టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ సతీమణి పార్వతి
కప్పట్రాళ్లను వదలొద్దు.. కరువునే తరమేద్దాం
Published Sat, Sep 17 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
– గ్రామస్తులతో ఎస్పీ ఆకే రవికృష్ణ
– పలు అభివృద్ధి పనులు ప్రారంభం
కప్పట్రాళ్ల(దేవనకొండ): కరువు కారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామం నుంచి కరువును తరిమేద్దామని కప్పట్రాళ్ల గ్రామస్తులతో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎస్పీ దత్తత గ్రామంలో శనివారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. స్వయం సహాయక సంఘం మహిళలకు ఏర్పాటు చేసిన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని, గ్రామజ్యోతి కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్‌ను ఆకె పార్వతి ప్రారంభించారు. అలాగే గ్రామంలో స్వయం సహాయక సంఘాలకు మంజూరైన వానపాముల షెడ్లకు ఎస్పీ దంపతులు భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలోని రచ్చబండ వద్ద 200 మంది మహిళలకు దీపం పథకం కింద గ్యాస్‌కనెక్షన్లను ఎస్పీ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే పాఠశాల ఏర్పాటు, సీసీ రోడ్లు నిర్మాణం, ఏపీజీబీ బ్యాంకు ఏర్పాటు, టైలరింగ్ శిక్షణా కేంద్రం తదితర వాటిని ఏర్పాటు చేశామన్నారు. కరువు పరిస్థితుల కారణంగా గ్రామం నుంచి ప్రజలు ఎవరూ వలస వెళ్లరాదన్నారు. స్థానికంగానే ఉపాధి పనులను చూపిస్తామన్నారు. గ్రామ హైస్కూళ్లను అమెరికాలోని తానా వారు దత్తత తీసుకుంటారన్నారు. దాతల సహకారంతో పాఠశాలలకు వచ్చిన ఫ్లడ్‌లైట్లు, ప్లాస్టిక్ పైపులను ఎస్పీ పాఠశాల సిబ్బందికి అందజేశారు. అనంతరం హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఎస్పీ దంపతులు భోజనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సెర్చ్ అడ్వైజర్ విజయభారతి, ఎంపీపీ రామచంద్రనాయుడు, ఆస్పరి జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, రిటైర్డ్ హెడ్‌మాస్టర్లు శ్రీరామరాజు, మరియానందం, సీఐలు విక్రమ్‌సింహ, డేగుల ప్రభాకర్, కోడుమూరు వ్యవసాయ అధికారి అక్బర్‌బాషా, ఎస్‌ఐలు గంగయ్యయాదవ్, మధుసూదన్‌రావు, మహేష్‌కుమార్, బ్యాంకు మేనేజర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement