kappatralla
-
యురేనియం తవ్వకాలపై ఆందోళనలు
-
యురేనియం వార్.. కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత
కర్నూలు, సాక్షి: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.చదవండి: రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్! -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లా టీడీపీ మాజీ జెడ్పీటీసీ కప్పట్రాళ్ల బొజ్జమ్మ (సుశీలమ్మ) దంపతులు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుశీలమ్మ, ఆమె భర్త, దేవనకొండ మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ కనుమరుగు అయిందన్నారు. 40 ఏళ్లుగా టీడీపీలో ఉండి ఎన్నో నష్టాలు, కష్టాలు ఎదుర్కొన్న బొజ్జమ్మ, రామచంద్ర నాయుడు పార్టీలో చేరారని తెలిపారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని, 2024లో కూడా జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటామని తెలిపారు. నాన్న స్థానంలో తాను టీడీపీకి పనిచేశానని బొజ్జమ్మ తెలిపారు. తమ నాన్నని చంపించిన వారిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. గుర్తించని పార్టీలో ఉండటం అనవసరం అనిపించిందన్నారు. టీడీపీ కోసమే తమ కుటుంబం బలైందని, అయినా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల పార్టీ అంటూనే చంద్రబాబు బీసీలకు ఏం న్యాయం చేయలేదని మండిపడ్డారు. సీఎం జగన్ బీసీలకు చేస్తున్న మేలుతో తాము వైఎస్సార్సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. సీఎం తమకు రక్షణ కల్పిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీసీల పార్టీ అంటూనే చంద్రబాబు మోసం చేశారని.. సీఎం జగన్ బీసీలకు అనేక పదవులు ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: ఏపీకి నాలుగు జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన సీఎం జగన్ -
చదువుతోనే ఫ్యాక్షన్ అంతం
- ఎస్పీ ఆకే రవికృష్ణ - తండ్రి జ్ఞాపకార్థం కప్పట్రాళ్ల విద్యార్థులకు నగదు బహుమతులు కర్నూలు: ప్రతి ఒక్కరు చదువుకొని ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని దత్తత గ్రామం కప్పట్రాళ్లకు చెందిన హైస్కూల్ విద్యార్థులకు ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. కప్పట్రాళ్ల హైస్కూలులో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రంగడు (9.3), శివగణేష్ (9.3), వలిబాషా (9.2) విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతిని కుటుంబ సమేతంగా ఎస్పీ అందజేశారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 57 మంది విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులతో ఎస్పీ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో సివిల్స్ పరీక్షలపై విద్యార్థులకు పలు విషయాలు వివరించి అవగాహన కల్పించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే గ్రూప్స్‌కు ప్రిపేర్ కావచ్చన్నారు. ఎలా చదవాలి, ఏ విధంగా సమర్థం కావాలి, ఏయే పుస్తకాలు చూసుకోవాలి, ఎలా రాయాలనే విషయాలను విద్యార్థులకు వివరించారు. తాను కూడా ప్రభుత్వ స్కూలులోనే చదివానన్నారు. కప్పట్రాళ్ల హైస్కూల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న 50 మంది విద్యార్థులకు టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమంలో భాగంగా యోగా, నైతిక విలువలపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అబ్బాయిలకు ఇండస్ స్కూలులో, అమ్మాయిలకు మాంటిస్సొరి స్కూలులో వారం రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బేబిరాణి, ఇంచార్జి మరియానంద, అధ్యాపకుల బృందం ఆసిఫ్ అలీ, ఆంజనేయులు, చక్రవర్తి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, రామాంజలి తదితరులు పాల్గొన్నారు. -
పర్వతం.. పాదాక్రాంతం
- నాటి బాలకార్మికుడే నేటి పర్వతారోహకుడు - బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించిన కప్పట్రాళ్ల కుర్రోడు - మీరతాంగ్ గ్లేసియర్‌లో నిమాస్ కోర్సు కర్నూలు(హాస్పిటల్) : చిన్నతనంలో చదువు ఒంటబట్టలేదని తల్లిదండ్రులు అతన్ని వలస పనులకు తీసుకెళ్లేవారు. అలాంటి బాలుడు నేడు చదువుకుని దేశంలోని ప్రతిష్టాత్మక పర్వతాలను అధిరోహిస్తున్నాడు. ఎత్తైన బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించడమే గాక మీరతాంగ్ గ్లేసియర్‌లో 28 రోజుల పాటు కఠోర శిక్షణ సైతం తీసుకున్నాడు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన ఓబులేసు, వీరభద్రమ్మలకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు. వీరు తమకున్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూనే గ్రామంలో వ్యవసాయ పనులకు కూలీగా వెళ్లేవారు. ఒక్కగానొక్క కుమారుడైన కె. సురేంద్రను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 4వ తరగతికి వచ్చినా అ,ఆలు సరిగ్గా రావని చదువు మాన్పించి పనికి పంపించారు. తమతో పాటు వలస సమయంలో గుంటూరు జిల్లాకు తీసుకెళ్లేవారు. ఈ దశలో బాలున్ని చూసిన అధికారులు బాలకార్మిక నిర్మూలన పాఠశాలలో చేర్పించి 5వ తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత 10వ తరగతి వరకు బీసీ హాస్టల్లో ఉంటూ పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఆదోనిలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సురేంద్రను బాగా చదివించాలని బెంగళూరులో ఉండే పెద్దమ్మ కుమారుడు రవి అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజిలో బీ.కాం చదివించాడు. పర్వతారోహణకు శ్రీకారం : గతేడాది నవంబర్‌లో ‘మిషన్ ఎవరెస్ట్’ పై జిల్లా యువజన సంక్షేమ శాఖ ఇచ్చిన ప్రకటన చూసి సురేంద్ర ఆకర్షితుడయ్యాడు. వెంటనే దరఖాస్తు చేసుకుని ఎంపికలో జిల్లాలో రెండవ స్థానాన్ని సాధించాడు. అనంతరం విజయవాడలోని కేతనకొండలో శిక్షణ పొందాడు. అక్కడ నుంచి డార్జిలింగ్‌కు వెళ్లి 20 రోజుల పాటు, సిక్కిం సరిహద్దులోని రాతోం గ్లేసియర్‌లో కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ పొందాడు. బీసీరాయ్ పర్వతారోహణ : రాతోంగ్లేషియర్లో కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ అనంతరం గతేడాది డిసెంబర్ 9న బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించాడు. నేపాల్‌లో భూకంపం వచ్చిన తర్వాత ఇక్కడ పర్వతారోహణను ప్రభుత్వం నిషేదించింది. తాజాగా మళ్లీ అనుమతినిచ్చింది. ఈ పర్వతారోహణకు మన రాష్ట్రం నుంచి 24 మంది వెళ్లగా చివరకు 12 మంది మాత్రమే అధిరోహించారు. వారిలో ముందుగా పర్వతాన్ని ఎక్కిన రెండవ వాడు సురేంద్ర. ఇక్కడ ఏ గ్రేడ్ వచ్చిన వారందరికీ అడ్వాన్స్ మౌంటేనింగ్ కోర్సు నిమాస్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనింగ్ అల్లాయిడ్ కోర్స్)లో 28 రోజుల పాటు మీరతాంగ్ గ్లేసియర్ (అరుణాచల్ ప్రదేశ్–చైనా బోర్డర్)లో ఈ నెల 8వ తేదీ వరకు శిక్షణ పొందాడు. ఈ సమయంలో 72 కిలోమీటర్ల ట్రెక్కింగ్, 20 వేల అడుగుల ఎత్తు దాకా మీరతాంగ్ గ్లేసియర్‌ను ఎక్కడం, మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ శిక్షణ పొందడం మరిచిపోలేని అనుభూతనిచ్చిందని సురేంద్ర వివరించాడు. ఈ శిక్షణ అనంతరం న్యూమలింగ్ గ్రామంలో 9కిలోమీటర్ల రన్నింగ్ పోటీ నిర్వహించారని ఇందులో ఉత్తీర్ణత సాధించానని చెప్పాడు. దీంతో ప్రపంచంలోని ఏ పర్వతాన్నైనా అధిరోహించేందుకు తనకు అవకాశం లభించిందని, భవిష్యత్‌లో ప్రభుత్వం సహకరిస్తే దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిస్తానని మనసులోని మాట చెప్పాడు. -
ఎన్ఐఆర్డీలో శిక్షణకు కప్పట్రాళ్ల మహిళలు
కర్నూలు : ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లకు చెందిన 23 మంది మహిళలు హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో జీవనోపాధి శిక్షణకు వెళ్లారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వారు ఎస్పీ ఆకె రవికృష్ణను కలిశారు. గ్రామానికి చెందిన ప్రతి మహిళ ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. పేపర్ ప్లేట్లు, ఇటుకలు, పచ్చళ్లు, రెడిమేడ్ డ్రస్సులు తయారీ, సోలార్ లైట్లు, జ్యూట్ బ్యాగులు, సబ్బుల తయారీపై శిక్షణ పొందనున్నారు. కార్యక్రమంలో కోడుమూరు వ్యవసాయ అధికారి అక్బర్ బాషా, గ్రామ జ్యోతి ప్రాజెక్డు డైరెక్టర్ అబ్దుల్ సలాం పాల్గొన్నారు. -
ప్రత్యేక శిక్షణకు కప్పట్రాళ్ల మహిళలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ చొరవతో హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో ప్రత్యేక శిక్షణ పొందేందుకు 35 మంది కప్పట్రాళ్ల మహిళలు ఎంపికయ్యారు. వారందరూ సోమవారం హైదరాబాద్‌కు వెళ్తుండగా ఎస్పీ తన క్యాంపు కార్యాలయంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..కప్పట్రాళ్లలో ప్రతి మహిళ సొంతంగా ఆదాయ వనరులను సమకూర్చుకోవాలన్నారు. ఇందుకోసం తనవంతు సాయం అందిస్తానని తెలిపారు. కేవలం వ్యవసాయమే కాకుండా ఇతర వనరులపై దృష్టి సారించాలని సూచించారు. కప్పట్రాళ్ల మహిళలు హైదరాబాద్‌కు శిక్షణ కోసం వెళ్లేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని టీజీవీ గ్రూపు ద్వారా సమకూర్చుతామని ఆ సంస్థల చైర్మన్ టీజీ భరత్ అన్నారు. అనంతరం 35 మంది మహిళలతో కూడిన అమరజ్యోతి వాహనాన్ని జెండా ఊపి హైదరాబాద్‌కు ఎస్పీ, టీజీ భరత్ సాగనంపారు. కార్యక్రమంలో సెర్పు ఆర్గనైజర్ విజయభారతి, కోడుమూరు వ్యవసాయాధికారి అక్బర్‌బాషా, గ్రామజ్యోతి సోషల్ ఆర్గనైజర్ నారాయణ పాల్గొన్నారు. -
కప్పట్రాళ్ల అభివృద్ధికి మరింత కృషి
- ఎస్పీ ఆకె రవికృష్ణ - గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ దేవనకొండ : గ్రామస్తులు సహకరిస్తే కప్పట్రాళ్లను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. తాను దత్తత తీసుకున్న కప్పట్రాళ్ల గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ఎస్పీ ప్రారంభించారు. ముందుగా తానా(తెలుగు రాష్ట్రాల సంయుక్త సంఘం) వారి సహకారంతో రూ.10 లక్షలతో నిర్మించనున్న స్త్రీశక్తి భవనానికి భూమి పూజ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం కోరమాండల్, సత్యసాయిట్రస్టు దాతల సహకారంతో రూ.6 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. 