కప్పట్రాళ్ల యువకులకు ఉద్యోగాలు
Published Wed, Feb 1 2017 12:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కర్నూలు : ఓర్వకల్లు మండల పొదుపులక్ష్మి ఐక్యసంఘం సహకారంతో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టులో పనిచేసేందుకు కప్పట్రాళ్లకు చెందిన ఆరుగురు యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఎస్పీ ఆకే రవికృష్ణ వారికి ఉద్యోగ నియామక కాపీలను అందజేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం మొత్తం 130 క్లస్టర్లు ఉంటాయి. కర్నూలు జిల్లాకు 11 మంది క్లస్టర్లు కేటాయించారు. ఇందులో కప్పట్రాళ్లకు చెందినవారు కౌలుట్లయ్య, ఈరన్న, కంసలి వీరేష్, రవి, దుర్గన్న, శ్రీరాములు ఎంపికయ్యారు. వీరంతా కడప, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో క్లస్టర్లుగా పనిచేస్తారు. వీరికి నెలకు రూ.15 వేలు స్టైఫండరీ కింద అందజేస్తారు.
ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మి ఐక్యసంఘం వారికి ఈ ప్రాజెక్టును కేటాయించడంతో నెల రోజుల పాటు అందరికీ శిక్షణ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఫలితాలను బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కప్పట్రాళ్లలో 62 మహిళా సంఘాలు ఉన్నాయన్నారు. కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన పేద కుటుంబాలు, మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న విజయభారతికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement