మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌రెడ్డి
పత్తికొండ టౌన్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్తికొండకు వచ్చిన సీఎం చంద్రబాబు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో కేఈ శ్యాంబాబుకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హత్యకేసుతో టీడీపీ నాయకులకు సంబంధం లేనప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, కేఈ శ్యాంబాబు ప్రతిపక్ష నాయకులను హత్యలు చేస్తున్నాడని ఆరోపించారు.
టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పసుపు–కుంకుమ ఇచ్చినందుకు ఆడపడుచులందరూ తమకే ఓట్లు వేయాలని అడుగుతున్న చంద్రబాబు, జిల్లాలో వందలాదిమంది మహిళల పసుపుకుంకుమలు పోవడానికి కారకులైన కోట్ల, కేఈ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నారాయణరెడ్డి హత్యకేసు నిందితులను పక్కనే పెట్టుకుని, నీతిమాటలు వల్లెవేయడం బాబుకే చెల్లిందన్నారు. అధికారం కోసం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment