
త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటాం: ఎస్పీ
కర్నూలు: పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే సీఐ, డీఎస్పీ, ఎస్‌ఐ ఘటనా స్థలికి చేరుకున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగానే నారాయణరెడ్డి వెపన్ డిపాజిట్ చేశారన్నారు. ఎన్నికల అనంతరం సమాచారం ఇచ్చినా వెపన్ తీసుకోలేదని ఎస్పీ పేర్కొన్నారు. రెన్యువల్ కాలేదని వెపన్ సీజ్ చేసిన సందర్భం గత అయిదేళ్లుగా జిల్లాలో ఒక్కటీ కూడా జరగలేదన్నారు.
ప్రాణహాని ఉన్నవారు హఠాత్తుగానే ప్రయాణాలు చేయాలని తప్ప, ముందస్తుగా ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని ఎస్పీ రవికృష్ణ అన్నారు. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారంతోనే ప్రయాణాలు చేయాలని సూచించారు. ఫ్యాక్షన్ వల్ల జిల్లాతో పాటు పలు గ్రామాలు చాలా నష్టపోతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ వెల్లడించారు.