పందెం కోడి.. పండక్కి రెడీ.. | The roosters getting ready for sankranthi | Sakshi
Sakshi News home page

పందెం కోడి.. పండక్కి రెడీ..

Published Thu, Dec 26 2024 5:34 AM | Last Updated on Thu, Dec 26 2024 5:34 AM

The roosters getting ready for sankranthi

సంక్రాంతికి ముస్తాబవుతున్న పుంజులు 

ఒక్కో పుంజు రూ.10 వేల నుంచి రూ.3 లక్షలకు విక్రయాలు

బరిలో ఎలాంటి గాయాల్లేకుండా గెలిచిన పుంజుకు యమా డిమాండ్‌ 

పుంజుల అమ్మకాల ద్వారా సంక్రాంతి సీజన్‌లో రూ.25 కోట్ల వ్యాపారం 

పందెం కోడిని సిద్ధంచేయడానికి ఒక్కోదానికి రూ.30 వేల వ్యయం 

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 450 పెంపకం కేంద్రాలు 

ఇక్కడ ఈ ఏడాది సంక్రాంతికి చేతులు మారిన మొత్తం రూ.500 కోట్లు  

బరులను సొంతం చేసుకోవడానికి కూటమి నేతల్లో పోటీ

సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెల్లో సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అయితే ఈ హడావుడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో చిన్నాపెద్దా, ఆడామగా తేడాలేకుండా పొలోమని వచ్చేస్తారు. కారణం.. అందరినీ ఆకర్షించే కోడిపందేలు. ఈ మూడ్రోజుల పండగ ప్రత్యేకత.. ప్రత్యేక ఆకర్షణ ఇదే. మరో నెలరోజుల్లో ఈ సందడి ప్రారంభం కానుంది. కాలు దువ్వడానికి కోళ్లు.. పందెం రాయుళ్లు రెడీ అయిపోతున్నారు.

కైకలూరు : సంక్రాంతి పందేల బరిలో ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఢీకొట్టడానికి కోడిపుంజులు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద పండుగ సమరానికి కసరత్తు మొదలైంది. పండ్ల తోటలు, చేపల చెరువు గట్లు, ఫాం హౌస్‌లు ఇలా చిన్నాపెద్దా కలిపి దాదాపు 450 పుంజుల పెంపక కేంద్రాలు కొనసాగుతున్నాయి. 

ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ నాయకులతో పాటు జనసేన నేతలు పందేల బరుల ఏర్పాటుకు పోటీపడుతున్నారు. బరుల స్థల సేకరణలో నిమగ్నమయ్యారు. గుండాట, పేకాట, మద్యం విక్రయాలు, వ్యాపార దుకాణాల కోసం ఆశావహులు కూటమి నేతల ప్రసన్నానికి ప్రయత్నిస్తున్నారు. 

ఒక్కో పుంజుకు రూ.30 వేల ఖర్చు..  
ఇక పందేనికి సిద్ధంచేసే ఒక్కో పుంజుకు రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. జీడిపప్పు, బాదం, రాగులు, సజ్జలు, నువ్వులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఉడికించిన మటన్, గుడ్లు పెడుతున్నారు. ప్రతిరోజూ ప్రత్యేకంగా నీటిలో ఈత కొట్టిస్తూ, ప్రత్యేక పరికరాల ద్వారా నడిపిస్తారు. కొంతమంది థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌ నుంచి మేలు జాతి కోడిపుంజులను తెప్పించుకుంటున్నారు. 

ఇటీవల నెల్లూరు జిల్లా రైతులు ఆటోలలో వివిధ జాతుల పుంజులను తీసుకొచ్చి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. అలాగే, కోడి పందేలలో ఎదుటి పుంజులు దాడి చేసినప్పుడు వాటిని తప్పించుకుని ఎలాంటి గాయాలు కాకుండా ప్రత్యర్థి పుంజును చంపిన పుంజులను రూ.3లక్షలకు కొనుగోలు చేస్తారు. 

