సాక్షి ప్రతినిధి, ఏలూరు/కాకినాడ సిటీ: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. దీంతో వారిద్దరి మధ్యనే పోరు కొనసాగింది.
ఏలూరు జిల్లాలో 2,667 ఓట్లకు గాను 2,443 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 91.60 శాతంగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో 3,729 మంది ఓటర్లకు గాను 3,478 మంది ఓటుహక్కును వినియోగించుకోవడంతో 93.27 శాతంగా నమోదైంది. కాకినాడ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏఆర్వో వెంకటరావు ఆధ్వర్యంలో ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు.
బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్‌టీయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. మొత్తం ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల్లో 116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఓటర్లకు 15,502 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 92.62% పోలింగ్ నమోదైందని కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment