భక్తులకు భద్రత కల్పించండి
భక్తులకు భద్రత కల్పించండి
Published Wed, Feb 22 2017 11:09 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
జిల్లా ఎస్పీ రవికృష్ణ
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రానికి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు పోలీసు సిబ్బంది అంకిత భావంతో పని చేసి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ రవికృష్ణ సూచించారు. బుధవారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్న ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఆవరణలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, ఆత్మకూరు ఇన్‌చార్జి డీఎస్పీ వినోద్‌కుమార్‌తో కలిసి బందోబస్తుపై వచ్చిన డీఎస్పీలు, సీఐలు,ఎస్‌ఐలు ఇతర పోలీస్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు తమకు కేటాయించిన ప్రదేశాలలో సక్రమంగా విధులు నిర్వహించాలని, ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు చేరవేయాల్సిందిగా సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఎట్టి పరిస్థితులలో వారిపై దురుసుగా ప్రవర్తించకుండా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలని చెప్పారు. అనుమానస్పద వ్యక్తులు, బ్యాగులు, సూట్‌కేసులు మొదలైన వాటిపై క్రైమ్‌పార్టీ, స్పెషల్‌పార్టీ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
మాస్టర్ కంట్రోల్ రూమ్ పరిశీలన:
దేవస్థానం ఈఓ భరత్‌గుప్త అన్నపూర్ణ భవన్ పక్కనే ప్రత్యేకంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మాస్టర్ కంట్రోల్ రూమ్‌ను నిర్మించారు. ఈ మాస్టర్ కంట్రోల్ రూమ్‌ను బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రవికృష్ణ ఈఓ, ఏఆర్ అడిషనల్ ఎస్పీలతో కలిసి పరిశీలించారు. మొత్తం ఎన్ని కెమెరాలను ఏర్పాటు చేసింది అడిగి తెలుసుకున్నారు. ప్రధాన కూడళ్లలో కూడా ఎలాంటి సంఘటనలు జరిగినా స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ తెలిపారు.
Advertisement