కప్పట్రాళ్ల అభివృద్ధికి మరింత కృషి
కప్పట్రాళ్ల అభివృద్ధికి మరింత కృషి
Published Sun, Mar 26 2017 9:17 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
- ఎస్పీ ఆకె రవికృష్ణ
- గ్రామంలో అభివృద్ధి పనులకు భూమి పూజ
దేవనకొండ : గ్రామస్తులు సహకరిస్తే కప్పట్రాళ్లను మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. తాను దత్తత తీసుకున్న కప్పట్రాళ్ల గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులను ఎస్పీ ప్రారంభించారు. ముందుగా తానా(తెలుగు రాష్ట్రాల సంయుక్త సంఘం) వారి సహకారంతో రూ.10 లక్షలతో నిర్మించనున్న స్త్రీశక్తి భవనానికి భూమి పూజ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం కోరమాండల్, సత్యసాయిట్రస్టు దాతల సహకారంతో రూ.6 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. 15 మంది రైతులకు రాయితీపై వ్యవసాయశాఖ మంజూరు చేసిన ఎద్దులబండ్లు, 18 మందికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ మాట్లాడుతూ ఉరవకొండ మండల పొదుపు ఐక్యసంఘం, గ్రామజ్యోతి ప్రాజెక్టు వారు కప్పట్రాళ్ల పొదుపు మహిళలను రిసోర్స్‌పర్సన్‌గా గుర్తించారన్నారు.
ఇతర రాష్ట్రాల్లో పొదుపు సంఘాలను ఏర్పాటుపై వివరించేందుకు ఇక్కడి వారిని తీసుకెళ్తారన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి స్త్రీశక్తిభవనంలో ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పటివరకు గ్రామంలో 63 పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయన్నారు. పంట రుణాలు పొందిన రైతులు వాటిని సక్రమంగా చెల్లించి మరింత ఎక్కువగా రుణం పొందాలన్నారు. త్వరలో గ్రామంలో మిర్చిప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిల్లలను బాగా చదివించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వే చేస్తున్న రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులతో ఎస్పీ కాసేపు మాట్లాడి వారికి సూచనలు చేశారు.
కార్యక్రమంలో తానా ప్రోగ్రాం కన్వీనర్ ముప్పా రాజశేఖర్, కోరమాండల్ ఫర్టిలైజర్ మేనేజర్ చక్రవర్తి, డీఎస్పీలు రమణమూర్తి, బాబాఫకృద్దీన్, ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, సీఐలు విక్రమ్‌సింహా, నాగరాజుయాదవ్, డేగుల ప్రభాకర్, శ్రీనివాసులు, ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, కంబగిరి రాముడు, ఎస్‌ఐ గంగయ్యయాదవ్, ఏఓలు అక్బర్‌బాషా, అల్తాఫ్‌ఆలీఖాన్, పత్తికొండ ఏడీఏ నారాయణనాయక్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement