ముచ్చుమర్రి ఘటనలో ఓ నిందితుడి తాతకు.. అధికార పార్టీ నేతతో 40 ఏళ్లుగా అనుబంధం
పాపను ముక్కలుగా చేసి.. నీటి కుక్కలకు, చేపలకు ఆహారంగా వేసింది అతనే
అందుకే మృతదేహం దొరకలేదని స్థానికుల్లో చర్చ.. అప్పట్లో ఆ నేతకు అడ్డొచ్చిన వారెందరికో ఇదే గతి
బాలిక మృతదేహాన్ని మొసళ్లు తినేసి ఉండొచ్చని పోలీసుల అనుమానం
అసలు బ్యాక్ వాటర్‌లో మొసళ్లే లేవంటున్న స్థానికులు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముచ్చుమర్రికి చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు బాలురులో ఓ బాలుడి తాత.. ఆ నియోజకవర్గంలో అధికార పారీ్టకి చెందిన ఓ నాయకుడి కుటుంబం వద్ద నాలుగు దశాబ్దాలుగా పనిచేసేవాడని తెలుస్తోంది.
1994 ప్రాంతంలో ఆ నాయకుడికి ఫ్యాక్షన్‌లో అడ్డొచ్చిన కొందరిని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి చేపలకు, నీటి కుక్కలకు ఆహారంగా వేసేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో మిస్సయిన వ్యక్తుల ఆచూకీ నేటికీ తెలియలేదని, అదే తరహాలోనే ఇప్పుడు బాలిక శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే పోలీసు వర్గాలు మాత్రం శవాన్ని సంచిలో పడేసి రాయి కట్టడంతోనే దొరకలేదని చెబుతున్నారు. నిజానికి బాలిక పొట్ట కోయకుండా రాయి కట్టి పడేసినా శవం బయటకొస్తుందని కొందరంటున్నారు. బ్యాక్ వాటర్‌లో పడేయడంతో మొసళ్లు ఆహారంగా తీసుకుని ఉంటాయని కొందరు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ మొసళ్లే లేవని గ్రామస్తులు చెబుతున్నారు.
అందుకే మృతదేహం ఇక దొరకదు!
ఈనెల 7న పాత ముచ్చుమర్రిలో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఆరో తరగతి బాలుడు, పదో తరగతి చదివే ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఆపై పాప ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి వెంటనే పాప గొంతు నులిమి చంపేశారు. వీరిలో ఒకడు విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన మిగిలిన తల్లిదండ్రులతో కలిసి.. ఆ చిట్టితల్లిని గోనె సంచిలో వేసి, దానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్‌లో పడేశారు. పోలీసుల విచారణలో ఆ ముగ్గురి పిల్లల తండ్రులు చెప్పిన విషయం ఇది.
అయితే చిన్నారిపై అత్యాచారం చేసింది నిజం.. చంపింది నిజమేగానీ, శవాన్ని మాయం చేసిన విధానంపై చెబుతోంది మాత్రం అబద్ధం. ఈ రెండు ఊర్లే కాదు. ఈ 12 రోజుల్లో ఆ నోటా, ఈ నోటా చర్చ జరిగి ఇప్పుడు కర్నూలు, నంద్యాల రెండు జిల్లాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. పాపను చంపి ముచ్చుమర్రి–హంద్రీ నది అప్రోచ్ చానల్లో పడేశారని మొదట చెప్పారు. ఆ తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద వేశామన్నారు.
శవాన్ని తీసుకెళ్లి సంగమేశ్వరంలో వేశామని మరోసారి చెప్పారు. లేదు.. కొణి§ð ల శ్మశాన వాటికలో పూడ్చామన్నారు.. అయితే వీటిలో ఏదీ వాస్తవం కాదని కొత్త విషయం వెలుగు చూస్తోంది. ముగ్గురి బాలురలో ఒక బాలుడి తాత ఆధ్వర్యంలో బిడ్డను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. ముక్కలను బ్యాక్ వాటర్‌లో అక్కడక్కడా పడేసి ఉంటారని, నీటి కుక్కలు, చేపలు ఈ ముక్కలను తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని.. మరో నెలైనా దొరకదని గ్రామస్తులు చెబుతున్నారు.
ఎక్స్‌గ్రేషియా ఏది?
సాక్షి, నంద్యాల: ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారానికి సంబంధించి ఘటనలో బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం అందజేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించారు. గురువారంతో మూడు రోజులవుతున్నా ఇంత వరకూ బాధిత కుటుంబానికి సాయం అందలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు పరిహారం ప్రకటిస్తే గంటల వ్యవధిలోనే జిల్లా అధికారులు ఆ సాయాన్ని అందించేవారు. సంబంధిత మంత్రులు లేదా జిల్లా కలెక్టర్ బాధితులను కలిసి భరోసా కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్, చంద్రబాబునోరు మెదపరేం?
కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నటి ఎన్నికల ప్రచారం వరకూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయేవారు. ఇప్పుడు టీడీపీతో పాటు తమ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి.. 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరెత్తలేదు. ముఖ్యమంత్రీ స్పందించలేదు.
హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు కావడమేనని చెప్పుకొంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు, వారి తండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని.. అందువల్లే ఘటనను తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment