్ర పొడి- అర టీ స్పూన్, ఉప్పు - అర టీ స్పూన్, పుదీన ఆకులు - మూడు, ఐస్- పది క్యూబ్‌లు తయారీ: ఉసిరికాయలను కడిగి తగినంత నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత చేత్తో చిదిమి గింజలను తీసి వేయాలి. ఉసిరిక గుజ్జులో చక్కెర, పుదీన ఆకులు, ఒక కప్పు చన్నీరు పోసి, మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అందులో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఐస్‌క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. దీనిని నిల్వ చేసుకోవచ్చు. గది వాతావరణంలో రెండు రోజులు, ఫ్రిజ్‌లో వారం తాజాగా ఉంటుంది. గమనిక: ఎప్పటికప్పుడు తాజాగా కావాలంటే ఉసిరి కాయలను తరిగి, గింజలు తీసి మిక్సీలో గుజ్జు చేయాలి. పలుచటి వస్త్రంలో వేసి రసం తీయాలి. ఆ గుజ్జుకు కొంత నీటిని చేరుస్తూ, మరలా మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. తేనె కలిపి సర్వ్ చేయాలి. ఆమ్లా మురబ్బా కావలసినవి: ఉసిరికాయలు- 100 గ్రా, చక్కెర- 100 గ్రా, నీరు- 125 మి.లీ, కుంకుమ పువ్వు- ఐదు రేకలు, ఏలకుల పొడి- పావు టీ స్పూన్ తయారీ: ఉసిరికాయలను కడిగి, తురమాలి. గింజలు లేకుండా మొత్తం కోరుకోవాలి. ఒక పాత్రలో చక్కెర, నీరు కలిపి కరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ కోరు వేసి, సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికి దగ్గరయ్యే వరకు అడుగు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. మిశ్రమం తీగలాగ సాగిన తర్వాత దించేసి కుంకుమ పువ్వు, ఏలకుల పొడి వేసి కలిపితే మురబ్బా రెడీ. ఇది చల్లారిన తర్వాత తడిలేని గాజు జాడీలోకి తీసుకోవాలి. దీనిని తేమ తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.ఉసిరి మురబ్బాను అలాగే తినవచ్చు. బ్రెడ్, చపాతీల మీద పలుచగా రాసి తినవచ్చు. ఉసిరి పులిహోర కావలసినవి: బియ్యం- ఒక కప్పు, ఉసిరికాయ తురుము- ఒక కప్పు, కొత్తిమీర- రెండు రెమ్మలు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత పోపు కోసం: ఆవాలు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, పచ్చి సెనగపప్పు- ఒక టీ స్పూన్, అల్లం తరుగు- అర టీ స్పూన్, ఎండు మిర్చి- రెండు, పచ్చి మిర్చి- రెండు (తరగాలి), కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె - ఒక టేబుల్ స్పూన్ తయారీ: అన్నం వండి చల్లారబెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేయాలి. అవి వేగిన తర్వాత ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి, రెండు నిమిషాల సేపు సన్న మంట మీద మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.మిశ్రమం చల్లారాక అన్నంలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లాలి. ఉసిరి పప్పు కావలసినవి: కందిపప్పు- ఒక కప్పు, టొమాటో ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, ఉసిరికాయ ముక్కలు- అరకప్పు, మిరప్పొడి- ఒక టీ స్పూన్, పసుపు- చిటికెడు పోపు కోసం: నూనె- రెండు టీ స్పూన్లు, ఆవాలు- అర టీ స్పూన్, సెనగపప్పు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, జీలకర్ర- అర టీ స్పూన్, వెల్లుల్లి రేకలు- మూడు, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు- ఒక టీ స్పూన్ తయారీ: కందిపప్పును కడిగి ప్రెషర్‌కుకర్‌లో వేయాలి. అందులో టొమాటో, ఉల్లిపాయ, ఉసిరిముక్కలు, మిరప్పొడి, పసుపు, ఒకటిన్నర కప్పు నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పప్పులో ఉప్పు వేసి పప్పు గుత్తితో మెదపాలి. ఒక పాత్రలో నూనె వేడి చేసి, ఆవాలు వేయాలి. అవి వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులన్నింటినీ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు పోపులో మెదిపి పక్కన ఉంచిన పప్పు వేసి కలపాలి. గమనిక: మిరప్పొడి బదులు పచ్చి మిర్చి వేసుకోవచ్చు. ఉసిరి ఊరగాయ కావలసినవి: ఉసిరికాయలు- పావు కిలో, ఆవాల పొడి - 50 గ్రా, కారం - 50 గ్రా, పసుపు - ఒక టీ స్పూన్, ఉప్పు - 50 గ్రా, వెల్లుల్లి రేకలు - పది, నూనె - రెండు టేబుల్ స్పూన్లు పోపుదినుసులు ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి తయారీ: ఉసిరికాయలను కడిగి తుడవాలి. బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఉసిరికాయలను వేసి సన్నమంట మీద మెత్తగా మగ్గనివ్వాలి. ఈ ఊరగాయకు ఉసిరి గింజలను తీయాల్సిన అవసరం లేదు. మెత్తగా మగ్గిన కాయలను మరొక పాత్రలోకి తీసి అదే బాణలిలో పోపు దినుసులు వేయించాలి. అందులో ముందుగా వేయించి పక్కన ఉంచిన ఉసిరికాయలను వేసి పైన కారం, పసుపు, ఆవాల పొడి, ఉప్పు , వెల్లుల్లి రేకలు వేయాలి. పైన మిగిలిన నూనె వేసి కలిపి చల్లారని వ్వాలి. తర్వాత తేమలేని గాజు లేదా పింగాణి జాడీలో తీసుకోవాలి. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. తేమ తగలకుండా వాడితే ఆరు నెలలు తాజాగా ఉంటుంది. ఈ ఊరగాయ చేసిన రోజు పైకి నూనె కనిపించదు. రెండు రోజులకు కాయల్లోని నూనె పైకి తేలుతుంది. -
అభివృద్ధి దిశగా శ్రీశైల క్షేత్రం
శ్రీశైలం: రానున్న రోజుల్లో శ్రీశైల మహాక్షేత్రం మరెంతో అభివృద్ధి చెందుతుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగని ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప అన్నారు. కార్తీకమాసం సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడానికి గురువారం రాత్రి ఆయన కుటుంబ సమేతంగా శ్రీశైలం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రధానాలయగోపురం వద్ద ఈఓ నారాయణ భరత్ గుప్త ఆలయ మర్యాదలతో వారికి ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతి దర్శనం చేసుకున్నాక స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషపూజలను నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలను పలుకగా, ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, శ్రీశైలాలయ జ్ఞాపికను అందజేశారు. వారి వెంట జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీ సుప్రజ, సీఐ విజయకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రంలో సకల సౌకర్యాల రూపకల్పన జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఇప్పటికే క్షేత్ర అభివృద్ధిలో భాగంగా ఈఓ నారాయణ భరత్‌గుప్త మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతంగా చేయిస్తున్నారన్నారు. మాస్టర్‌ప్లాన్ పనులన్ని పూర్తయితే శ్రీశైల క్షేత్రం కొత్త శోభను సంతరించుకుంటుందని పేర్కొన్నారు. -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: కార్తీక మాసం నాల్గవ సోమవారం సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే శ్రీశైల క్షేత్రానికి రద్దీ ప్రారంభమైంది. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధనలు వెలిగించుకుని స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం ఉచిత, ప్రత్యేక దర్శన క్యూలలో వేచి ఉన్నారు. రాత్రి సమయానికి సుమారు లక్షకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. కాగా సోమవారం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ నారాయణ భరత్ గుప్త ఆలయవేళల్లో కూడా మార్పులు చేశారు. వీఐపీలకు సమయానుకూలంగా దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. కాగా ఉచిత, ప్రత్యేక, దర్శన క్యూలను నియంత్రిస్తూ అభిషేక సేవాకర్తలకు సమయాన్ని కేటాయిస్తూ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, సంబంధిత అధికార సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. ఉచిత, ప్రత్యేక దర్శన క్యూలో వచ్చిన భక్తులకు మల్లన్న దూర దర్శనాన్ని కల్పించారు. కేవలం సామూహిక, ప్రత్యేక అభిషేకం నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. దీంతో సామూహిక అభిషేకాలు సుమారు 700 పైగా నిర్వహించగా, గర్భాలయంలో జరిగే అభిషేకాలను రద్దీకనుగుణంగా టికెట్లను జారీ చేశారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలోని నాల్గవ సోమవారం కావడంతో నేడు కూడా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. -
వనభోజనాల సందడి
– ఉసిరి చెట్టుకు పూజలు - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు – హాజరైన ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు కర్నూలు(అర్బన్): జిల్లాలో ఆదివారం కార్తీక వనభోజనాల సందడి కనిపించింది. వివిధ కులాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులతో ఆయా ప్రాంతాలు కళకళలాడాయి. పద్మశాలి, కురువ, యాదవ, వాల్మీకి, రజక, బ్రాహ్మణ, కుర్ణి (నేసే) తదితర కులాలకు చెందిన సంఘాలు వన భోజన కార్యక్రమాలను నిర్వహించాయి. ప్రజాప్రతినిధిలతోపాటు కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగాలి: ఎంపీ బుట్టా రేణుక మహిళలు రాజకీయంగా ఎదగాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. నగర శివారులోని వెంగన్నబావి సమీపంలో కుర్ణి (నేసె) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రిటైర్డు తహసీల్దార్ సీబీ అజయ్‌కుమార్, సంఘం జిల్లా అధ్యక్షుడు బి. వాసుదేవయ్య, దైవాచారం, వనభోజన కార్యక్రమ సభ్యులు చెన్నప్ప, మల్లికార్జున, శేఖర్, సి. నాగరాజు, కేపీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ... వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాలు స్థానిక వెంగన్నబావి సమీపంలో జరిగాయి. సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్, కానాల వెంకటేశ్వర్లు, కుభేరస్వామి, శ్రీనివాసులు, చిత్రసేనుడు, బాలసంజన్న, మాజీ జెడ్పీటీసీ వలసల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ... జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు రోడ్డులోని కేవీఆర్ ఫంక్షన్హాల్లో కురువల 14వ కార్తీక వనభోజనాలు జరిగాయి. ముందుగా కనకదాసు చిత్రపటానికి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళా క్రిష్ణమోహన్, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డా.టీ పుల్లన్న, కార్యదర్శి ఎంకే రంగస్వామి, కోశాధికారి కేసీ నాగన్న, మాజీ ఎంపీపీ పెద్ద అమీన్ తదితరులు పాల్గొన్నారు. వీరశైవ లింగాయతీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ... నగర వీరశైవ లింగాయతీ సంక్షేమ సంఘం (గౌళీ) ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా నీలకంఠేశ్వర స్వామికి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యాక్రమాలు, ఆటలపోటీలు నిర్వహించారు. యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ... యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవీ ఫంక్షన్హాల్లో యాదవులు కార్తీక వనభోజన కార్యాక్రమాలను నిర్వహించారు. ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరు తిమ్మయ్య, సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటియాదవ్, నాయకులు శేషఫణి, సింధు నాగేశ్వరరావు, డా.వెంకటరమణ, డా.జీవీ క్రిష్ణమోహన్, డా.శ్రీనివాసులు, డా.నాగేశ్వరయ్య, డా.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో ... రజకుల 5వ కార్తీక వనభోజన కార్యక్రమాలు వెంగన్నబావి సమీపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ రజక సంఘం లీగల్ సెల్ అధ్యక్షుడు కంభంపాటి కోటేశ్వరరావు మాజరయ్యారు. ఈ సందర్భంగా 10, ఇంటర్లో మంచి మార్కులు సాధించిన రజక విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు సీపీ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమయ్య, నాయకులు శంకర్, రాజు, గణేష్, నరసింహులు, బీసన్న తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ... పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో లయన్ కొంకతి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆదర్శ కళాశాల మైదానంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరత్ హాజరయ్యారు. సంఘం కార్యదర్శి విజయకాంత్, వెంకటసుబ్బయ్య, దవరథరామయ్య, ప్రముఖ నేత్ర వైద్యులు డా.చెన్నా ఆంజనేయులు, కస్తూరి ప్రసాద్, భావనారాయణ, కాంచానం బాలాజీ, మహిళా విభాగం అధ్యక్షురాలు యు భారతీ తదితరులు పాల్గొన్నారు. -
కార్తీక శోభ
-
కార్తీక శోభ
నగరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్రమైన కార్తీకమాసం, శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, పౌర్ణమి కలిసిరావడంతో శైవాలయాల్లో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని సారుుబాబా ఆలయంలో లక్షదీపోత్సవం దేదీప్యమానంగా సాగింది. పలుచోట్ల సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. - సాక్షినెట్‌వర్క్ -
శ్రీశైలంలో స్వర్ణహంపి ఆశ్రమ పీఠాధిపతి
శ్రీశైలం: కార్తీకమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శనార్థం పంçపాక్షేత్ర స్వర్ణహంపి ఆశ్రమ పీఠాధిపతి గోవింద సరస్వతి స్వామి సోమవారం శ్రీశైలం చేరుకున్నారు. ప్రధానాలయగోపురం వద్ద ఈఓ నారాయణ భరత్‌గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డి స్వామిజీకి ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామీజీ శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదగోష్టి నిర్వహించగా, ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను బహూకరించారు. స్వామీజీ వెంట ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ తదితరులున్నారు. -
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం కార్తీకమాసం రెండో సోమవారం భక్తులతో పోటెత్తింది. సోమవారం ఉదయానికి లక్షకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ భరత్ గుప్త ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. రెండో కార్తీక సోమవారం.. సప్తమి, శ్రవణా నక్షత్రం కలిసి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుందని వేదపండితులు తెలిపారు. ఇలాంటి పర్వదినాన్ని కోటి సోమవారం అని అంటారని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో అభిషేకాలు కార్తీకమాసం సోమవారాన మల్లన్న రికార్డు స్థాయిలో 2,250 అభిషేకాలను నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేకువజాము నుంచే భక్తులు పవ్రితపాతాళగంగలో కార్తీక స్నానాలచరించుకుని నేరుగా స్వామిఅమ్మవార్ల దర్శనార్థమైన క్యూలలోకి చేరుకున్నారు. దీంతో అన్నిక్యూలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. కార్తీకమాసంలో రెండవ సోమవారం సప్తమి,శ్రవణా నక్షత్రం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలవైపు మొగ్గు చూపారు.దీంతో 1328కిపైగా సామూహిక అభిషేకాలు, 785 సింగిల్ అభిషేకాలు, గర్భాలయంలో జరిగే రూ. 5వేల అభిషేకం టికెట్లు 137, మొత్తం 2,250 అభిషేకాల టికెట్లను విక్రయించగా, 351 కుంకుమార్చన టికెట్లను విక్రయించినట్లు అధికారులు తెలిపారు. -
శ్రీశైలంలో లక్ష దీపార్చన
-
ఆధ్యాత్మిక పరవళ్లు
-
శ్రీశైలం..భక్తజనసంద్రం
శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలం కార్తీకమాసం ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. సుమారు 80వేలకు పైగా భక్తులు శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధనలను వెలిగించారు. అనంతరం మల్లన్న దర్శనం కోసం క్యూ కట్టారు. ఉచిత, ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలన్ని నిండిపోవడంతో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులకు దేవస్థానం వారు మంచినీరు, పులిహోర ప్రసాదాలను క్యూలలోనే అందజేశారు. అలాగే శివదీక్షా శిబిరాల వద్ద ఉదయం 8గంటల నుంచి అల్పాహారం 9గంటల నుంచి కార్తీకవనభోజనాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి ప్రత్యేక కళావేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రవల్లిక బృందం నృత్యప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కార్తీక రెండో సోమవారం 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఈఓ భరత్ గుప్త ఏర్పాట్లు చేశారు. -
టమాట దీపం
టమాట దీపం ఏమిటనుకుంటున్నారా.. అయితే తిమ్మనాయినపేటకు వెళ్లాల్సిందే. గ్రామానికి చెందిన రమేష్ శెట్టి బుధవారం టమాట గంప కొనుగోలు చేశాడు. ఇంటికి చేరుకున్నాక వేరు చేస్తుండగా దీపం ఆకారంలో టమాట పండు ఒకటి కనిపించింది. దానిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కార్తీక మాసంలో ఈ తరహా టమాట లభించడం అదృష్టంగా రమేష్ శెట్టి భావిస్తున్నారు. - కొలిమిగుండ్ల -
‘కార్తీక’ శోభ
పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా‘అనంత’ లోగిళ్లు ‘కార్తీక’ దీపకాంతులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. మహిళల దీపోత్సవంతో ఆలయాల్లో సందడి కన్పించింది. వేకువజామునే పుణ్యస్నానాలతో కార్తీకానికి ఆహ్వానం పలికిన మహిళలు..అనంతరం ఆదికేశవునికి అభిషేకాలు, పూజలతో భక్తిప్రపత్తులను చాటుకున్నారు. - అనంతపురం -
వెలిగిన ఆకాశదీపం
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో సాయం సంధ్యవేళ ఆకాశదీపాన్ని శాస్త్రోక్తరీతిలో ఈఓ భరత్ గుప్త దంపతులు, అర్చకులు వెలిగించారు. ఆవునేతిలో ముంచిన ఒత్తిని ప్రమిదలో వెలిగించి ఇత్తడితో చేసిన భరణిలో ఉంచి సుమారు 30 అడుగుల ఎత్తున ఈ ఆకాశదీపాన్ని ఏర్పాటు చేశారు. కార్తీకమాసం ముగిసేంతవరకు ప్రతిరోజూ సాయంకాలం సంధ్యాసమయంలో ఈ ఆకాశదీపాన్ని వెలిగించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. అలాగే ఆకాశదీపాన్ని దర్శించడం వల్ల సర్వపాపాలు హరించబడి సద్గతి లభిస్తుందని, ఆయురారోగ్యాలు చేకూరుతాయని, అకాల మరణం సైతం ఆకాశదీప దర్శనంతో దరిచేరదని వారు పేర్కొన్నారు. అనివార్యకారణాలతో ఆలయ ప్రవేశం చేయలేని వారు దూరం నుంచే ఈ ఆకాశదీపాన్ని దర్శించుకోవచ్చుననే సామాజిక అంశం కూడా ఇందులో ఇమిడి ఉందన్నారు. -
శ్రీశైలంలో కార్తీక మాస భక్తులకు విస్తృత సౌకర్యాలు
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవ క్షేత్రంలో శ్రీశైలంలో ఈ నెల 31 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మల్లన్న భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈఓ భరత్ గుప్త శనివారం తెలిపారు. దేవస్థానం పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు జేఈఓ హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ అభిషేక సేవాకర్తలను దృష్టిలో ఉంచుకుని సామూహిక అభిషేకాలను ప్రతిరోజూ 1500 టికెట్లను విక్రయించాలని నిర్ణయించామన్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్, క్యూలలో వేచి ఉండే భక్తుల కోసం ఉచితంగా పాలు, మజ్జిగ, మంచినీరు, పులిహోర ప్రసాదాలను మొదలైన వాటిని అందజేస్తామన్నారు. కార్తీక మాసంలో వనభోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం శివదీక్షా శిబిరాల వద్ద ఉదయం ఫలహారంతో వనభోజనాలను కూడా భక్తులకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.5వేల గర్భాలయ అభిషేకం టికెట్లపై నియంత్రణ ఉంటుందని, రద్దీకి అనుగుణంగా ఈ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. -
కార్తీకం... భక్తికి ముక్తికి ఆవాసం.
నిర్మలమైన నీలాకాశం... అటు ఎండా, ఇటు చలీ రెండూ అంత ఎక్కువగా బాధించని ఆహ్లాదకరమైన వాతావరణం... రకరకాల సువాసనాపుష్పాలతో నిండిన పూలమొక్కలు ... చెవికి ఇంపుగా వినపడుతుంటే కేశవనామాలు, శివపంచాక్షరీ స్తుతులు... మనసును ఆనంద డోలికలలో ముంచెత్తే పూజలు, కనువిందుగా, మనసుకు నిండుగా కనిపించే దీపాలు... నాసికాపుటాలకు సోకే సుగంధపరిమళాలు... గుండెలలో నిండిన ఆధ్యాత్మికతతో, భక్తితో అరమోడ్చిన కన్నులతో కనిపించే భక్తులు... ఈ వాతావరణం కనపడిందీ అంటే అది కచ్చితంగా కార్తికమాసమే! పౌర్ణమినాడు కృత్తికానక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తికమాసమని పేరు. అటు హరికీ, ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకీ కూడా ప్రీతిపాత్రమైన మాసమిది. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే తలనిండా స్నానం చేయాలి. అలా స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి. రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా ఒక్క సోమవారంనాడయినా సరే నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే పుణ్యప్రదం. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. హరిహరస్వరూపం కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... కాదు... ఈ మాసంలో ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆ ఇరుపక్షాల వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే. కొందరు శివకేశవులకు భేదాలు కల్పించి, స్పర్థలు సృష్టిస్తారు. ఈశ్వరుని అర్ధనారీశ్వరత్వం శివకేశవులకు భేదం లేదని చెబుతుంది. ఇవి చేస్తే మంచిది ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేనివారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్నభోజనం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్లు తీసుకోవచ్చు. రోగులు, అశక్తులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో వీలుపడని వారు కనీసం సాధ్యమైనవాటినయినా సంపూర్తిగా ఆచరించి విష్ణ్వాలయానికి వెళ్లి దీపాలు వెలిగించి పండితులకు లేదా పేదలకు యథాశక్తి దానాలు చేసి భక్తి పూర్వకంగా నమస్కరించి, వారి ఆశీస్సులందుకోవాలి. క్షీరాబ్ధి కన్నియకు...శ్రీ మహావిష్ణువుకు... కార్తీక శుద్ధ ఏకాదశికే ఉత్థాన ఏకాదశి అని, దేవోత్థాన ఏకాదశి అనీ, ప్రబోధిని ఏకాదశి అనీ పేరు. మరుసటి రోజున అంటే ద్వాదశినాడు తులసీపూజ, శ్రీ మహావిష్ణువుతో తులసీ కళ్యాణం నిర్వహిస్తారు. దీనికే మరో కథ కూడా ఉంది. దేవదానవులు క్షీరసాగర మధనం చేసిన రోజు కనుక క్షీరాబ్ధి ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అనీ పేరొచ్చింది. క్షీరసాగరంపై శయనించి ఉండే శ్రీమహావిష్ణువు ఈ రోజున తన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మితోనూ, బ్రహ్మాది దేవతలతోనూ కలసి బృందావనికి తరలి వస్తాడు కాబట్టి ద్వాదశినాడు భక్తిశ్రద్ధలతో విష్ణుపూజ చేయడం చాలా మంచిది. క్షీరాబ్ధి కన్యక అయిన శ్రీ మహాలక్ష్మిని తన అర్ధాంగిగా చేసుకున్నది ఈ రోజే కనుక ముత్తయిదువులకు పసుపు కుంకుమలిచ్చి దీవెనలు పొందిన వారి సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ రోజున తులసి కోటలో ఉసిరి కొమ్మను నాటి, దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు చేస్తారు. చలిమిడితో చేసిన ప్రమిదల్లో ఆవునేతితో దీపాలు పెడతారు. క్షీరాబ్ది ద్వాదశినాటి సాయంకాలం వేళ తులసి కోట ముందు దీపాలు వెలిగించిన ఇంట కలకాలం ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. క్షీరాబ్ధి ద్వాకార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యాస్తమయం తర్వాత స్నాన, దాన పూజాదులు చేసిన వారికి అధిక ఫలం కలుగుతుంది. పుణ్యప్రదమైన పౌర్ణమి కార్తీకమాసంలో రెండవ పర్వదినం కార్తీక పూర్ణిమ. ఈ మాసమంతా ప్రతిరోజూ స్నానం, ఉపవాసం, ఆలయ సందర్శన చేయడం, ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం శ్రేష్ఠం. దివ్యఫలాల దీపదానం కార్తీకమాసంలో చేసే అన్ని దానాలలోను దీపదానానికి విశిష్ఠత వుంది. వెండి ప్రమిదలో బంగారపు వత్తిని వేసి వేదవిదుడైన విప్రుని పిలిచి ఆవునేతితో దీపం వెలిగించి దానం చేయాలి. మట్టి ప్రమిదలో లేదా బియ్యపుపిండితో చేసిన ప్రమిదలో ఆవునెయ్యి పోసి అయినా దీపదానం చేయొచ్చు. కార్తీకమాసంలో బిల్వపత్రాలతో శివుని పూజించిన వారికి ఇహంలో సుఖసంపదలు, పరంలో శివసాయుజ్యం కలుగుతాయట. మొగలి పూవులతో శ్రీమన్నారాయణుని అర్చిస్తే వేద వేదాంగాలు అభ్యసించగలిగే అర్హత కలుగుతుందట. శివునికి జిల్లేడు పూలు, మారేడు దళాలతోనూ, విష్ణువుకు తులసి, మల్లె, తామర, జాజి, దర్భలతో పూజ చేయడం వల్ల భోగభాగ్యాలతో తులతూగుతారని శాస్త్రోక్తి. తాజాఫలాలను దానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలవుతాయట. అన్నదానం, తిలదానం చేసినవారికి సకల దేవతారాధన చేసిన ఫలితం ప్రాప్తిస్తుందట. కార్తీక బహుళ అమావాస్యనాడు ఎవరెన్ని దీపాలు పెడితే అంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. దొన్నెల్లో దీపాలు.. స్వర్గానికి నిచ్చెనలు కార్తీకమాసంలో అరటి బోదెలు తెచ్చి ఒక్కొక్క పొరను వొలుస్తారు. అలా ఆకుపచ్చ పట్టలు పోయి తెల్లటి పట్టలు వచ్చే వరకూ వొలుస్తారు. వాటిని కత్తిరించి అడుగు పొడవున దొన్నెల్లా చేస్తారు. ఈ దొన్నెలకు ఇరువైపులా మైదాపిండి ముద్ద లేదా చలిమిడితో అంచులను మూసి, పడవలా తయారు చేసి, దీపారాధన చేస్తారు. ఈ అరటి దొన్నెల్లో చిన్న చిన్న ప్రమిదలనుంచి దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజించి ఏరు, కాలువ, చెరువు లేదా బావిలో వదలుతారు. అరటి దొన్నెలు లభ్యం కాకపోతే నిమ్మడిప్పల్లో కూడ దీపాలు పెట్టవచ్చు. పట్నాలలో బావులు, ఏరులలో వదలడం కుదరదు కాబట్టి ఇంటిలోనే వెడల్పాటి పాత్రలో నీరు పోసి, దానిలోనైనా వదలవచ్చు. కార్తీక అమావాస్య నాడు పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేయడం లేదా ఉప్పు పప్పుతో కూడిన సంబారాలనూ దానం చేయడం వల్ల పెద్దలు స్వర్గసుఖాలు పొందుతారని ప్రతీతి. - డి.వి.ఆర్. విశిష్టఫలాల వనసమారాధన సాధారణ దినాలలో గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొనడం పరిపాటి. ఎందుకంటే వనసమారాధనలో ఉసిరి చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్న సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, కార్తీకవనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని కార్తీక పురాణం చెబుతోంది. ఈ మాసంలో ఇవి చేయొద్దు ఉల్లి, వెల్లుల్లి, మద్యపానం, మాంసభక్షణం ఇతరులకు ద్రోహం. పాపపు ఆలోచనలు. దైవదూషణ. పరనింద, అతి భోజనం, అతి నిద్ర, అతి జలపానం, రెండుపూటల భోజనం, క్షౌరం సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత? కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైనఅగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. స్నానం... దానం... ఈ మాసంలో కనీసం ఒక్క రోజైనా నదీస్నానం చేసి, ఆవునేతితో దీపారాధన చేయాలి. నదీస్నానం కుదరకపోతే ప్రాతఃకాలాన లేచి చన్నీటి స్నానం చేయాలి. దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటీ పూజించాలి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమినాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ ఈశ్వరుని పూజించాలి. -
శ్రీశైలం.. ఇల కైలాసం
శ్రీశైలం: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైలాలయం శివరాత్రి శోభను సంతరించుకుంది. దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. భక్తుల రద్దీని ముందుగానే ఊహించిన అధికారులు ఆదివారం రాత్రి మైకుల ద్వారా ప్రాతఃకాలసేవా టికెట్లను నిలుపుదల చేసినట్లు ప్రకటించారు. స్వామివార్ల గర్భాలయంలో నిర్వహించే రుద్రాభిషేకాలు, అమ్మవారి శ్రీచక్రం ఎదుట నిర్వహించే కుంకుమార్చన తదితర ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపేస్తూ ఈఓ సాగర్‌బాబు ప్రకటించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక సోమవారం, అందులోనూ కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో పుణ్య నదీ స్నానం ఆచరించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్షేత్రం పోటెత్తింది. రద్దీ విపరీతంగా పెరగడంతో వసతి సౌకర్యాలు లభించక వందలాది భక్తులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సోమవారం వేకువజామునే పవిత్ర పాతాళగంగలో పుణ్య స్నానాలాచరించుకున్న భక్తులు నేరుగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రత్యేక, అతిశీఘ్ర, ఉచిత దర్శన క్యూలలో నిరీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత అభిషేకాలు లేకపోవడంతో వీఐపీలు సైతం స్వామివార్లను దూరం నుంచే దర్శించుకున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ నుంచి ప్రధాన మాడా వీధిలోని గంగాధర మండపం వరకు రోడ్డుపైనే భక్తులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3.30గంటల వరకు రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సాయంకాల పూజావేళల అనంతరం రాత్రి 6గంటల నుంచి రద్దీ మళ్లీ కొనసాగింది. ఉచిత దర్శనానికి 7గంటలకు పైగా సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి 5గంటలు, అతిశీఘ్ర దర్శనానికి 3గంటల పాటు భక్తులు క్యూలలో వేచి చూడాల్సి వచ్చింది. అయితే ముందస్తుగా చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఆన్లైన్లో టికెట్ పొందిన అభిషేక సేవాకర్తలకు వృద్ధ మల్లికార్జునస్వామివార్ల వద్ద అభిషేకాలను నిర్వహించుకునే సౌలభ్యం కల్పించారు. పవిత్ర పాతాళగంగ పుణ్యనదీ స్నానాలు, స్వామివార్ల దర్శనం, కార్తీకదీపారాధనలు, వ్రతనోములతో చివరి కార్తీక సోమవారాన భక్తులు ఉపవాసదీక్షలను విరమించారు. దర్శనానంతరం మల్లన్న భక్తులకు లడ్డూ ప్రసాదాల కొరత రాకుండా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా క్యూలలో వృద్ధులు, చిన్నారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాలవితరణ చేశారు. -
దిగొచ్చిన కోడి
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నెల రోజుల క్రితం చుక్కలనంటిన చికెన్ ధరలు ప్రస్తుతం సగానికి పడిపోయాయి. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుండగా చికెన్ మాత్రం చీప్‌గా మారింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ 180 ఉండగా ప్రస్తుతం రూ 88కు పడిపోయింది. చికెన్ ప్రియులను తగ్గిన ధరలు ఆనందంలో ముంచినా బ్రాయిలర్ వ్యాపారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన దాణా ఖర్చులకు.. పడిపోతున్న చికెన్ ధరలకు కనీసం పొంతన లేకుండా పోతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో చికెన్ ఉత్పత్తికి దాణాతో పాటు మొత్తం రూ 70 ఖర్చవుతుండగా ప్రస్తుతం కోడిని కిలో 55రూపాయలకే విక్రయిస్తున్నారు. కార్తీకమాసపు పూజల ప్రభావం చికెన్ ధరలపై పడింది. ప్రతి యేటా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చికెన్ ధరలు తగ్గుదల సాధారణమే అయినా ఈసారి మాత్రం భారీగా తగ్గాయి. ఆకాశన్నంటుతున్న కూరగాయలు చికెన్ ధరలు ఓ వైపున తగ్గుతుండగా కూరగాయల ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. దొండకాయల ధర చికెన్‌కు పోటీగా ఉంది. కిలో దొండకాయలు రూ 80కు విక్రయిస్తున్నారు. అలుగడ్డ కిలో రూ 40, బెండకాయలు కిలో రూ 40, బీరకాయలు కిలో రూ 40, పచ్చిమిర్చి కిలో రూ 50, గోకరకాయ కిలో రూ 50కు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. దీంతో హైదరాబాద్, విజయవాడ నుంచి దిగుమతి అయ్యే కూరగాయలకు ధరలు పెరిగాయి. దానికి తోడు కార్తీకమాసంలో కూరగాయల వాడకం ఎక్కువగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిలిచింది. -
బందరు బీచ్ కళావిహీనం
=పర్యాటకులకు కరువైన వసతులు = పై-లీన్ తుపానుకు కొట్టుకుపోయిన బారికేడ్లు = కార్తీక మాసంలోనూ స్పందించని అధికారులు పర్యాటకులను ఆకర్షించే మంగినపూడిబీచ్ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. పర్యాటకశాఖ పట్టించుకోకపోవడంతో బీచ్ కళావిహీనంగా మారింది. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో పుణ్యస్నానాలకు వచ్చేందుకు పర్యాటకులు వెనుకాడుతున్నారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : కార్తీక మాసం ప్రారంభం కావడంతో వనభోజనాలు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు పర్యాటకులు, భక్తుల రాక ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వేల సంఖ్యలో బీచ్‌కు తరలివస్తారు. పౌర్ణమి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తుం టారు. పర్యాటకశాఖ ద్వారా రూ.95 లక్షలతో బీచ్‌ను అభివృద్ధి చేస్తామని ఎప్పటి నుంచో అధికారులు చెప్పడమే తప్ప అమలుకు నోచడంలేదు. రూ.4 లక్షలతో చేపట్టిన దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇటీవల సంభవించిన పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలు, ఇసుక మేటలతో బీచ్ దర్శనమిస్తోంది. తాళ్లపాలెం పంచాయతీకి నిర్వహణ బాధ్యతలను వదిలేసిన పర్యాటకశాఖ మంగినపూడిబీచ్ తమ పరిధిలోది కాదనే విధంగా వ్యవహరిస్తోందని పర్యాటకులు విమర్శిస్తున్నారు. కళకోల్పోయిన బీచ్ ఐదారు సంవత్సరాలుగా పర్యాటకశాఖ పట్టిం చుకోకపోవటంతో బీచ్ కళ కోల్పోయింది. 2007లో నవీన్‌మిట్టల్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో బీచ్‌కు వెళ్లే దారిలో చేపల బొమ్మలు, ప్రాంగణంలో జల కన్యలు, ఒంటెల బొమ్మలను, మత్స్యకారులు సముద్రంలో వేటడాన్ని తెలిపే బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దూరప్రాంతం నుంచి బీచ్‌కు వచ్చిన పర్యాటకులు కూర్చునేందుకు కనీసం సిమెంటు బల్లలు కూలిపోయాయి. పై-లీన్ తుపాను తాకిడికి కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో బీచ్ ప్రాంగణం మొత్తం గోతులమయంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు బీచ్‌ను ప్రైవేటీకరణ చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు పావులు కదపడం వివాదాస్పదమవుతోంది. కొట్టుకుపోయిన బారికేడ్లు పర్యాటకులు సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్నారన్న సాకుతో గత ఏడాది నాలుగు నెలల పాటు బీచ్‌ను మూసివేశారు. కార్తీక పౌర్ణమికి రెండు రోజులు ముందు బీచ్‌లోకి పర్యాటకులను అనుమతించారు. సముద్రం లోతులోకి వెళ్లకుండా అరకిలోమీటరు వ్యాసార్థంలో సముద్రంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ బారి కేడ్లకు తాళ్లు కట్టి రక్షణ చర్యలు చేపట్టారు.అయితే అక్టోబర్‌లో సంభవించిన పై-లీన్ తుపాను కారణంగా కెరటాలు ఎగసిపడటంతో బారికేడ్లు కొట్టుకుపోయాయి. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించి బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. -
పర్వదినాలకు శుభారంభం కార్తిక మాసం
పున్నమి చంద్రుడు కృత్తికానక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ మాసానికి కార్తికమాసం అని పేరు. ఈ మాసంలో చేసే ఆలయ సందర్శనం, అర్చనలు, అభిషేకాలతోపాటు, స్నానదానాదులు కూడా అత్యంత విశిష్ఠమైనవే. అలాగే నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఆచరించదగ్గ విధులు. కార్తికమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్లకాలువలలోనూ నివసిస్తాడట. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావిస్తూ... సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేయాలి. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ రోజున ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మచ్చుకు కొన్ని తిథులు... ఈవారం ఆచరించవలసిన విధుల వివరాలు... కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, ‘నేను చేయదలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించ’మని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. విదియ: ఈ రోజు సోదరి చేతి భోజనం చేసి ఆమెకు యథాశక్తి కానుకలు ఇచ్చిరావాలి. అలా చేసిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుందని ప్రతీతి. కార్తీక శుద్ధ చవితి: దీనికే నాగుల చవితి అని పేరు. ఈ వేళ పగలు ఉపవాసం ఉండి, నియమనిష్ఠలతో సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోసిన వారికి కడుపు పండుతుందని కార్తికపురాణం చెబుతోంది. పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది. రోజూ చేయలేకపోయినా... ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారంనాడయినా సరే నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పినట్లు కార్తిక పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమినాడు పగలు ఉపవసించి, రుద్రాభిషేకం చేయించి శివాలయంలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక కథలు, గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. ఈమాసం... వనసమారాధనలకు ఆవాసం మామూలు రోజులలో గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. వనసమారాధనలో ఉసిరిగ చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్న సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం బోధిస్తోంది. కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతోపాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయంలో, పితృతర్పణ సమయంలో, భ్రష్టులు, ఛండాలురు, సూతకం ఉన్నవాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయని పురాణోక్తి. ఈ రెండు వాదనలూ సరైనవే... కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే. ఈ మాసంలో ఇవి చేయరాదు తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు. ఈ మాసం... ఇవి చేయడం మంచిది ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటుఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేనివారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్నభోజనం చేసి, రాత్రికి పాలు, పళ్లు తీసుకోవచ్చు. ఇలా చేయడం అధిక ఫలదాయకం కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటీ పూజిస్తే సమస్త సౌఖ్యాలు కలగడంతోపాటు జన్మరాహిత్యం కలుగుతుందట. ఆరుద్ర నక్షత్రాన, మాసశివరాత్రినాడు, సోమవారం రోజు, పున్నమినాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతో పూజించిన వారు అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ఇవేవీ పాటించ(లే)కున్నా, సంప్రదాయాన్ని పాటించేవారిని గేలిచేయకుండా, వారికి సాయం చేస్తూ, పరనిందకు దూరంగా ఉంటూ, కలిగినదానిలోనే దానధర్మాలు చేసేవారికి సైతం పుణ్యఫలాలు కలుగుతాయని పెద్దల వాక్కు. - డి.వి.ఆర్. కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులూ వాదిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురి వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే. సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు) పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034 మెయిల్: sakshi.features@gmail.com