వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు. ఈ కక్ష ఇప్పటిది కాదు అది ఎప్పటికీ అంతమవుతుందన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి తరుణంలో వేసిన ఓ ప్లాన్ బెడిసికొట్టింది. చేసింది ఎవరు , చేయించింది ఎవరు ? ఎవరు ఎవరిని టార్గెట్‌చేశారన్న విషయం తెలిసి కూడా వాళ్లు మౌనంగా ఉన్నారు.
ఈ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి ? ఇంతకీ ఈ ఫాక్ష్యన్ కసిలో రగిలిపోతున్న ఆ ఊరేంటి? ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెరెడ్డిల మధ్య కొన్నేళ్లుగా రాజకీయకక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీకి చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టు కోసం ఇరువర్గాలు సమయం కోసం ఎదురుచూస్తుంటాయి.
పోలింగ్ తర్వాత ఆళ్లగడ్డలో మరోసారి ఏవీ, భూమాకుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ని చంపేందుకు ప్రయత్నాలు జరగడం, అతడు తృటిలో తప్పించుకోవడంతో మరోసారి ఆళ్లగడ్డ ఉద్రిక్తంగా మారింది. ఈ మర్డర్ ప్లాన్ వెనుక టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
నంద్యాలజిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉందన్న వాదన ఉంది. దానికి ప్రతికారం తీర్చుకునేందుకే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌ని చంపేందుకు ఏవీ సుబ్బారెడ్డి ప్లాన్ వేశారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలినట్టుగా చెబుతున్నారు.
భూమా అఖిల ప్రియ మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించడంలేదు. సరికదా కేసు పెట్టడానికి కూడా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అఖిలప్రియపై పలు కేసులున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఈ కేసు గురించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి ఆమె సిద్ధంగా లేరట.
అందుకే బాడీగార్డ్‌పై జరిగిన హత్యాయత్నం విషయాన్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అటు ఏవీ సుబ్బారెడ్డి తరపు నుంచి కూడా ఎవరూ పెద్దగా ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు ఈ కేసుని తమదైన శైలిలో ముగించే పనిలో ఉన్నారని సమాచారం. ఇంకోవైపు ఆళ్లగడ్డలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నా ప్రజలు మాత్రం ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment