పర్వతం.. పాదాక్రాంతం
పర్వతం.. పాదాక్రాంతం
Published Sun, May 28 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
- నాటి బాలకార్మికుడే నేటి పర్వతారోహకుడు
- బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించిన కప్పట్రాళ్ల కుర్రోడు
- మీరతాంగ్ గ్లేసియర్‌లో నిమాస్ కోర్సు
కర్నూలు(హాస్పిటల్) : చిన్నతనంలో చదువు ఒంటబట్టలేదని తల్లిదండ్రులు అతన్ని వలస పనులకు తీసుకెళ్లేవారు. అలాంటి బాలుడు నేడు చదువుకుని దేశంలోని ప్రతిష్టాత్మక పర్వతాలను అధిరోహిస్తున్నాడు. ఎత్తైన బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించడమే గాక మీరతాంగ్ గ్లేసియర్‌లో 28 రోజుల పాటు కఠోర శిక్షణ సైతం తీసుకున్నాడు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన ఓబులేసు, వీరభద్రమ్మలకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు. వీరు తమకున్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూనే గ్రామంలో వ్యవసాయ పనులకు కూలీగా వెళ్లేవారు. ఒక్కగానొక్క కుమారుడైన కె. సురేంద్రను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 4వ తరగతికి వచ్చినా అ,ఆలు సరిగ్గా రావని చదువు మాన్పించి పనికి పంపించారు. తమతో పాటు వలస సమయంలో గుంటూరు జిల్లాకు తీసుకెళ్లేవారు. ఈ దశలో బాలున్ని చూసిన అధికారులు బాలకార్మిక నిర్మూలన పాఠశాలలో చేర్పించి 5వ తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత 10వ తరగతి వరకు బీసీ హాస్టల్‌లో ఉంటూ పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఆదోనిలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సురేంద్రను బాగా చదివించాలని బెంగళూరులో ఉండే పెద్దమ్మ కుమారుడు రవి అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజిలో బీ.కాం చదివించాడు.
పర్వతారోహణకు శ్రీకారం :
గతేడాది నవంబర్‌లో ‘మిషన్ ఎవరెస్ట్’ పై జిల్లా యువజన సంక్షేమ శాఖ ఇచ్చిన ప్రకటన చూసి సురేంద్ర ఆకర్షితుడయ్యాడు. వెంటనే దరఖాస్తు చేసుకుని ఎంపికలో జిల్లాలో రెండవ స్థానాన్ని సాధించాడు. అనంతరం విజయవాడలోని కేతనకొండలో శిక్షణ పొందాడు. అక్కడ నుంచి డార్జిలింగ్‌కు వెళ్లి 20 రోజుల పాటు, సిక్కిం సరిహద్దులోని రాతోం గ్లేసియర్‌లో కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ పొందాడు.
బీసీరాయ్ పర్వతారోహణ :
రాతోంగ్లేషియర్‌లో కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ అనంతరం గతేడాది డిసెంబర్ 9న బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించాడు. నేపాల్‌లో భూకంపం వచ్చిన తర్వాత ఇక్కడ పర్వతారోహణను ప్రభుత్వం నిషేదించింది. తాజాగా మళ్లీ అనుమతినిచ్చింది. ఈ పర్వతారోహణకు మన రాష్ట్రం నుంచి 24 మంది వెళ్లగా చివరకు 12 మంది మాత్రమే అధిరోహించారు. వారిలో ముందుగా పర్వతాన్ని ఎక్కిన రెండవ వాడు సురేంద్ర. ఇక్కడ ఏ గ్రేడ్ వచ్చిన వారందరికీ అడ్వాన్స్ మౌంటేనింగ్ కోర్సు నిమాస్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనింగ్ అల్లాయిడ్ కోర్స్)లో 28 రోజుల పాటు మీరతాంగ్ గ్లేసియర్ (అరుణాచల్ ప్రదేశ్–చైనా బోర్డర్)లో ఈ నెల 8వ తేదీ వరకు శిక్షణ పొందాడు. ఈ సమయంలో 72 కిలోమీటర్ల ట్రెక్కింగ్, 20 వేల అడుగుల ఎత్తు దాకా మీరతాంగ్ గ్లేసియర్‌ను ఎక్కడం, మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ శిక్షణ పొందడం మరిచిపోలేని అనుభూతనిచ్చిందని సురేంద్ర వివరించాడు. ఈ శిక్షణ అనంతరం న్యూమలింగ్ గ్రామంలో 9కిలోమీటర్ల రన్నింగ్ పోటీ నిర్వహించారని ఇందులో ఉత్తీర్ణత సాధించానని చెప్పాడు. దీంతో ప్రపంచంలోని ఏ పర్వతాన్నైనా అధిరోహించేందుకు తనకు అవకాశం లభించిందని, భవిష్యత్‌లో ప్రభుత్వం సహకరిస్తే దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిస్తానని మనసులోని మాట చెప్పాడు.
Advertisement
Advertisement