నిష్పక్షపాతంగా విచారణ
నిష్పక్షపాతంగా విచారణ
Published Sun, May 28 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
– చెరుకుల పాడు గ్రామంలో ఎస్పీ పర్యటన
– నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ
– వెల్దుర్తి ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు
వెల్దుర్తి రూరల్: చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసును నిష్పక్షపాతంగా విచారిస్తామని ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. ప్రత్యేక విచారణ అధికారిగా డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌ను నియమించామన్నారు. ఆదివారం ఆయన చెరుకులపాడు గ్రామంలో పర్యటించారు. హత్య అనంతరం గ్రామ పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని హతుడు సాంబశివుడు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నారాయణరెడ్డి అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.అలాగే నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి, కుమారుడు మోహన్‌రెడ్డిలను వారి స్వగృహానికెళ్లి పరామర్శించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. హత్యకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ స్కెచ్‌లు వేశారు.. ఫోన్‌లలో ఎవరి ద్వారా సమాచారమందుకున్నారు.. ఎవరికి సమాచారమందించారు..తదితర అన్ని కోణాల్లో విచారణ జరుపుతామన్నారు. నిందితుల విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టుకు అప్పీలు చేసినట్లు చెప్పారు. హత్యకు సంబంధించి వివరాలు, సమాచారం తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా తన నంబరు 9440795500ను సంప్రదించాలన్నారు. జిల్లాలో ఫ్యాక‌్షన్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హత్యలతో రక్తం చిందించడం మానవ ధర్మం కాదని, ప్రతీ మనిషి తన రక్తాన్ని ఆపదలో ఉన్న ఇతరులకు దానం చేయడానికి వాడాలని సూచించారు.
ఎస్‌ఐపై శాఖా పరమైన చర్యలు
చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి అలసత్యం ప్రదర్శించిన వెల్దుర్తి ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎస్‌ఐపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి విచారణ చేపట్టాలని డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ను ఆదేశించారు. ఇప్పటి వరకు తాను ఐదు మెమోలు ఎస్‌ఐకు జారీ చేసినట్లు డోన్ డీఎస్పీ.. ఎస్పీకి తెలిపారు.
ఫిర్యాదులివీ..
నారాయణరెడ్డి హత్యకు పరోక్ష కారణం ఎస్‌ఐ తులసీప్రసాదేనని ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తన భర్త హత్యలో కేఈ శ్యాంబాబుతో పాటు ఎస్‌ఐ పాత్ర ముఖ్యంగా ఉందంటూ కంగాటి శ్రీదేవి ఎస్పీ ఎదుట వాపోయారు. తాను దళిత మహిళా సర్పంచ్, గర్భవతినని తెలిసినా గ్రామంలో పరిస్థితులపై పిర్యాదుకు వెళితే స్టేషన్‌లోనే అవమానాలకు గురిచేసి, అసభ్యంగా మాట్లాడాడని సర్పంచ్ అపర్ణ, ఆమె భర్త శివ ఫిర్యాదు చేశారు. సివిల్ పంచాయితీలు చేస్తూ పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పెద్దిరెడ్డి, అగస్టీన్, ప్రశాంత్ తదితరులు ఎస్‌ఐపై ఆరోపణలు గుప్పించారు.
Advertisement
Advertisement