శ్రీశైలంలో కార్తీక మాస భక్తులకు విస్తృత సౌకర్యాలు
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవ క్షేత్రంలో శ్రీశైలంలో ఈ నెల 31 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మల్లన్న భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈఓ భరత్ గుప్త శనివారం తెలిపారు. దేవస్థానం పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు జేఈఓ హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ అభిషేక సేవాకర్తలను దృష్టిలో ఉంచుకుని సామూహిక అభిషేకాలను ప్రతిరోజూ 1500 టికెట్లను విక్రయించాలని నిర్ణయించామన్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్, క్యూలలో వేచి ఉండే భక్తుల కోసం ఉచితంగా పాలు, మజ్జిగ, మంచినీరు, పులిహోర ప్రసాదాలను మొదలైన వాటిని అందజేస్తామన్నారు. కార్తీక మాసంలో వనభోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం శివదీక్షా శిబిరాల వద్ద ఉదయం ఫలహారంతో వనభోజనాలను కూడా భక్తులకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.5వేల గర్భాలయ అభిషేకం టికెట్లపై నియంత్రణ ఉంటుందని, రద్దీకి అనుగుణంగా ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.