డాక్టర్ హత్యకేసులో నలుగురు అరెస్టు
– నాలుగు సెల్‌ఫోన్లు, 2 మోటారు సైకిళ్లు స్వాధీనం
కర్నూలు(టౌన్):
నంద్యాలకు చెందిన డాక్టర్ శైలేంద్రరెడ్డి (38) హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన డాక్టర్ శైలేంద్రరెడ్డి ఈ నెల 26వ తేదీ రాత్రి తన బంధువులను బస్సు ఎక్కించేందుకు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌కు కారులో వెళ్లారు. బంధువులను ఎక్కించిన తరువాత కారును వెనక్కు తీస్తుండగా బైక్‌కు తగిలింది. అక్కడే మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు షేక్ సల్మాన్ (20), షేక్ వలి (23), షేక్ ఇమ్రాన్ (22), కమ్ము బైగారి ముజీబ్ (27) డాక్టర్‌తో గొడవకు దిగారు. అక్కడి నుంచి వెళ్లి పోయిన డాక్టర్‌ను వెంబడించి స్థానికంగా శ్రీనివాస సెంటర్‌లో మరోసారి గొడవ పడి వైద్యుని తలపై బలంగా రాయితో కొట్టారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్‌ను వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డాక్టర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మతుని బంధువుల ఫిర్యాదు మేరకు నంద్యాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హత్య జరిగిన అనంతరం సమీపంలోని ఓ క్యాంటిన్ వద్దకు వెళ్లి చేతులు కడుకున్నట్లు స్పష్టంగా రికార్డు అయ్యింది. ఈ మేరకు నిందితులను గుర్తించి మూలమఠం వద్ద ఉన్న నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి, నంద్యాల వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఐలు రమణ, హరిప్రసాద్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.