నంది అవార్డులు జిల్లాకే గర్వకారణం
నంది అవార్డులు జిల్లాకే గర్వకారణం
Published Mon, May 1 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
– ‘నంది’ కళాకారుల ర్యాలీలో ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు(కల్చరల్): కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రమీలార్జున పరిణయం నాటకానికి ఏడు నంది అవార్డులు సాధించడం అభినందనీయమని కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఆయన కళాకారుల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రతిభావంతులైన కళాకారులున్నారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాకారులుగా రాణిస్తున్నారన్నారు. రంగస్థల కళాకారులకు ఆదరణ, ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ మే డే సందర్భంగా కార్మికులతో కలసి కర్నూలు కళాకారులు నందుల పండుగ చేసుకుంటున్నారన్నారు. ప్రమీలార్జున పరిణయం నాటకానికి సహకరించిన సాంకేతిక నిపుణులు, నటులందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ర్యాలీలో కళాకారుల పద్యాలు... పాటలు...
కర్నూలు కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన కళాకారుల ర్యాలీ మద్దూర్‌నగర్ మీదుగా సి.క్యాంప్ వరకూ సాగింది. ర్యాలీలో పాల్గొన్న కళాకారులు పద్యాలు, పాటలు పాడుతూ చూపరులను ఆకట్టుకున్నారు. దారి పొడవునా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రమీలార్జున పరిణయంలో నంది అవార్డులు సాధించిన ఓబులయ్య, బాలవెంకటేశ్వర్లు, రామలింగం, శామ్యూల్, లలిత కళాసమితి కార్యదర్శి మహమ్మద్ మియా, ఉపాధ్యక్షులు సి.వి.రెడ్డి, ప్రముఖ రంగస్థల నటుడు చంద్రన్న, ప్రజానాట్యమండలి ఇన్‌చార్జి శేషయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement