చదువుతోనే ఫ్యాక‌్షన్ అంతం
చదువుతోనే ఫ్యాక‌్షన్ అంతం
Published Fri, Jun 2 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
- ఎస్పీ ఆకే రవికృష్ణ
- తండ్రి జ్ఞాపకార్థం కప్పట్రాళ్ల విద్యార్థులకు నగదు బహుమతులు
కర్నూలు: ప్రతి ఒక్కరు చదువుకొని ఫ్యాక‌్షన్‌కు దూరంగా ఉండాలని దత్తత గ్రామం కప్పట్రాళ్లకు చెందిన హైస్కూల్ విద్యార్థులకు ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. కప్పట్రాళ్ల హైస్కూలులో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రంగడు (9.3), శివగణేష్ (9.3), వలిబాషా (9.2) విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతిని కుటుంబ సమేతంగా ఎస్పీ అందజేశారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 57 మంది విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులతో ఎస్పీ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో సివిల్స్ పరీక్షలపై విద్యార్థులకు పలు విషయాలు వివరించి అవగాహన కల్పించారు.
ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే గ్రూప్స్‌కు ప్రిపేర్ కావచ్చన్నారు. ఎలా చదవాలి, ఏ విధంగా సమర్థం కావాలి, ఏయే పుస్తకాలు చూసుకోవాలి, ఎలా రాయాలనే విషయాలను విద్యార్థులకు వివరించారు. తాను కూడా ప్రభుత్వ స్కూలులోనే చదివానన్నారు. కప్పట్రాళ్ల హైస్కూల్‌లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న 50 మంది విద్యార్థులకు టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమంలో భాగంగా యోగా, నైతిక విలువలపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అబ్బాయిలకు ఇండస్ స్కూలులో, అమ్మాయిలకు మాంటిస్సొరి స్కూలులో వారం రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బేబిరాణి, ఇంచార్జి మరియానంద, అధ్యాపకుల బృందం ఆసిఫ్ అలీ, ఆంజనేయులు, చక్రవర్తి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, రామాంజలి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement