శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: కార్తీక మాసం నాల్గవ సోమవారం సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే శ్రీశైల క్షేత్రానికి రద్దీ ప్రారంభమైంది. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధనలు వెలిగించుకుని స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం ఉచిత, ప్రత్యేక దర్శన క్యూలలో వేచి ఉన్నారు. రాత్రి సమయానికి సుమారు లక్షకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. కాగా సోమవారం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ నారాయణ భరత్ గుప్త ఆలయవేళల్లో కూడా మార్పులు చేశారు. వీఐపీలకు సమయానుకూలంగా దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. కాగా ఉచిత, ప్రత్యేక, దర్శన క్యూలను నియంత్రిస్తూ అభిషేక సేవాకర్తలకు సమయాన్ని కేటాయిస్తూ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, సంబంధిత అధికార సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. ఉచిత, ప్రత్యేక దర్శన క్యూలో వచ్చిన భక్తులకు మల్లన్న దూర దర్శనాన్ని కల్పించారు. కేవలం సామూహిక, ప్రత్యేక అభిషేకం నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. దీంతో సామూహిక అభిషేకాలు సుమారు 700 పైగా నిర్వహించగా, గర్భాలయంలో జరిగే అభిషేకాలను రద్దీకనుగుణంగా టికెట్లను జారీ చేశారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలోని నాల్గవ సోమవారం కావడంతో నేడు కూడా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.