15 మంది రైతులకు రాయితీపై వ్యవసాయశాఖ మంజూరు చేసిన ఎద్దులబండ్లు, 18 మందికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ ఉరవకొండ మండల పొదుపు ఐక్యసంఘం, గ్రామజ్యోతి ప్రాజెక్టు వారు కప్పట్రాళ్ల పొదుపు మహిళలను రిసోర్స్‌పర్సన్‌గా గుర్తించారన్నారు. ఇతర రాష్ట్రాల్లో పొదుపు సంఘాలను ఏర్పాటుపై వివరించేందుకు ఇక్కడి వారిని తీసుకెళ్తారన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి స్త్రీశక్తిభవనంలో ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పటివరకు గ్రామంలో 63 పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయన్నారు. పంట రుణాలు పొందిన రైతులు వాటిని సక్రమంగా చెల్లించి మరింత ఎక్కువగా రుణం పొందాలన్నారు. త్వరలో గ్రామంలో మిర్చిప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలను బాగా చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వే చేస్తున్న రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో ఎస్పీ కాసేపు మాట్లాడి వారికి సూచనలు చేశారు. కార్యక్రమంలో తానా ప్రోగ్రాం కన్వీనర్ ముప్పా రాజశేఖర్, కోరమాండల్ ఫర్టిలైజర్ మేనేజర్ చక్రవర్తి, డీఎస్పీలు రమణమూర్తి, బాబాఫకృద్దీన్, ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, సీఐలు విక్రమ్‌సింహా, నాగరాజుయాదవ్, డేగుల ప్రభాకర్, శ్రీనివాసులు, ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, కంబగిరి రాముడు, ఎస్ఐ గంగయ్యయాదవ్, ఏఓలు అక్బర్‌బాషా, అల్తాఫ్ఆలీఖాన్, పత్తికొండ ఏడీఏ నారాయణనాయక్ పాల్గొన్నారు. -
కప్పట్రాళ్ల యువకులకు ఉద్యోగాలు
కర్నూలు : ఓర్వకల్లు మండల పొదుపులక్ష్మి ఐక్యసంఘం సహకారంతో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టులో పనిచేసేందుకు కప్పట్రాళ్లకు చెందిన ఆరుగురు యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ఎస్పీ ఆకే రవికృష్ణ వారికి ఉద్యోగ నియామక కాపీలను అందజేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం మొత్తం 130 క్లస్టర్లు ఉంటాయి. కర్నూలు జిల్లాకు 11 మంది క్లస్టర్లు కేటాయించారు. ఇందులో కప్పట్రాళ్లకు చెందినవారు కౌలుట్లయ్య, ఈరన్న, కంసలి వీరేష్, రవి, దుర్గన్న, శ్రీరాములు ఎంపికయ్యారు. వీరంతా కడప, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో క్లస్టర్లుగా పనిచేస్తారు. వీరికి నెలకు రూ.15 వేలు స్టైఫండరీ కింద అందజేస్తారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మి ఐక్యసంఘం వారికి ఈ ప్రాజెక్టును కేటాయించడంతో నెల రోజుల పాటు అందరికీ శిక్షణ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఫలితాలను బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కప్పట్రాళ్లలో 62 మహిళా సంఘాలు ఉన్నాయన్నారు. కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన పేద కుటుంబాలు, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న విజయభారతికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. -
కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు
– ఎద్దులబండిపై ఎస్పీ దంపతుల ఊరేగింపు దేవనకొండ(ఆలూరు): కప్పట్రాళ్ల గ్రామంలో బుధవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, ఆకె పార్వతి దంపతులు హాజరయ్యారు. వీరికి గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా ఎద్దులబండిపై ఎస్పీ దంపతులను ఊరేగిస్తూ వారిపై పూల వర్షం కురిపించారు. ఎద్దులబండి ముందు బైకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం రూ.25 లక్షలతో కమ్యూనిటీ హల్ భవన ఏర్పాటుకు ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొజ్జమ్మతో కలిసి ఎస్పీ దంపతులు భూమిపూజ చేశారు. కోలాట బృందంతో కోలాటలు ఆడి ఎస్పీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సంతోషంగా గడపాలన్నారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులు.. ఎస్పీ దంపతులకు నూతన వస్త్రాలను సమర్పించారు. గ్రామ ప్రజలతో కలిసి ఎస్పీ దంపతులు చెన్నకేశవస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అంతకముందు ముగ్గుల పోటీలు, టెన్నికాయిట్ తదితర పోటీలను నిర్వహించారు. ఎస్పీ సతీమణి ఆకె పార్వతి.. మ్యాజికల్చైర్స్ ఆటను ఆడారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సంబరాల్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ సీనియర్ మేనేజర్ చక్రవర్తి, దేవియాడ్స్ విజయ్‌భాస్కర్, ఏపీజీబీ రీజినల్ మేనేజర్ ప్రసాద్, యూపీఎల్ కంపెనీ అధినేత మోహన్, రీజినల్ మేనేజర్ గోవర్ధన్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సీఐలు విక్రమ్‌సింహ, రిటైర్డ్ హెచ్ఎం రామరాజు, కోడుమూరు ఏవో అక్బర్‌బాషా, దేవనకొండ ఎస్ఐ గంగయ్యయాదవ్, పంచాయతీరాజ్ ఏఈ మహబూబ్‌బాషా, పీఆర్ ఈఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
కప్పట్రాళ్లను వదలొద్దు.. కరువునే తరమేద్దాం
– గ్రామస్తులతో ఎస్పీ ఆకే రవికృష్ణ – పలు అభివృద్ధి పనులు ప్రారంభం కప్పట్రాళ్ల(దేవనకొండ): కరువు కారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామం నుంచి కరువును తరిమేద్దామని కప్పట్రాళ్ల గ్రామస్తులతో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎస్పీ దత్తత గ్రామంలో శనివారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. స్వయం సహాయక సంఘం మహిళలకు ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని, గ్రామజ్యోతి కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్‌ను ఆకె పార్వతి ప్రారంభించారు. అలాగే గ్రామంలో స్వయం సహాయక సంఘాలకు మంజూరైన వానపాముల షెడ్లకు ఎస్పీ దంపతులు భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలోని రచ్చబండ వద్ద 200 మంది మహిళలకు దీపం పథకం కింద గ్యాస్కనెక్షన్లను ఎస్పీ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే పాఠశాల ఏర్పాటు, సీసీ రోడ్లు నిర్మాణం, ఏపీజీబీ బ్యాంకు ఏర్పాటు, టైలరింగ్ శిక్షణా కేంద్రం తదితర వాటిని ఏర్పాటు చేశామన్నారు. కరువు పరిస్థితుల కారణంగా గ్రామం నుంచి ప్రజలు ఎవరూ వలస వెళ్లరాదన్నారు. స్థానికంగానే ఉపాధి పనులను చూపిస్తామన్నారు. గ్రామ హైస్కూళ్లను అమెరికాలోని తానా వారు దత్తత తీసుకుంటారన్నారు. దాతల సహకారంతో పాఠశాలలకు వచ్చిన ఫ్లడ్‌లైట్లు, ప్లాస్టిక్ పైపులను ఎస్పీ పాఠశాల సిబ్బందికి అందజేశారు. అనంతరం హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఎస్పీ దంపతులు భోజనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సెర్చ్ అడ్వైజర్ విజయభారతి, ఎంపీపీ రామచంద్రనాయుడు, ఆస్పరి జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, రిటైర్డ్ హెడ్మాస్టర్లు శ్రీరామరాజు, మరియానందం, సీఐలు విక్రమ్‌సింహ, డేగుల ప్రభాకర్, కోడుమూరు వ్యవసాయ అధికారి అక్బర్‌బాషా, ఎస్ఐలు గంగయ్యయాదవ్, మధుసూదన్‌రావు, మహేష్‌కుమార్, బ్యాంకు మేనేజర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కప్పట్రాల్లలో దేవాదాయ మంత్రి పర్యటన
దేవరకొండ (కర్నూలు) : పూరాతన దేవాలయాలకు సంబంధించిన భూముల వివరాలను సేకరించి ఇంటర్నెట్లో ఉంచుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆయన మంగళవారం కర్నూలు జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కప్పట్రాల్ల అటవీ ప్రాంతంలో వెలసిన కౌలుట్ల చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఆలూరు ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ఉన్నారు.