ఇలాంటి వాటిని ఈ ప్రాంతంలో పందేల నిర్వాహకులు గుర్తిస్తారు. ఇక సంక్రాంతి నెలరోజుల్లో పుంజుల అమ్మకాల ద్వారా రూ.25 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. సుమారు ఏడువేలకు పైగా పుంజుల అమ్మకాలు ఇక్కడ జరుగుతాయని అంచనా.

పొరుగు రాష్ట్రాల నుంచి అతిథులు రాక
కోడిపందేల కోసం ఏడాది మొత్తం ఎదురుచూసే వారు.. ఈ సమయంలోనే సంవత్సరానికి సరిపడా ఆదాయాన్ని గడించే వారు గోదావరి జిల్లాల్లో అనేకమంది ఉంటారు. ఈ ఏడాది జనవరిలో పండుగ మూడ్రోజులు ఒక్క ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాలోనే రూ.500 కోట్లపైనే చేతులు మారాయి. ఇక వచ్చే నెలలో జరిగే కోడిపందేలు ఒక రేంజ్‌లో ఉంటా­యని జూద విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇక ఈ కోడిపందేలను తిలకించడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి విచ్చేసే అతిథుల కోసం హోటళ్లు, లాడ్జీల బుకింగ్‌లు మొదలయ్యాయి. ప్రధాన సెంటర్లలో అయితే ఇప్పటికే పూర్తయిపోయాయి. అలాగే, బరుల చుట్టూ ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లు, బౌన్సర్ల ఏర్పాటుతో పాటు ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లు, స్కూటీలను అందించాలనే యోచనలో నిర్వాహకులు ఉన్నారు.  

కుక్కుట శాస్త్రంపై నమ్మకం..
కోడి పందేల నిర్వాహకులు పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న కుక్కుట శా్రస్తాన్ని (కుక్కుట పురాణం) విశ్వసిస్తారు. కుక్కుటేశ్వరస్వామి నుంచి ఈ పురాణం వినుతికెక్కిందని అంచనా. బొబ్బిలి యుద్ధకాలం నుంచి ఈ శా్రస్తాన్ని పందెపు రాయుళ్లు అనుసరిస్తున్నారు. కోడిపుంజు జన్మనక్షత్రం, జాతకం, 27 నక్షత్ర, వారఫలాలు ఇందులో ఉన్నాయి. పందెం జరిగే తిథిని బట్టి కోడిపుంజు గెలుస్తుందో లేదో అంచనా వేసి మరీ లక్షల్లో పందేలు కడతారు. 

కోడి పుంజులకు వాటి ఈకల రంగును బట్టి, జాతిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. నెమలి, పూల, కాకి, డేగ, పింగళి, సేతు, మైల, పచ్చకాకి, గేరివా, తీతువా ఇలా అనేక జాతులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి కోడిపుంజులకు ప్రత్యేక శిక్షణ అందించడానికి పందేలలో అనుభవం కలిగిన గురువులను పెంపకందారులు నియమించుకున్నారు.  

పుంజుల పెంపకం హాబీ.. 
ఏటా వివిధ జాతుల కోడి పుంజులను పెంచడం ఒక హాబీ. చంటి పిల్లలను తల్లి ఏ విధంగా సాకుతుందో పుంజులనూ అలాగే పెంచుతాం. తల్లి, తండ్రి జీన్స్‌ను పరిగణనలోకి తీసుకుని 18 నెలల వయస్సులోనే పోరాట పటిమను గుర్తిస్తాం. వీటి సంరక్షణకు ప్రత్యేకమైన మందులు వినియోగిస్తాం. ఒక్కో పుంజు తయారీకి అన్నీ కలుపుకుని రూ.30 వేలు ఖర్చు చేస్తున్నాం.   – దండు రంగరాజు, ఆక్వా రైతు, కైకలూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement