పెరిగిన పచ్చి కొబ్బరి, కురిడీ ధరలు
తమిళనాడులో దిగుబడి తగ్గడం..
ఉత్తరాదికి ఎగుమతులు పెరగడమే కారణం
సాక్షి, అమలాపురం: అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు సం‘క్రాంతి’ వెలుగులొచ్చాయి. గడచిన వారం రోజులుగా పచ్చికొబ్బరి, కురిడీ కొబ్బరి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు జోరందుకున్నాయి. ఉత్తరాదికి ఎగుమతులు పెరగడం.. తమిళనాడులో దిగుబడులు తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో 1.77 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మార్కెట్‌లో కొబ్బరి లావాదేవీలు అంబాజీపేట మార్కెట్‌లో ధరల ఆధారంగా సాగుతుంటాయి. ప్రస్తుతం అంబాజీపేట మార్కెట్‌లో పచ్చి కొబ్బరి, వెయ్యికాయల ధర రూ.14,500 నుంచి రూ.15 వేలకు చేరింది.
రోజుకు 70 నుంచి 100 లారీల ఎగుమతి
గతేడాది అక్టోబర్ నుంచి నవంబర్ వరకూ పచి్చకొబ్బరి వెయ్యి కాయల ధర రికార్డు స్థాయిలో రూ.18,500 వరకు పలికింది. తర్వాత ధర తగ్గినా రూ.14 వేల వద్ద స్థిరంగా ఉంది. వారం రోజుల నుంచి ధర పెరుగుతూ వస్తోంది. దీంతోపాటు కురిడీ కొబ్బరి ధరలు సైతం పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం పాత కాయలలో కురిడీ కొబ్బరి వేయింటికి గండేరా రూ.15 వేలు, గటగట రూ.13,500, కొత్త కాయలలో గండేరా రూ.14 వేలు, గటగట రూ.12,500 ఉండేవి. ఇప్పుడు వాటి ధరలు పెరిగాయి.
ప్రస్తుత మార్కెట్‌లో పాత కురిడీ కొబ్బరి వెయ్యింటికి గండేరా రూ.17,500, గటగట రూ.16,000, కొత్త గండేరా రూ.16,800, గటగటా రూ.15,000 వరకూ పెరిగాయి. ఆయా రకాలకు రూ.రెండు వేల నుంచి రూ.2,500 వరకు పెరిగాయి. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 నుంచి 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి అవుతోందని అంచనా.
పెరిగిన వినియోగం
సంక్రాంతికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొబ్బరి వినియోగం కొంత వరకూ పెరగడంతోపాటు స్థానికంగా దిగుబడి తగ్గడం కూడా ధర పెరుగుదలకు కారణం. ఈ సీజన్‌లో సగటు దిగుబడి ఎకరాకు 1,200 కాయలు కాగా, ప్రస్తుతం 400 కాయలు మాత్రమే దిగుబడిగా వస్తున్నాయి.
తమిళనాడు, కర్ణాటకలో సైతం దిగుబడులు తగ్గడం కూడా రేటు పెరగడానికి కారణమైంది. మూడు నెలల నుంచి పచ్చికాయ ధర అధికంగా ఉండడం వల్ల కూడా కురిడీ కొబ్బరి ధర పెరుగుదలకు కారణమైంది. దిగుబడి తగ్గినా.. సంక్రాంతి సమయంలో కొబ్బరి ధరలు పెరగడం రైతులకు ఊరటనిచ్చే అంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment