కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు
కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు
Published Wed, Jan 11 2017 9:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
– ఎద్దులబండిపై ఎస్పీ దంపతుల ఊరేగింపు
దేవనకొండ(ఆలూరు): కప్పట్రాళ్ల గ్రామంలో బుధవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, ఆకె పార్వతి దంపతులు హాజరయ్యారు. వీరికి గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా ఎద్దులబండిపై ఎస్పీ దంపతులను ఊరేగిస్తూ వారిపై పూల వర్షం కురిపించారు. ఎద్దులబండి ముందు బైకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం రూ.25 లక్షలతో కమ్యూనిటీ హల్ భవన ఏర్పాటుకు ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొజ్జమ్మతో కలిసి ఎస్పీ దంపతులు భూమిపూజ చేశారు. కోలాట బృందంతో కోలాటలు ఆడి ఎస్పీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సంతోషంగా గడపాలన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు.. ఎస్పీ దంపతులకు నూతన వస్త్రాలను సమర్పించారు. గ్రామ ప్రజలతో కలిసి ఎస్పీ దంపతులు చెన్నకేశవస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అంతకముందు ముగ్గుల పోటీలు, టెన్నికాయిట్ తదితర పోటీలను నిర్వహించారు. ఎస్పీ సతీమణి ఆకె పార్వతి.. మ్యాజికల్‌చైర్స్ ఆటను ఆడారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సంబరాల్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ సీనియర్ మేనేజర్ చక్రవర్తి, దేవియాడ్స్ విజయ్‌భాస్కర్, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ ప్రసాద్, యూపీఎల్ కంపెనీ అధినేత మోహన్, రీజినల్ మేనేజర్ గోవర్ధన్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సీఐలు విక్రమ్‌సింహ, రిటైర్డ్ హెచ్‌ఎం రామరాజు, కోడుమూరు ఏవో అక్బర్‌బాషా, దేవనకొండ ఎస్‌ఐ గంగయ్యయాదవ్, పంచాయతీరాజ్ ఏఈ మహబూబ్‌బాషా, పీఆర్ ఈఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement