sp ravikrishna
-
ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు: కర్నూలును ప్రమాద, ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం ఉదయం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాద దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించి వాటిని తెరపై ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర ఆధ్వర్యంలో ఓ డాక్యుమెంటరీ తయారు చేశారు. అతి వేగంగా వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, సీటుబెల్టు, హెల్మెట్ ధరించాలని యువకులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడం కోసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో సుమారు 600 మంది ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, 2,500 మందికి పైగా క్షతగాత్రులవుతున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నటు వెల్లడించారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ర్యాగింగ్ జరిగితే కళాశాల యాజమాన్యాలదే బాధ్యత అన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యల కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపల్ శౌరిల్‌రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, సీఐలు మహేశ్వరరెడ్డి, కృష్ణయ్య, శేఖర్‌రావు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే ఫ్యాక్షన్ అంతం
- ఎస్పీ ఆకే రవికృష్ణ - తండ్రి జ్ఞాపకార్థం కప్పట్రాళ్ల విద్యార్థులకు నగదు బహుమతులు కర్నూలు: ప్రతి ఒక్కరు చదువుకొని ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని దత్తత గ్రామం కప్పట్రాళ్లకు చెందిన హైస్కూల్ విద్యార్థులకు ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. కప్పట్రాళ్ల హైస్కూలులో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రంగడు (9.3), శివగణేష్ (9.3), వలిబాషా (9.2) విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతిని కుటుంబ సమేతంగా ఎస్పీ అందజేశారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 57 మంది విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులతో ఎస్పీ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో సివిల్స్ పరీక్షలపై విద్యార్థులకు పలు విషయాలు వివరించి అవగాహన కల్పించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే గ్రూప్స్‌కు ప్రిపేర్ కావచ్చన్నారు. ఎలా చదవాలి, ఏ విధంగా సమర్థం కావాలి, ఏయే పుస్తకాలు చూసుకోవాలి, ఎలా రాయాలనే విషయాలను విద్యార్థులకు వివరించారు. తాను కూడా ప్రభుత్వ స్కూలులోనే చదివానన్నారు. కప్పట్రాళ్ల హైస్కూల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న 50 మంది విద్యార్థులకు టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమంలో భాగంగా యోగా, నైతిక విలువలపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అబ్బాయిలకు ఇండస్ స్కూలులో, అమ్మాయిలకు మాంటిస్సొరి స్కూలులో వారం రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బేబిరాణి, ఇంచార్జి మరియానంద, అధ్యాపకుల బృందం ఆసిఫ్ అలీ, ఆంజనేయులు, చక్రవర్తి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, రామాంజలి తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్ట్ పోలీసులకు బోధకులుగా అవకాశం
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: ఆసక్తి ఉన్న రిటైర్డ్ పోలీసులు.. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో తరగతులు బోధించవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. జిల్లాలో ఎనిమిది మంది పోలీసు అధికారులు బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో ‘మన కుటంబం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐలు పి.జాన్ (నందికొట్కూరు), పి.పుల్లయ్య (నంద్యాల ట్రాఫిక్), కె.విశ్వనాథ్ (ఆదోని ట్రాఫిక్), అబ్దుల్‌హక్ (నంద్యాల ట్రాఫిక్), ఏఎస్ఐలు డీఎల్ దస్తగిరి (ఉలిందకొండ పీఎస్), సి.ప్రసాదరావు (డీసీఆర్బీ), కేవీ సుబ్బయ్య (కర్నూలు పీసీఆర్), ఆర్ఎస్ఐ ఎస్ మహమూద్ (ఏఆర్ హెడ్ క్వాటర్స్) తదితరులు పదవీవిరమణ పొందారు. వీరందరినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి సూట్‌కేసులను బహుమతులుగా అందజేశారు. ఎస్పీ రవికృష్ణతో పాటు తల్లి ఆకె రత్నమాల, సతీమణి ఆకె పార్వతితో పాటు తదితరులు కార్యక్రమంలో పాల్గొని పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపి భద్రతా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అత్యంత ఒత్తిడితో పనిచేసి ఉద్యోగి పోలీస్ అన్నారు. సుధీర్ఘ కాలం పోలీసు శాఖలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు.. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ దంపతులు అల్పాహారం వడ్డించారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలీ, డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు ములకన్న, నాగరాజు యాదవ్, డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, ఆదిలక్ష్మీ, ఆర్ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా విచారణ
– చెరుకుల పాడు గ్రామంలో ఎస్పీ పర్యటన – నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ – వెల్దుర్తి ఎస్ఐపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు వెల్దుర్తి రూరల్: చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసును నిష్పక్షపాతంగా విచారిస్తామని ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. ప్రత్యేక విచారణ అధికారిగా డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌ను నియమించామన్నారు. ఆదివారం ఆయన చెరుకులపాడు గ్రామంలో పర్యటించారు. హత్య అనంతరం గ్రామ పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని హతుడు సాంబశివుడు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నారాయణరెడ్డి అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.అలాగే నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి, కుమారుడు మోహన్‌రెడ్డిలను వారి స్వగృహానికెళ్లి పరామర్శించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. హత్యకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ స్కెచ్‌లు వేశారు.. ఫోన్లలో ఎవరి ద్వారా సమాచారమందుకున్నారు.. ఎవరికి సమాచారమందించారు..తదితర అన్ని కోణాల్లో విచారణ జరుపుతామన్నారు. నిందితుల విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టుకు అప్పీలు చేసినట్లు చెప్పారు. హత్యకు సంబంధించి వివరాలు, సమాచారం తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా తన నంబరు 9440795500ను సంప్రదించాలన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హత్యలతో రక్తం చిందించడం మానవ ధర్మం కాదని, ప్రతీ మనిషి తన రక్తాన్ని ఆపదలో ఉన్న ఇతరులకు దానం చేయడానికి వాడాలని సూచించారు. ఎస్ఐపై శాఖా పరమైన చర్యలు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి అలసత్యం ప్రదర్శించిన వెల్దుర్తి ఎస్ఐ తులసీనాగప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎస్ఐపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి విచారణ చేపట్టాలని డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ను ఆదేశించారు. ఇప్పటి వరకు తాను ఐదు మెమోలు ఎస్ఐకు జారీ చేసినట్లు డోన్ డీఎస్పీ.. ఎస్పీకి తెలిపారు. ఫిర్యాదులివీ.. నారాయణరెడ్డి హత్యకు పరోక్ష కారణం ఎస్ఐ తులసీప్రసాదేనని ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తన భర్త హత్యలో కేఈ శ్యాంబాబుతో పాటు ఎస్ఐ పాత్ర ముఖ్యంగా ఉందంటూ కంగాటి శ్రీదేవి ఎస్పీ ఎదుట వాపోయారు. తాను దళిత మహిళా సర్పంచ్, గర్భవతినని తెలిసినా గ్రామంలో పరిస్థితులపై పిర్యాదుకు వెళితే స్టేషన్లోనే అవమానాలకు గురిచేసి, అసభ్యంగా మాట్లాడాడని సర్పంచ్ అపర్ణ, ఆమె భర్త శివ ఫిర్యాదు చేశారు. సివిల్ పంచాయితీలు చేస్తూ పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి, అగస్టీన్, ప్రశాంత్ తదితరులు ఎస్ఐపై ఆరోపణలు గుప్పించారు. -
చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ
-
చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ
నారాయణరెడ్డి హత్య కేసులో 12 మంది అరెస్టు కర్నూలు: చెరుకులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీసన్న కుమారుడు రామాంజనే యులు, కోతుల రామానాయుడులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించడం వల్లే పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారా యణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడులను ప్రత్యర్థులు హత్య చేసిన ట్లు పోలీసులు విచారణలో తేల్చారు. నారా యణరెడ్డి హత్య కేసులో 12 మంది నింది తులను డోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ కాల్వబుగ్గ వద్ద అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన రెండు ట్రాక్టర్లు, వేటకొడవళ్లను స్వాధీనం చేసుకొని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. కాగా, ఈనెల 21వ తేదీన నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు కృష్ణగిరి పొలిమేరల్లో హత్యకు గురయ్యారని గొళ్ల కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో లేని మరో ఐదుగురి పేర్లు కూడా విచారణలో బైటకి వచ్చాయన్నారు. కేసు విచారణ ఫలితాన్ని బట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. -
త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటాం: ఎస్పీ
కర్నూలు: పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే సీఐ, డీఎస్పీ, ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగానే నారాయణరెడ్డి వెపన్ డిపాజిట్ చేశారన్నారు. ఎన్నికల అనంతరం సమాచారం ఇచ్చినా వెపన్ తీసుకోలేదని ఎస్పీ పేర్కొన్నారు. రెన్యువల్ కాలేదని వెపన్ సీజ్ చేసిన సందర్భం గత అయిదేళ్లుగా జిల్లాలో ఒక్కటీ కూడా జరగలేదన్నారు. ప్రాణహాని ఉన్నవారు హఠాత్తుగానే ప్రయాణాలు చేయాలని తప్ప, ముందస్తుగా ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని ఎస్పీ రవికృష్ణ అన్నారు. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారంతోనే ప్రయాణాలు చేయాలని సూచించారు. ఫ్యాక్షన్ వల్ల జిల్లాతో పాటు పలు గ్రామాలు చాలా నష్టపోతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ వెల్లడించారు. -
ఆడపిల్లలు పుట్టారని వేధింపులు
– పోలీసు దర్బార్‌ను ఆశ్రయించిన మహిళ కర్నూలు: ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని తన భర్త వేధిస్తున్నారని, అంతేకాకుండా వారిని వదిలించుకునేందుకు గొంతు నులిమి హత్య చేసే యత్నం కూడా చేస్తున్నారని దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామానికి చెందిన సుంకులమ్మ... ఎస్పీ ఆకె రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 94407 95567 సెల్ నెంబరుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు నేరుగా వచ్చి కలిసిన ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లచెలిమల గ్రామానికి చెందిన సుంకులమ్మ తన కష్టాన్ని ఎస్పీకి విన్నవించారు. తన భర్త ప్రతి రోజూ పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తూ అడ్డుకోబోయిన తనను కూడా దుర్భాషలాడుతూ భౌతిక దాడులు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు భరించలేక కొద్దిరోజులుగా తాను పుట్టినింటిలో ఉంటున్నానని, ఇదే అవకాశంగా తీసుకొని రెండు నెలల క్రితం తన భర్త మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడని తెలిపారు. పిల్లలకు బతుకుతెరువు చూపించి న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. సంతకాన్ని ఫోర్జరీ చేసి రెండో కుమారుడు తన వ్యవసాయ భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆక్రమించుకున్నాడని కృష్ణగిరి మండలం కర్లకుంట గ్రామానికి చెందిన లక్ష్మమ్మ ఫిర్యాదు చేసింది. తన భూమిని తనకు వెనక్కు ఇప్పించాలని వేడుకొంది. భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కబెట్టాలని రుద్రవరం గ్రామానికి చెందిన ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడచులు కలిసి పెళ్లైనప్పటి నుంచి వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన నీలి వెంకట పుష్పలత ఫిర్యాదు చేశారు. వేధింపులు భరించలేక కొంతకాలంగా పుట్టింటిలో ఉంటున్నానని, అయితే భర్త అతని స్నేహితులతో కలిసి తనను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నంది అవార్డులు జిల్లాకే గర్వకారణం
– ‘నంది’ కళాకారుల ర్యాలీలో ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు(కల్చరల్): కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రమీలార్జున పరిణయం నాటకానికి ఏడు నంది అవార్డులు సాధించడం అభినందనీయమని కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఆయన కళాకారుల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రతిభావంతులైన కళాకారులున్నారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాకారులుగా రాణిస్తున్నారన్నారు. రంగస్థల కళాకారులకు ఆదరణ, ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ మే డే సందర్భంగా కార్మికులతో కలసి కర్నూలు కళాకారులు నందుల పండుగ చేసుకుంటున్నారన్నారు. ప్రమీలార్జున పరిణయం నాటకానికి సహకరించిన సాంకేతిక నిపుణులు, నటులందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలో కళాకారుల పద్యాలు... పాటలు... కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన కళాకారుల ర్యాలీ మద్దూర్‌నగర్ మీదుగా సి.క్యాంప్ వరకూ సాగింది. ర్యాలీలో పాల్గొన్న కళాకారులు పద్యాలు, పాటలు పాడుతూ చూపరులను ఆకట్టుకున్నారు. దారి పొడవునా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రమీలార్జున పరిణయంలో నంది అవార్డులు సాధించిన ఓబులయ్య, బాలవెంకటేశ్వర్లు, రామలింగం, శామ్యూల్, లలిత కళాసమితి కార్యదర్శి మహమ్మద్ మియా, ఉపాధ్యక్షులు సి.వి.రెడ్డి, ప్రముఖ రంగస్థల నటుడు చంద్రన్న, ప్రజానాట్యమండలి ఇన్చార్జి శేషయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బస్సు ఎక్కి భద్రతా తెలుసుకుని
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం మధ్యాహ్నం సల్కాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించినంతరం అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో కర్నూలులోని రిలయన్స్ మార్టు వరకు ప్రయాణించారు. మార్గమధ్యలో ప్రయాణికులతో మాట్లాడి ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లోని శాంతిభద్రతల వివరాలు, పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేడియో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రిలయన్స్ మార్టులోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రమణమూర్తి ఉన్నారు. -
ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలి
– జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏప్రిల్ 9న ఆత్మకూరు నగర పంచాయతీ రెండో వార్డు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ఉప ఎన్నిక జరుగుతున్న ఆత్మకూరులో ఆయన పర్యటించారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను పోలీసులకు సూచించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది నిష్పక్షపాతంగా ఉండడంతోపాటు కఠినంగా వ్యవహరించాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు సుధాకరరెడ్డి, సుబ్బయ్య ఉన్నారు. -
కప్పట్రాళ్ల అభివృద్ధికి మరింత కృషి
- ఎస్పీ ఆకె రవికృష్ణ - గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ దేవనకొండ : గ్రామస్తులు సహకరిస్తే కప్పట్రాళ్లను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. తాను దత్తత తీసుకున్న కప్పట్రాళ్ల గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ఎస్పీ ప్రారంభించారు. ముందుగా తానా(తెలుగు రాష్ట్రాల సంయుక్త సంఘం) వారి సహకారంతో రూ.10 లక్షలతో నిర్మించనున్న స్త్రీశక్తి భవనానికి భూమి పూజ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం కోరమాండల్, సత్యసాయిట్రస్టు దాతల సహకారంతో రూ.6 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. 15 మంది రైతులకు రాయితీపై వ్యవసాయశాఖ మంజూరు చేసిన ఎద్దులబండ్లు, 18 మందికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ ఉరవకొండ మండల పొదుపు ఐక్యసంఘం, గ్రామజ్యోతి ప్రాజెక్టు వారు కప్పట్రాళ్ల పొదుపు మహిళలను రిసోర్స్‌పర్సన్‌గా గుర్తించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో పొదుపు సంఘాలను ఏర్పాటుపై వివరించేందుకు ఇక్కడి వారిని తీసుకెళ్తారన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి స్త్రీశక్తిభవనంలో ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పటివరకు గ్రామంలో 63 పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయన్నారు. పంట రుణాలు పొందిన రైతులు వాటిని సక్రమంగా చెల్లించి మరింత ఎక్కువగా రుణం పొందాలన్నారు. త్వరలో గ్రామంలో మిర్చిప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలను బాగా చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వే చేస్తున్న రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో ఎస్పీ కాసేపు మాట్లాడి వారికి సూచనలు చేశారు. కార్యక్రమంలో తానా ప్రోగ్రాం కన్వీనర్ ముప్పా రాజశేఖర్, కోరమాండల్ ఫర్టిలైజర్ మేనేజర్ చక్రవర్తి, డీఎస్పీలు రమణమూర్తి, బాబాఫకృద్దీన్, ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, సీఐలు విక్రమ్‌సింహా, నాగరాజుయాదవ్, డేగుల ప్రభాకర్, శ్రీనివాసులు, ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, కంబగిరి రాముడు, ఎస్ఐ గంగయ్యయాదవ్, ఏఓలు అక్బర్‌బాషా, అల్తాఫ్ఆలీఖాన్, పత్తికొండ ఏడీఏ నారాయణనాయక్ పాల్గొన్నారు. -
నేరాలకు అడ్డుకట్ట వేయండి
– త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ కర్నూలు: నేరాల సంఖ్య తగ్గించడానికి విధుల్లో చురుగ్గా పని చేయాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. ఆదివారం ఉదయం నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకొని త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సీఐ మధుసూదన్‌రావుకు సూచించారు. వివిధ నేరాల్లో పట్టుబడి సీజ్ చేసిన వాహనాల వివరాలను పూర్తిగా సేకరించి సంబంధిత యజమానులకు అప్పగించాలని అందుకు ఎవరూ ముందుకు రాకపోతే వేలం వేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సూచించారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నిరాశ్రయుల వసతి గృహానికి అనాథలు : బళ్లారి చౌరస్తాలోని ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద అనాథగా జీవనం సాగిస్తున్న లక్ష్మిని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదివారం నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించారు. ప్రేమించిన వ్యక్తి వివాహం చేసుకున్నప్పటికీ అతను వదిలేయడంతో లక్ష్మి ఫ్లై ఓవర్ బ్రిడ్జీ కింద ముగ్గురు పిల్లలతో రోడ్డున పడి జీవనం సాగిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకె రవికృష్ణ అక్కడికి చేరుకొని నాల్గవ పట్టణ పోలీసులు 1098 చైల్డ్‌లైన్ సిబ్బందిని పిలిపించి లక్ష్మి వివరాలను సేకరించారు. ఆమెకు జీవన సదుపాయం కల్పించేందుకు సీతారామ్‌నగర్ దగ్గర గల శకుంతలమ్మ ఆధ్వర్యంలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించారు. నాల్గవ పట్టణ సీఐ నాగరాజురావు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంటు అధికారి వరలక్ష్మి, 1098 చైల్డ్‌లైన్ డైరెక్టర్ మోహన్‌రాజు, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలక్ష్మినారాయణ, అంగన్వాడీ టీచర్ వెంకటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు
– అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలతో ఎస్పీ సమీక్ష కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం సాయంత్రం అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందస్తు చర్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీసులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా, అసాంఘిక కార్యకలాపాల అణచివేతలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా పోలింగ్‌కు అంతరాయం కలిగించినా, హింసాత్మక సంఘటనలకు పాల్పడినా కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం, డబ్బు, మరణాయుధాల పంపిణీని అరికట్టేందుకు చెక్‌పోస్టుల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. శాంతి భద్రతల పరంగా ఎక్కడైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, హుసేన్‌పీరా, వెంకటాద్రి, సీఐలు సుబ్రమణ్యం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు భద్రత కల్పించండి
జిల్లా ఎస్పీ రవికృష్ణ శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రానికి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులకు పోలీసు సిబ్బంది అంకిత భావంతో పని చేసి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ రవికృష్ణ సూచించారు. బుధవారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్న ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఆవరణలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, ఆత్మకూరు ఇన్చార్జి డీఎస్పీ వినోద్‌కుమార్‌తో కలిసి బందోబస్తుపై వచ్చిన డీఎస్పీలు, సీఐలు,ఎస్ఐలు ఇతర పోలీస్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు తమకు కేటాయించిన ప్రదేశాలలో సక్రమంగా విధులు నిర్వహించాలని, ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు చేరవేయాల్సిందిగా సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఎట్టి పరిస్థితులలో వారిపై దురుసుగా ప్రవర్తించకుండా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలని చెప్పారు. అనుమానస్పద వ్యక్తులు, బ్యాగులు, సూట్‌కేసులు మొదలైన వాటిపై క్రైమ్‌పార్టీ, స్పెషల్‌పార్టీ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మాస్టర్ కంట్రోల్ రూమ్ పరిశీలన: దేవస్థానం ఈఓ భరత్‌గుప్త అన్నపూర్ణ భవన్ పక్కనే ప్రత్యేకంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మాస్టర్ కంట్రోల్ రూమ్‌ను నిర్మించారు. ఈ మాస్టర్ కంట్రోల్ రూమ్‌ను బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ రవికృష్ణ ఈఓ, ఏఆర్ అడిషనల్ ఎస్పీలతో కలిసి పరిశీలించారు. మొత్తం ఎన్ని కెమెరాలను ఏర్పాటు చేసింది అడిగి తెలుసుకున్నారు. ప్రధాన కూడళ్లలో కూడా ఎలాంటి సంఘటనలు జరిగినా స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ తెలిపారు. -
అంధుల స్ఫూర్తి ఆదర్శం
– జిల్లా ఎస్పీ రవికృష్ణ ఎమ్మిగనూరు : కళ్లులేకున్నా విశేష ప్రతిభ కనబర్చే అంధుల స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. శనివారం వీవర్సు కాలనీ మైదానంలో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎస్పీ మాట్లాడారు. కర్నూలు అంధుల ఆశ్రమ విద్యార్థులతో తీరిక దొరికినప్పుడల్లా గడుపుతాననీ.. ఆ ఆనందమే వేరన్నారు. ముగ్గురు విద్యార్థులకు బ్యాంకు ఉద్యోగాలు కూడా వచ్చాయని, వారిలో పట్టుదల, కసి ఎక్కువగా ఉంటాయన్నారు. ఎస్పీ కూడా కళ్లకు గంతలు కట్టుకొని బ్యాటింగ్ చేశారు. కార్యక్రమంలో సీఐ ప్రసాద్, ఎస్ఐ హరిప్రసాద్, మల్లెల గ్రూప్స్ ఆల్ఫ్రెడ్ రాజు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
పునఃశ్చరణతో నైపుణ్యాల మెరుగు
– ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: పునఃశ్చరణ తరగతులతో నైపుణ్యాన్ని మరింత పెంచుకోవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఏఆర్ సిబ్బందికి మొబలైజేషన్ తరగతులను బుధవారం.. జిల్లా పోలీసు కార్యాలయంలోని కవాతు మైదానంలో ఎస్పీ ప్రారంభించారు. ఈ తరగతులు 14 రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటిరోజు యోగాతో తరగతులను ప్రారంభించారు. యోగా మాస్టర్ సత్యనారాయణమూర్తి పోలీసు సిబ్బందితో యోగాసనాలు చేయించారు. కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరై సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. అన్ని విభాగాల్లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. బందోబస్తుల్లో ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామంతో పాటు యోగా చేయాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్ఐలు రంగముని, జార్జి, ఆర్ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అలసత్వం తగదు
బలవంతులు, బలహీనులంటూ రాజీలు చేయకండి – నేర సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం కర్నూలు: విధి నిర్వహణలో అలసత్వం వీడి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలవంతులు, బలహీనులంటూ సమస్యలపై స్టేషన్లకు వచ్చిన బాధితులను రాజీ చేయకండని తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏటీఎం కార్డు నెంబర్ తెలుసుకుని ఘరానా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలన్నారు. దారి తప్పితే ఎంతటి వారైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లారీ దొంగతనాలపై నిఘా ఉంచాలన్నారు. శివరాత్రి బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నేరం జరిగిన చోట కీలక ఆధారం ఏదో ఒకటి ఉంటుందని, వాటితో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. రౌడీయిజం, గూండాయిజం జిల్లాలో ఎక్కడ ఉన్నా పూర్తిగా అణచివేయాలన్నారు. గణేష్ నిమజ్జనం, బక్రీద్, పుష్కరాలు, వివిధ రకాల బందోబస్తుల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ–బీట్స్ అమలుపై వర్క్‌షాప్ జిల్లా పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఈ–బీట్స్ అమలుపై వర్క్‌షాప్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ–బీట్స్‌ను బలోపేతం చేసి నేరాలను తగ్గించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. గస్తీలకు వెళ్లే పోలీసు సిబ్బంది విషయంలో సీఐలు, ఎస్ఐలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, బాబుప్రసాద్, ఎ.జి.కృష్ణమూర్తి, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, హుసేన్ పీరాతో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు
– ఎద్దులబండిపై ఎస్పీ దంపతుల ఊరేగింపు దేవనకొండ(ఆలూరు): కప్పట్రాళ్ల గ్రామంలో బుధవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, ఆకె పార్వతి దంపతులు హాజరయ్యారు. వీరికి గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా ఎద్దులబండిపై ఎస్పీ దంపతులను ఊరేగిస్తూ వారిపై పూల వర్షం కురిపించారు. ఎద్దులబండి ముందు బైకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం రూ.25 లక్షలతో కమ్యూనిటీ హల్ భవన ఏర్పాటుకు ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొజ్జమ్మతో కలిసి ఎస్పీ దంపతులు భూమిపూజ చేశారు. కోలాట బృందంతో కోలాటలు ఆడి ఎస్పీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సంతోషంగా గడపాలన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు.. ఎస్పీ దంపతులకు నూతన వస్త్రాలను సమర్పించారు. గ్రామ ప్రజలతో కలిసి ఎస్పీ దంపతులు చెన్నకేశవస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అంతకముందు ముగ్గుల పోటీలు, టెన్నికాయిట్ తదితర పోటీలను నిర్వహించారు. ఎస్పీ సతీమణి ఆకె పార్వతి.. మ్యాజికల్చైర్స్ ఆటను ఆడారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సంబరాల్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ సీనియర్ మేనేజర్ చక్రవర్తి, దేవియాడ్స్ విజయ్‌భాస్కర్, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ ప్రసాద్, యూపీఎల్ కంపెనీ అధినేత మోహన్, రీజినల్ మేనేజర్ గోవర్ధన్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సీఐలు విక్రమ్‌సింహ, రిటైర్డ్ హెచ్ఎం రామరాజు, కోడుమూరు ఏవో అక్బర్‌బాషా, దేవనకొండ ఎస్ఐ గంగయ్యయాదవ్, పంచాయతీరాజ్ ఏఈ మహబూబ్‌బాషా, పీఆర్ ఈఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
అంతర్‌జిల్లాల దొంగల ముఠా అరెస్ట్
– డోన్ కేంద్రంగా వివిధ చోరీలకు పాల్పడిన వైనం – ఎనిమిది చోరీలకు సంబంధించి ఆరు లక్షల రికవరీ – డోన్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): డోన్ కేంద్రంగా దేవాలయాలు, షాపులు, ఇళ్లలో చోరీలకు ప్పాలడే అంతర్ జిల్లాల దొంగల ముఠా గట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది చోరీలకు సంబంధించి ఆరు లక్షల రూపాయలను రికవరీ చేశారు. శనివారం డోన్ పట్టణం నుంచి గుత్తి వైపు వెళ్లే జాతీయ రహదారిలోని రాయల్ వే బ్రిడ్జి సమీపంలో ఉన్న దొంగల ముఠాను డీఎస్పీ బాబాఫకృద్దీన్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం అరెస్టు చేసి జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ ఎదుట హాజరుపరచారు. నిందితుల వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన పాలగిరి స్వామి అలియాస్ స్వామి అలియాస్ బాబాయి(40), అనంతపురం జిల్లా అవులదట్ల గ్రామానికి చెందిన రమావత్ వినోద్‌కుమార్ అలియాస్ శివ(23), గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఉద్దంటి రాంబాబు అలియాస్ అమర్(35), కర్నూలు జిల్లాకు చెందిన షేక్ చాంద్‌బాషా(48) ముఠాగా ఏర్పాడి డోన్ కేంద్రంగా పలు చోరీలకు పాల్పిడినట్లు తెలిపారు. చోరీలకు పాల్పడింది ఇలా డోన్‌లోని కంబాలపాడు జంక్షలోని ఈద్గా కాంప్లెక్స్‌లో 2016 ఆగస్టు 29న మూడు షాపుల్లో చోరీకి పాల్పడి 29 వేల ఎలక్ట్రానిక్స్ వస్తువులు, దుస్తులు ఇతర వస్తువులను అపహరించగా, మొత్తం సొమ్మును రికవరీ చేశారు. డోన్‌లోని కొత్తపేటలో నివాసం ఉంటున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో గత ఏడాది సెప్టెంబర్ 13న 10 తులాల బంగారాన్ని చోరీ చేశారు. ఇందులో రెండు తులాల నక్లెస్, 2 తులాల తాలిబొట్టు గొలుసు, ఒకట్నిర తులం కటింగ్ చైన్, రెండు జతల కమ్మలు మొత్తం ఆరు తులాలు ఉంటుంది. వాటి విలువ 1,90,000 డోన్‌కు సమీపంలోని ఉడుములపాడు ఆంజనేయస్వామి దేవాలయంలో గత ఏడాది అక్టోబర్ 28న శ్రీరాముల వారి పంచలోహ ఉత్సవ విగ్రహాలను దొంగిలించగా వాటిన్నింటని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 1.50 లక్షల ఉంటుంది. అదేగ్రామంలో నవంబర్ 16న దత్తాత్రేయ దేవాలయంలో అమ్మవారి వెండి కీరిటాన్ని చోరీకి గురవ్వగా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1.15 లక్షలు ఉంటుంది. డోన్‌కు సమీపంలోని అంజనేయస్వామి దేవాలయంలో అక్టోబర్ 20న 30 కేజీల 3 ఇత్తడి గంటలను దొంగింలించగా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20 వేలు. డోన్‌లోని విజయభాస్కరరెడ్డి మార్కెట్లో నవంబర్ 5న ఓ షాపు, దానికి పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక టీవీ, గుడి గంట, రెండు దీపపు స్తంభాలు, హుండీలో చిల్లర దొంగిలించారు. ఇందులో రెండు దీపపు స్తంభాలు, గంట, టీవీని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 36 వేలు ఉంటుంది. వెల్దుర్తి మండలం గోవర్దనగిరి గ్రామంలో అక్టోబర్ 5న 21 కేజీల కాపర్ వైరు, 35 లీటర్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్, 1120 మీటర్ల అల్యూమినియం వైరు, 330 మీటర్ల ఎల్టీఏబీ కేబులు వైరును దొంగించాలరు. ఇందులో అల్యూమినీయం వైరు, ఎల్టీఏబీ కేబుల్ వైరు, కాపర్ వైర్లను స్వాధీనం చేసుకోగా వీటి విలువ రూ. 46 వేలు ఉంటుంది. - వెల్దుర్తి మండలం ఎల్బండ గ్రామ పొలిమేర్లలో డిసెంబర్ 25వ తేదీన కాపర్ వైరు దొంగిలించారు. దీని విలువ రూ. 26 వేలు ఉంటుంది. - అంతర్ జిల్లాల ముఠాను పట్టుకున్న డోన్ సీఐ వై.శ్రీనివాసులు, ఎస్ఐ వీ.శ్రీనివాసులు, ఏఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ నాగన్న, వెంకటేష్‌నాయక్, రాజక్, హోంగార్డు భాస్కరరెడ్డి, నాయుడు, శ్రీకాంత్‌ను జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ అభినందించారు. -
ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం
– రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక కర్నూలు: దందాలు, దౌర్జన్యాలకు దూరంగా ఉండాలని.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఆకె రవికృష్ణ రౌడీషీటర్లను హెచ్చరించారు. బుధవారం రాత్రి కర్నూలు నగరం 3వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్, గణేష్‌నగర్ కాలనీల్లో ఆయన కలియతిరిగారు. శాంతి భద్రతల విషయమై కాలనీవాసులతో చర్చించారు. శ్రీరామ్‌నగర్‌కు చెందిన ఇమ్మానియేల్(ఇమ్మి)పై డిసెంబర్ 17న కొందరు వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు వేసుకొని దాడిచేశారు. గణేష్‌నగర్‌లోని స్నేహితుని ఇంట్లో తలదాచుకొని ఉండగా.. అడ్రస్ తెలుసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారు. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేత బంధువులు దాడి చేసినట్లు విచారణలో వెల్లడయింది. ఈ విషయాన్ని బాధితుడు నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో 3వ పట్టణ పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదయింది. సమస్యకు కారణం ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఘటనపై ఆరా తీయాలని మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావును ఎస్పీ ఆదేశించారు. దాడికి కారణమైన వారిపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచాలన్నారు. రౌడీషీటర్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయితే నేరుగా లేదా ఫోన్ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. డీఎస్పీలు రమణమూర్తి, బాబు ప్రసాద్, సీఐ మధుసూదన్‌రావు తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. -
హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు
- దాడికి పాల్పడిన 23 మంది అరెస్టు - రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఎస్పీ ఆదేశాలు - సిద్దపల్లిలో పర్యటన ఆత్మకూరు: పల్లెల్లో హింసను ప్రోత్సహించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దపల్లి గ్రామంలో జరిగిన దాడుల్లో 23 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి వర్గీయులు దరగయ్య కుటుంబంపై కర్రలు, మారణాయుధాలతో దాడికి పల్పడినట్లు తెలిపారు. ఇలా గ్రామాల్లో అల్లర్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. మరో 9 మంది పరారిలో ఉన్నట్లు చెప్పిన ఎస్పీ.. త్వరలోనే సీఐ ఎదుట లొంగిపోవాలని వారికి సూచించారు. గ్రామాల్లో మళ్లీ ఘర్షణలకు తావులేకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. సిద్దపల్లిలో ఎస్పీ పర్యటన సిద్దపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎస్పీ పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులు, అంతకు ముందు చిన్నారులతో మాట్లాడి దాడికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. ఇరువర్గాల వారితో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దెబ్బతిన్న బైకులు, సైకిళ్లు ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ సుప్రజ, సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు సు«ధాకరరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌నాయక్, సిబ్బంది ఉన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించండి
– పోలీస్ ఆంక్షలను పాటించండి – అపరిచితులకు గదులు కేటాయించవద్దు – డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి – జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ శ్రీశైలం- శ్రీశైల మహాక్షేత్రంలో కష్ణా పుష్కరాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ రవికష్ణ సూచించారు. శనివారం ఆయన క్షేత్ర పురవీధుల్లో సైకిల్ తిరుగుతూ పరిశీలించారు. కష్ణా పుష్కరాల బందోబస్తుకు వచ్చే పోలీసులకు వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన బ్యారక్స్, కళాశాల, పాఠశాల వసతి గహాలను పరిశీలించారు. సత్రాలు, లాడ్జీల నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రెడ్ల సత్రంలో సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. సత్రాల గదుల కేటాయింపులో పూర్తి సమాచారంతో పాటు గుర్తింపు కార్డులను సేకరించాల్సిందిగా ఆదేశించారు. అలాగే ఎక్కువ మొత్తం చెల్లించడానికి ఇష్టపడిన అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితులలో గదులను ఇవ్వవద్దని కోరారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా పోలీసు నిఘాతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే భద్రతా చర్యల్లో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డును పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్డీలు రవిప్రకాష్, సత్య ఏసుబాబు, డీఎస్పీలు సుప్రజ, రమేష్‌బాబు, ఈశ్వర్‌రెడ్డి, బాబా ఫకద్ధిన్, సీఐలు చక్రవర్తి, గంటా సుబ్బారావు తదితరులు ఉన్నారు. డయల్ 100 పుస్తకం ఆవిష్కరణ శ్రీశైలంలోని మేకల బండ ప్రాథమిక పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆకే రవికష్ణ డయల్ 100 పుస్తకాలను ఆవిష్కరించారు. దీనికి ముందుగా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఇంటి సమీపంలోనూ, మీకు తెలిసిన ప్రాంతాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు, లేదా బ్యాగులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ఓ వైపు పుష్కరభద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ మరో వైపు శ్రీశైలం పీఎస్ నుంచే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ కేంద్రాలకు సెట్ ద్వారా మానిటరింగ్ చేస్తూ వివరాలను సేకరించారు. పుష్కర వి«ధుల్లో పాల్గొనడానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
డాక్టర్ హత్యకేసులో నలుగురు అరెస్టు
– నాలుగు సెల్ఫోన్లు, 2 మోటారు సైకిళ్లు స్వాధీనం కర్నూలు(టౌన్): నంద్యాలకు చెందిన డాక్టర్ శైలేంద్రరెడ్డి (38) హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన డాక్టర్ శైలేంద్రరెడ్డి ఈ నెల 26వ తేదీ రాత్రి తన బంధువులను బస్సు ఎక్కించేందుకు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌కు కారులో వెళ్లారు. బంధువులను ఎక్కించిన తరువాత కారును వెనక్కు తీస్తుండగా బైక్‌కు తగిలింది. అక్కడే మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు షేక్ సల్మాన్ (20), షేక్ వలి (23), షేక్ ఇమ్రాన్ (22), కమ్ము బైగారి ముజీబ్ (27) డాక్టర్‌తో గొడవకు దిగారు. అక్కడి నుంచి వెళ్లి పోయిన డాక్టర్‌ను వెంబడించి స్థానికంగా శ్రీనివాస సెంటర్లో మరోసారి గొడవ పడి వైద్యుని తలపై బలంగా రాయితో కొట్టారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్‌ను వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డాక్టర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మతుని బంధువుల ఫిర్యాదు మేరకు నంద్యాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. హత్య జరిగిన అనంతరం సమీపంలోని ఓ క్యాంటిన్ వద్దకు వెళ్లి చేతులు కడుకున్నట్లు స్పష్టంగా రికార్డు అయ్యింది. ఈ మేరకు నిందితులను గుర్తించి మూలమఠం వద్ద ఉన్న నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి, నంద్యాల వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్ఐలు రమణ, హరిప్రసాద్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు. -
దౌర్జన్యం చేస్తే గెలుపు వరించదు
మెజార్టీ పోలీసులకు నేను మిత్రున్ని.. ♦ జిల్లా ఎస్పీ రవికృష్ణను ఏనాడూ కించపరిచి మాట్లాడలేదు ♦ చట్టం గురించి ప్రశ్నిస్తే సంకెళ్లా ♦ రూల్స్ పోలీసులకు వర్తించవా ♦ వీడియో పుటేజీ ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ♦ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాజకీయ పార్టీల గాలికి వ్యతిరేకంగా గెలుపు కులమతాలకు అతీతంగా తమ గెలుపులో ప్రజలు కీలక భూమిక పోషించారన్నారు. రాజకీయ పార్టీల గాలికి వ్యతిరేకంగా గెలిచిన ఘనత కూడా తమ కుటుంబానికే దక్కిందన్నారు. ఎస్పీ ఇప్పుడు చేస్తున్న ప్రచారం, తన ప్రత్యర్థులు ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ చేసి విఫలమయ్యారన్నారు. నిజంగానే డీఎస్పీ దేవదానం కులం తనకు తెలియదన్నారు. ఆయనపై అంతటి అభిమానమే ఉంటే రెగ్యులర్ డీఎస్పీగా ఎందుకు నియమించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి డీఎస్పీ దేవదానం కులాన్ని పదేపదే చెప్పడం ఎస్పీకి తగదన్నారు. నంద్యాల : మూడు దఫాలు పార్లమెంట్‌కు, నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికయ్యానంటే ప్రజాబలంతోనే సాధ్యమైందని.. దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఇన్నిసార్లు గెలుపు వరించేది కాదనే విషయం జిల్లా ఎస్పీ రవికృష్ణ గుర్తుంచుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నంద్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధులను, రెవెన్యూ అధికారులను పోలీసులు డామినేట్ చేసినప్పుడు.. చట్ట ప్రకారం తాను ప్రశ్నిస్తే ఎస్పీ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల విధుల్లోని రెవెన్యూ అధికారులను పోలీసులు డామినేట్ చేసిన విషయాన్ని వీడియో ఫుటేజీల ఆధారంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ స్టాల్లో కూర్చొన్న ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియను బయటకు పంపేందుకు పోలీసులు అధికారం ఎవరిచ్చారో చెప్పాలన్నారు. పోలీసులు తనను కూడా వెయిటింగ్ స్టాల్లో కూర్చోనివ్వలేదన్నారు. అదే విషయం వారికి చెప్పగా.. ఆర్డీఓ వచ్చి ఓటు వేయాలని కోరడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం గౌరవించానన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ప్రకటించిన రెండు గంటల తర్వాత తనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించడం వెనుక ఎవరి డెరైక్షన్ ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. పోలీసు శాఖలో ఉన్నంత మిత్రులు మరెక్కడా లేరనే విషయం ఎస్పీ తెలుసుకోవాలన్నారు. ద్వేషించే వారు ఒకరిద్దరు ఉంటే.. అభిమానించే వారి సంఖ్య 95 మందికి పైమాటేనన్నారు. ఎస్పీ బాధపడేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదని, అయితే ఆయన ఎందుకు అంతలా కక్ష పెంచుకున్నారో వేయి డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. తనను అరెస్టు చేయడానికి ఇల్లు, ప్రభుత్వాసుపత్రి వద్ద వందల సంఖ్యలో పోలీసులను నియమించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బాధాకరమన్నారు. ఆ సందర్భంగా ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయవద్దని క్యాడర్‌కు స్వచ్ఛందంగా పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఇమెజ్ అంతలా పెరుగుతుందన్నారు. పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానని.. ఎస్పీ మరోసారి రాజకీయ నాయకుడిలా ప్రకటనలు చేస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు.